నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు 6 విడతల్లో నీరందిస్తాం

నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు  6 విడతల్లో నీరందిస్తాం
  • ప్రాజెక్ట్​ నుంచి దిగువకు నీరు విడుదల చేసిన స్పీకర్ పోచారం 

నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నుంచి వానాకాలం పంటల సాగుకు బుధవారం ప్రధాన కాలువ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆయకట్టు భూములకు వానాకాలం పంటల సాగుకోసం 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. పంటల సాగుకోసం 10 టీఎంసీ ల నీరు అవసరముందని, ఈ నీటిని 6 విడతల్లో విడుదల చేస్తామన్నారు. వర్షాలు లేక ప్రాజెక్ట్​నిండకుంటే సింగూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీ ల నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద జుక్కల్, బాన్స్​వాడ, బోధన్ నియోజకవర్గం పరిధిలోని అలీసాగర్ వరకు ఉన్న మొదటి పేజ్ లోని 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చివరి ఆయకట్ట వరకు సాగునీరు  చేరేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. నవంబర్ లో వచ్చే తుపానుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు నాట్లు వేసుకోవాలని సూచించారు. 

గతంలో ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేయాలంటే సీఎం ఆఫీస్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగే పరిస్థితులు ఉండేవని, సీఎం కేసీఆర్ చొరవతో ప్రస్తుతం సరైన సమయంలో నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ,సాగునీటి రంగాల్లో 70 ఏళ్లలో సాధించని ప్రగతిని, గత 7 ఏళ్లలో సాధించామన్నారు. 2014 లో రాష్ట్రంలో 36 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, నేడు 3 కోట్లకు చేరిందన్నారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లుల కెపాసిటీ సరిపోవడంలేదన్నారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ప్రాజెక్ట్​సీఈవో శ్రీనివాస్, ఆర్డీవో రాజాగౌడ్ పాల్గొన్నారు.