చందాలతో రోడ్డేసుకున్నం.. ట్విట్టర్లో కేటీఆర్ కు కంప్లైంట్

చందాలతో రోడ్డేసుకున్నం.. ట్విట్టర్లో కేటీఆర్ కు కంప్లైంట్

అది బాచుపల్లిలోని సాయి అనురాగ్​ కాలనీ. ఈమధ్య కురిసిన ముసురు వానలకు అక్కడి రోడ్డు పూర్తిగా దెబ్బతింది.  రహదారిపై తారు మొత్తం లేచిపోయి రాళ్లు తేలాయి. రోడ్డుపై నడవడం కష్టంగా మారడంతో స్థానికులు నిజాంపేట మున్సిపల్​ అధికారులను రోడ్డు రిపేర్​ చేయాలని కోరారు. స్పందన లేకపోవడంతో తలా కొంత చందా వేసుకుని రూ.2 లక్షలతో తాత్కాలికంగా రోడ్డేసుకున్నారు. ఈ విషయాన్ని టీఆర్​​ఎస్ ​వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​తో పాటు జీహెచ్​ఎంసీ కమిషనర్ కు​ ట్విట్టర్​ ద్వారా తెలియజేశారు.

బాచుపల్లి, వెలుగు:  కాలనీలోని ప్రధాన రోడ్డు పూర్తిగా దెబ్బతిందని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. నడవలేక పోతున్నామని, పిల్లలను స్కూల్స్​కు పంపాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని విన్నవించినా పట్టించుకోలేదు. అధికారుల తీరుపై టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. చివరికి చేసేదేమీ లేక కాలనీవాసులే ఏకంగా తాత్కాలికంగా రోడ్డు వేసేసుకున్నారు. చందాలు వసూలు చేసి మరమ్మతులకు పూనుకున్నారు. బాచుపల్లి–మియాపూర్ మెయిన్ రోడ్డు నుంచి సాయిఅనురాగ్ కాలనీకి వెళ్లే రోడ్డు వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. కొట్టుకుపోయి కంకర తేలింది. హెవీ వెహికల్స్​ఎక్కువగా తిరుగుతుండటంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితిపై నిజాంపేట మున్సిపల్ అధికారులకు కాలనీవాసులు వారం రోజుల క్రితం కంప్లెయింట్​ చేశారు. అధికారులు స్పందించలేదు. ఈనెల 5వ తేదీన కేటీఆర్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో కాలనీ వాసులే తలాకొంత చందాలు వేసుకున్నారు. కంకర, జేసీబీ, కూలీలను పిలిపించారు. కనీసం నడిచేందుకు వీలుగా రోడ్డును సరిచేశారు. ఒకవేళ మళ్లీ వర్షం పడితే రోడ్డు పరిస్థితి తిరిగి మొదటికొస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు  పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పట్టించుకోపోతే ధర్నాకు దిగుతాం

మా కాలనీలోకి వెళ్లడానికి ఇదొక్కటే మార్గం. అది కాస్త వానలకు పూర్తిగా ఖరాబ్ అయ్యింది. మున్సిపల్​అధికారులు పట్టించుకున్ప పాపాన పోతలేరు. టిట్టర్​లో కేటీఆర్ కు చెప్పినా కూడా అధికారులకు ఉలుకు పలుకు లేదు. చేసేదేమీ లేక చందాలతో కాస్త కంకర, మొరం తెప్పంచి తాత్కాలికంగా మంచిగ చేసుకున్నాం. స్పందించకపోతే కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం.

-రామా గౌడ్, కాలనీ ఆధ్యక్షుడు

ఇదొక్కటే దిక్కు

వరుస వర్షాలకు కాలనీ రోడ్డు కంకర తేలింది. కాలనీ నుంచి మెయిన్ రోడ్డుకు రావాలంటే ఇదొక్కటే దిక్కు. అదే పూర్తిగా బురదమయంకావడంతో కనీసం నడవడానికి కూడా వీలు కావట్లే.  మున్సిపల్​అధికారులు పట్టించుకోవట్లే. కాలనీ తరుఫున కేటీఆర్​కు ట్విట్టర్​లో ఫిర్యాదు చేశాం. ఇప్పటికైనాఅధికారులు పట్టించుకోవాలి.

-జితేందర్ రెడ్డి, సాయి అనురాగ్ కాలనీ