మా ఊరికి మీరేం చేశారు..నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు

మా ఊరికి మీరేం చేశారు..నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు

బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యేను కూడా ప్రశ్నిస్తూ ఓ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. మంగళవారం (జూన్ 20న) నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వెద గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ.. స్థానికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పలు ప్రశ్నలను సంధిస్తూ.. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

ఇటు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సి గ్రామంలోనూ ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ప్రశ్నిస్తూ..ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. బాడ్సి గ్రామానికి మీరు ఏం చేశారని ప్రశ్నిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మావోయిస్టుల స్తూపం వద్ద ఏర్పాటు చేశారు. గ్రామంలోని మూడు ప్రధాన చౌరస్తాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఫ్లెక్సీలో ఉన్న ప్రశ్నలు ఇవే.. 

1. రైతులకు రుణమాఫీ ఎక్కడ..?
2. మా ఊరిలో దళిత బంధు లేదా..?
3. బీసీ బందు అందరికీ ఎప్పుడు..?
4. పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు ఎటుపాయే?
5. మన ఊరు మనబడి అంటివి పేద పిల్లల ఉసురుపోసుకుంటివి?
6. కొత్త బీడీ పింఛన్లు యాడికి పోయే?
7. కొత్త రేషన్ కార్డులు కొత్త పేర్లు నమోదు ప్రక్రియ యాడికి పోయే?
8. మీ ఎమ్మెల్యే నిధుల నుంచి మా ఊరికి ఏదైనా ఇచ్చారా..?