నాగార్జున సాగ‌ర్‌ కు తగ్గిన వరద .. శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 64,753 క్యూసెక్కులు రాక

నాగార్జున సాగ‌ర్‌ కు తగ్గిన వరద .. శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 64,753 క్యూసెక్కులు రాక
  • సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల తేదీపై ఇంకా రాని స్పష్టత
  • ఆయకట్టు కింది వరి నారు పోసి సాగుకు ఎదురు చూస్తున్న రైతులు

హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ డ్యామ్ లోకి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. గత నెలలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి పది రోజులుగా వరద కొనసాగింది. ప్రస్తుతం తగ్గడంతో గేట్లను మూసివేశారు. ఇక శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తూ 68,753 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తుండగా.. ఎగువ నుంచి వచ్చే వరద నిలకడగా ఉంది. కృష్ణా నదికి ముందుగానే వరదలు రావడంతో శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడంతో క్రస్ట్​ గేట్లను ఎత్తారు. 

దీంతో గత నెలలో 512 అడుగులతో డెడ్ స్టోరేజ్ కి చేరిన సాగర్ నీటిమట్టం కేవలం 15 రోజుల్లోనే 45 అడుగుల మేర పెరిగింది. సాగర్​కు 64,789 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 557 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 225 టీఎంసీలుగా ఉంది.  సాగర్ నుంచి హైదరాబాద్ సిటీకి తాగునీటి అవసరాలకు ఎస్ఎల్ బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా.. ఈసారి ముందస్తు వానలతో వచ్చిన వరదతో సాగర్ ఆయకట్ట కింద రైతులు వరి నారు మడులను పోశారు. ఎడమకాల్వకు నీటి విడుదల తేదీని ప్రకటిస్తే వరి నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

  సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల విషయంపై సోమవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. తిరుమలగిరిలో ముఖ్యమంత్రి సభతో వాయిదా పడింది . మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది ఖరారు చేయలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద సుమారు 4 లక్షల ఎకరాలు, ఎత్తిపోతలు, వరద కాల్వ కింద మరో 30 వేల ఎకరాలు సాగులో ఉంది.