బాల్కొండ, వెలుగు: వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పరుగులు తీస్తున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామం భిన్నంగా ఆలోచించింది. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించాలని సోమవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్, ఉపసర్పంచ్ తోట వంశీ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ వారిని సన్మానించారు. ఎంఈఓ బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, డిజిటల్ తరగతులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గురుకుల కోచింగ్, ఉపకార వేతనాలు, ట్రిపుల్ ఐటీలో ప్రవేశ అవకాశాలు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
