స్నాన ఘట్టాల దగ్గరకు సందర్శకులకు నో ఎంట్రీ

స్నాన ఘట్టాల దగ్గరకు సందర్శకులకు నో ఎంట్రీ

ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నాన ఘట్టాల దగ్గరకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4లక్షల 44వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కృష్ణలంక, భూపేష్  గుప్తా కాలనీ, రామలింగేశ్వరనగర్  తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతా పెరుగుతోంది. 38 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్ల వరకు వరద నీరు చేరింది.  జూరాల ప్రాజెక్టుకు 2 లక్షల 65 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2 లక్షల 70 వేల ఔట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9 TMCలు కాగా ప్రస్తుతం 7 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.