బీజేపీలో టికెట్లకు పోటీ.. అర్వింద్​ స్థానంపై ఆసక్తి

బీజేపీలో టికెట్లకు పోటీ.. అర్వింద్​ స్థానంపై ఆసక్తి
  • ఆయా నియోజవర్గాల్లో నలుగురికి మించిన  ఆశావహులు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో  పలు సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి పోటీ ఎక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్మూర్​ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. ఎంపీ అర్వింద్​ ఈ నియోజవర్గం నుంచి పోటీ చేస్తారని చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ స్థానం నుంచి అర్వింద్​ పోటీ చేయకుంటే ఆ టికెట్టును ఆశిస్తున్న వారు ఎనిమిది మంది ఉన్నారు.  దీంతో  పాటు, అర్బన్,  బోధన్​ నియోజకవర్గాల టికెట్లను ఆశిస్తున్న వారు  నలుగురు చొప్పున నేతలున్నారు. 

బోధన్​లో ఎవరు? 

బోధన్​ నుంచి మేడపాటి ప్రకాశ్​ రెడ్డి, మోహన్​రెడ్డి బీజేపీ టికెట్​ఆశిస్తున్నారు.  ఇద్దరు లీడర్లు కలిసి నియోజకవర్గంలో పట్టుపెంచుకుంటున్నారు. స్టేట్​పార్టీ ఆఫీస్​లో పార్టీ వ్యవహారాలు చూసే ఎడపల్లి మండలానికి చెందిన శ్యామ్​ పేరు ఈ మధ్య అనూహ్యంగా తెరమీదికి  వచ్చింది.  ఆయనకు  బీజేపీలోని ముఖ్య లీడర్లతో  సంబంధాలున్నాయి. మహారాష్ట్రలో వ్యాపారవేత్తగా ఎదిగి అక్కడే స్థిరపడిన అశోక్​ కూడా బోధన్​ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.  

 అర్బన్​లో..

అర్బన్​ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ధన్​పాల్​ సూర్యనారాయణ , పార్టీ జిల్లా  ప్రెసిడెంట్​ బస్వా లక్ష్మీనర్సయ్య ముగ్గురూ టికెట్​ రేసులో ఉన్నారు.  ధన్​పాల్​కు 2014, 2018 ఎలక్షన్​లో  బీజేపీ టికెట్​ చేజారింది. దీంతో  ఈసారి ఎలాగైనా పొందాలని ఆయన ఆక్టివ్​ గా ఉన్నారు.  మరోవైపు టికెట్​ తమకే అంటూ  లక్ష్మీనారాయణ  బస్వా లక్ష్మీనర్సయ్య ధీమాలో ఉన్నారు.  నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గంలో దినేశ్​​కులాచారితో పాటు  మరో ఎన్​ఆర్​ఐ పేరు వినబడుతోంది.  

బాల్కొండలో ఇద్దరు

మాజీ మంత్రి ఏలేటి మహిపాల్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ దంపతుల రాజకీయ వారసుడిగా బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్​ మల్లికార్జున్​రెడ్డి  పోటీ చేయాలని నియోజకవర్గంలోనే ఉంటున్నారు. అవకాశం తనకేనని ధీమాతో ఉండగా 2018లో పోటీ చేసిన ఓడిపోయిన న్యాయవాది రియ్యాడి రాజేశ్వర్​ ఆయనకు పోటీగా ఉన్నారు. మెండోర మండలానికి చెందిన రాజేశ్వర్​ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు.

ఎంపీ అర్వింద్​ సస్పెన్స్​..

నిజమాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎంపీ అర్వింద్​  ఆర్మూర్​లోనే  నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.  గతంలోనూ బీజేపీ కార్యక్రమాలకు ఆర్మూర్​ కేంద్రంగా ఉంది.   పలు సందర్భాల్లో ఈ  అసెంబ్లీ ​ స్థానం నుంచి పోటీ చేస్తానని అర్వింద్​ ప్రకటించారు. మరోవైపు ఆర్మూర్​ పైన బీజేపీ హైకమాండ్​ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో  అర్వింద్ కు టికెట్​ దక్కే అవకాశాలున్నాయి.

ఒకవేళ అర్వింద్​ ఈ స్థానం నుంచి పోటీ చేయకపోతే..  ఏకంగా ఎనిమిది మంది ఆశావహులున్నారు.  ఇటీవల బీజేపీలో చేరిన పైడి రాకేశ్​రెడ్డి, పార్టీ జిల్లా  మాజీ ప్రెసిడెంట్లు పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మున్సిపల్​ మాజీ ​ ఛైర్మన్​ కంచెట్టి గంగాధర్​, సీనియర్​ లీడర్ల లోక భూపతిరెడ్డి, కిసాన్​మోర్చా అధ్యక్షుడు నూతల శ్రీనివాస్​రెడ్డి, అల్జాపూర్​ శ్రీనివాస్​, దివంగత మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ ఆలూరు గంగారెడ్డి  కూతురు ఆలూరు విజయ  పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.