
- పంపింగ్ నిర్ణయం వాయిదా
- జంట జలాశయాలు, సింగూరు, మంజీరాలోనూ కావాల్సినన్ని నీళ్లు
- వారం ముందే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ ప్రకటన
- రెండు, మూడు భారీ వానలు పడితే నీటి సమస్య అసలే ఉండదని అంచనా
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఏప్రిల్ నెలలో గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాలకు నీటి డిమాండ్ పెరగడం, జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వాటర్‌బోర్డు అధికారులు పంపింగ్ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, అధికారులు ఇప్పుడీ ఆలోచనను వాయిదా వేసుకున్నారు.
వర్షాలతో ప్రాజెక్టుల్లో గతేడాది కంటే ఎక్కువ నీళ్లే ఉండడం, వాటర్‌బోర్డు నీటి వృథాను అరికట్టడం, పక్కా ప్లానింగ్‌తో నీటి సరఫరా చేయడం, వాతావరణ శాఖ కూడా వారం ముందే రుతు పవనాల ప్రవేశం ఉంటుందని ప్రకటించడంతో పంపింగ్ అవసరం ఉండకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. అనుకున్నట్టే, రెండు, మూడు భారీ వర్షాలు పడితే ప్రాజెక్టుల్లోకి నీళ్లు చేరి నీటి గండం గట్టెక్కుతుందని అనుకుంటున్నారు.
గత ఏడాది కంటే ఎక్కువే..
నగరానికి తాగునీటిని అందించే నాగార్జున సాగర్పూర్తి కెపాసిటీ 312.05 టీఎంసీలు కాగా, ఏప్రిల్‌నాటికి ఈరిజర్వాయర్లో నీళ్లు153.870 టీఎంసీలకు పడిపోయాయి. దీంతో మే 15వ తేదీ నుంచి పంపింగ్‌కు వాటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల12వ తేదీ నాటికే నీటి నిల్వలు137 టీఎంసీలకు చేరాయి. అయినా, అధికారులు పంపింగ్పనులను వాయిదా వేయాలని చూస్తున్నారు. గతేడాది ఇదే నెలలో నాగార్జున సాగర్‌లో123 టీఎంసీలుండగా, ప్రస్తుతం14 టీఎంసీల నీరు అధికంగా ఉంది.
ఇది నగర అవసరాలకు సరిపోతుందని, అందుకే పంపింగ్అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అలాగే, గోదావరి జలాల విషయంలోనూ ఇదే జరిగింది. గత ఏడాది ఇదే నెలలో ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో 5.942 టీఎంసీల నీరుండగా, ప్రస్తుతం 8.197 టీఎంసీలు ఉంది. దీంతో ఎల్లంపల్లి నుంచి కూడా పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేయాలనుకుంటున్న అధికారులు మరి కొంత కాలం వేచి చూడాలని అనుకుంటున్నారు.
వర్షాలతో ఊరట..
నగరంలో రోజుకు 550 ఎంజీడీల నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు 1.20 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే, ప్రస్తుతం అన్ని జలాశయాల్లో అవసరాలకు తగ్గట్టుగా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో గత ఏడాది 2.331 టీఎంసీలు ఉంటే ఈసారి అది 2.765 టీఎంసీలకు చేరింది. హిమాయత్‌సాగర్‌లో గత ఏడాది 1.963 టీఎంసీలు ఉంటే, ఈసారి 2.110 టీఎంసీలకు చేరింది. ఇదే పరిస్థితి సింగూరు, మంజీరాల్లోనూ ఉంది.
దీంతో నాగార్జున సాగర్, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేసే అవసరం ఉండకపోచ్చని అధికారులు ధీమాతో ఉన్నారు. పైగా రోజు రోజుకూ వాతావరణం చల్లబడుతుండడం, సోమవారం కూడా నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడడం, ఇవి కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ ప్రకటించడం, రెండు మూడు వారాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలోఈసారి గ్రేటర్ పరిధిలో నీటి సమస్య దాదాపు తీరినట్టేనని అధికారులు చెబుతున్నారు.
వాటర్‌బోర్డు పనితనం భేష్..
ఈ వేసవిలో గ్రేటర్లో నీటి కొరత లేకుండా వాటర్‌బోర్డు అన్ని రకాల చర్యలు తీసుకుంది. ప్లాన్ప్రకారం నీటి సరఫరా చేయడంతో పాటు ట్యాంకర్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏప్రిల్‌నుంచి మే మొదటి వారం నాటికి గ్రేటర్లో రోజుకు దాదాపు 12వేల ట్యాంకర్లు బుకింగ్జరగ్గా ప్రస్తుతం 10 నుంచి 11వేల లోపే జరుగుతున్నాయి. ఈ సంఖ్య కూడా రాను రాను తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోర్లు ఎండిపోవడంతో మార్చి, ఏప్రిల్మాసాల్లో వెస్ట్‌సిటీలో నీటికి డిమాండ్ఏర్పడిందని, దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువ నీటిని సరఫరా చేసేందుకు లీకేజీలను అరికట్టడంపై దృష్టి పెట్టామని, ఇందులో సక్సెస్అయినట్టు చెప్తున్నారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ కాండ్యూట్లీకేజీని అరికట్టడంతో పాటు, అదనంగా బండ్లగూడ జాగీర్, షేక్‌పేట, హిమాయత్సాగర్తదితర ప్రాంతాల్లో ప్రెషర్ఫిల్టర్లు (మినీట్రీట్మెంట్ప్లాంట్లు) ఏర్పాటు చేసి స్థానిక అవసరాలకు నీటిని సరఫరా చేశామని చెప్పారు. దీని వల్ల చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా పోయిందంటున్నారు. గాజుల రామారం, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో మిషన్‌భగీరథ నీటిని అక్కడికి సరఫరా చేశామని, ఇలాంటి చర్యలతో నగరంలో నీటి సమస్య 90శాతానికి పైగా పరిష్కారమైందని అంటున్నారు.
గ్రేటర్ సిటీకి సరఫరా అయ్యే వివిధ జలాశయాల్లోని నీటి నిల్వలు(టీఎంసీల్లో)
జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం గతేడాది ప్రస్తుతం
ఉస్మాన్‌సాగర్ 3.900 2.331 2.765
హిమాయత్ సాగర్ 2.967 1.963 2.110
సింగూరు 29.917 15.386 18.054
మంజీరా 1.500 0.535 0.691
ఎల్లంపల్లి 20.175 5.942 8.197
నాగార్జున సాగర్ 312.054 123.010 137.340