పోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు

పోడు పట్టాలివ్వాలంటూ ఆందోళన.. జీపీకి తాళం వేసిన రైతులు

వర్ని, వెలుగు :  అర్హులైన తమకు పట్టాలివ్వాకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ మంగళవారం పలువురు పోడు రైతులు నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం సైద్‌‌పూర్‌‌ గ్రామ పంచాయతీకి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 250 మంది పోడు భూములకు సంబంధించి పట్టాలివ్వాలని దరఖాస్తు చేసుకోగా 80 మందికి మాత్రమే పట్టాలిచ్చారని ఆరోపించారు. జీపీ సిబ్బంది ఇష్టానుసారంగా లిస్టు పంపడంతో తమకు పట్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని డిమాండ్‌‌ చేశారు. చివరకు తాళం తీసి తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రంఇచ్చారు. 

కథలాపూర్​లో.. 

కథలాపూర్:  పోడు భూములకు పట్టాలివ్వాలని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పోతారం తండా, ఇప్పపెల్లి తండా, జెమానాయక్ కలికోట తండా, కలికోట తండా, కొచ్చగుట్ట తండా, తుర్తితండా, తాండ్రియాల తండా, భూషణ్ రావు పేట తండా, రాజారాం తండాలకు చెందిన గిరిజనులు ధర్నా చేశారు. 20 ఏండ్లుగా భూములు సాగు చేస్తున్నప్పటికి పట్టాలివ్వలేదని, విషయాన్ని కలెక్టర్, డీఎఫ్​వోల  దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వీరికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అజీం మద్దతు పలికారు. తర్వాత తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.