
న్యూఢిల్లీ: తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తమ రాష్ట్రంలో అంటే తమ రాష్ట్రంలో భారీ ఇన్వెస్ట్‌మెంట్లు పెడుతుందని, లక్ష మందికి ఉద్యోగాలిస్తుందని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి. కానీ, కంపెనీ మాత్రం ఇండియాలో కొత్త ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. తమ కంపెనీ చైర్మన్, సీఈఓ యంగ్ లీ ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ డెఫినెటివ్ అగ్రిమెంట్‌ను కుదుర్చుకోలేదని తెలిపింది. హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీగా కూడా పిలిచే ఫాక్స్‌కాన్ దేశంలో యాపిల్, షావోమి ఫోన్లను తయారు చేస్తోంది. జీరో కొవిడ్ పాలసీ, అమెరికా– చైనా మధ్య సంబంధాలు దెబ్బతింటుండడంతో చైనా నుంచి తన మాన్యుఫాక్చరింగ్ బేస్‌ను షిఫ్ట్ చేయాలని యాపిల్, ఫాక్స్‌కాన్‌లు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇండియాలో తమ ప్రొడక్షన్‌ను పెంచాయి. ఈ నేపథ్యంలో దేశంలో మరిన్ని కొత్త ఇన్వెస్ట్‌మెంట్లను ఫాక్స్‌కాన్ పెడుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి.
డీల్స్ చర్చల్లోనే
ఈ ఏడాది ఫిబ్రవరి 27 – మార్చి 4 మధ్య కంపెనీ చైర్మన్ యంగ్ లీ ఇండియాలో పర్యటించారని, ఆయన ఎటువంటి డీల్స్‌ను ఫైనలైజ్ చేయలేదని ఫాక్స్‌కాన్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ‘ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ల కోసం బైండింగ్, డెఫినెటివ్ అగ్రిమెంట్‌ను ఫాక్స్‌కాన్ కుదుర్చుకోలేదు. చర్చలు, రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీడియాలో వస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ నెంబర్లు ఫాక్స్‌కాన్ చెప్పినవి కావు’ అని వెల్లడించింది. మీడియాలో వస్తున్నట్టు ‘లక్ష ఉద్యోగాలను క్రియేట్ చేయడం’, కంపెనీ ఇచ్చే డైరెక్ట్ జాబ్స్‌కు మధ్య పొంతన లేదని పేర్కొంది. ‘ఇండియాతో పార్టనర్‌షిప్‌ను మరింత బలపరుచుకోవడం, సెమికండక్టర్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి కొత్త సెగ్మెంట్లలో సహకారమే లక్ష్యంగా ఈ వారం నా ట్రిప్ కొనసాగింది’ అని యంగ్ లీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీతో కిందటి వారం లీ సమావేశమయ్యారు. దేశంలో టెక్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలపరచడంపై చర్చలు జరిగాయని మోడీ ట్వీట్ చేశారు కూడా.
కర్నాటక, తెలంగాణ రెండూ..
ఫాక్స్‌కాన్ తమ రాష్ట్రంలో 700 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుందని కర్నాటక సీఎం బసవరాజ్ ఎస్ బొమ్మై ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో యాపిల్ తన ఫోన్లను తయారు చేస్తుందని , దీంతో సుమారు లక్ష ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. బ్లూమ్‌బర్గ్ కూడా బెంగళూరుకు దగ్గరలో ఫాక్స్‌కాన్ తన కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని రిపోర్ట్ చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తులు చెప్పారంటూ పేర్కొంది. అలానే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి విషయాన్ని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి యంగ్ లీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ మాత్రం కొత్త ఇన్వెస్ట్‌మెంట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది.