ఏ పార్టీతో పొత్తు లేదు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: బీఎల్ సంతోష్

ఏ పార్టీతో పొత్తు లేదు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: బీఎల్ సంతోష్
  • రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం
  • వచ్చే ఎన్నికల్లో మోదీనే మన ట్రంప్ కార్డు
  • పార్టీ స్టేట్ ఆఫీసు బేరర్లతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్థి బీఆర్‌‌ఎస్సేనని, ఆ పార్టీని ఓడించి అధికారంలోకి రావడమే పార్టీ లక్ష్యమని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మొద్దని, తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని సూచించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పార్టీ ఆఫీసు బేరర్ల మీటింగ్‌కు బీఎల్ సంతోష్ చీఫ్​గెస్టుగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. ‘‘మనకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. స్నేహం అంతకన్నా లేదు.. మన విధానాలు, సిద్ధాంతాలు ఎప్పుడూ మారవు. గత 30 ఏండ్లుగా ఇదే సిద్ధాంతంతో మనం దేశంలో, ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే సిద్ధాంతంతో పవర్‌‌లోకి వస్తాం.. ఈ సిద్ధాంతాలు నచ్చిన వారు పార్టీలో ఉంటారు. నచ్చని వారు పోతారు. వారి గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని తేల్చి చెప్పారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరచాలని సూచించారు. ‘‘తెలంగాణకు మూడు ముఖ్యమైన వాటిని మోదీ సర్కార్ ఇచ్చింది. దీనికి అనుకున్న స్థాయిలో మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. మనం సోషల్ మీడియా ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మోదీయే మన ట్రంప్ కార్డు’’ అని చెప్పారు.

కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత: ప్రకాశ్ జవదేకర్

బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదేనన్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌ సునీల్ బన్సల్ మాట్లాడుతూ.. బూత్ కమిటీల నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వద్దని, పార్టీ బలోపేతానికి అవే పునాదులనే విషయాన్ని విస్మరించరాదని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. సభలకు పలువురు జాతీయ స్థాయి ముఖ్య నేతలు హాజరవుతున్నందున వాటిని సక్సెస్ చేసేందుకు, జన సమీకరణపై స్థానిక నేతలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శుక్రవారం జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ లో ప్రవేశపెట్టే ఎజెండాపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ కోసం ఏం చేస్తామనే దానిపై రాజకీయ తీర్మానం పెట్టాలని నిర్ణయించామని పార్టీ నేతలు చెప్పారు.

3 ఉమ్మడి జిల్లాలకో క్లస్టర్

ఆఫీసు బేరర్ల మీటింగ్ తర్వాత క్లస్టర్ల వారిగా మీటింగ్ జరిగింది. మూడు ఉమ్మడి జిల్లాలకు ఒక క్లస్టరుగా విభజించి.. ఒక్కో నేత ఆ క్లస్టర్ లో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేశారు. ఒక క్లస్టర్ కు తరుణ్ చుగ్, మరో క్లస్టర్ కు సునీల్ బన్సల్, ఇంకో క్లస్టర్ కు ప్రకాశ్ జవదేకర్ అటెండ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, నేతలు లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, పార్టీ సహ ఇన్‌చార్జ్‌ అరవింద్ మీనన్, ఇతర నేతలు, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు,  జిల్లా ఇన్‌చార్జ్‌లు, ఆఫీసు బేరర్లు హాజరయ్యారు.