మన ఊరు – మన బడి : పైసలు లేక ముందుకు సాగని పనులు

మన ఊరు – మన బడి : పైసలు లేక ముందుకు సాగని పనులు
  • మన ఊరు – మన బడికి నిధులేవీ?
  • పైసలు లేక ముందుకు సాగని పనులు
  • 2022-23 అకడమిక్ ఇయర్​కు ఇచ్చింది కేవలం రూ.299 కోట్లే 
  • తాజా బడ్జెట్లో పైసా కూడా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం 
  • కేంద్రం నిధులు, విరాళాలే ఆధారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లలో అన్ని ఫెసిలిటీస్​కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మన ఊరు –  మన బడి’ కార్యక్రమానికి నిధుల కొరత కన్పిస్తోంది. స్టేట్​లోని 26,065 సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల కింద మనఊరు – మనబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రూ.7,289.54 కోట్లతో మూడు దశల్లో దీన్ని పూర్తిచేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. తొలిదశలో ఎక్కువ మంది స్టూడెంట్స్​చదువుతున్న 9,123 బడులను ఎంపిక చేసి.. రూ.3,497.62 కోట్లు ఖర్చుచేస్తామని వెల్లడించింది. కానీ, నిధులిచ్చే విషయంలో మాత్రం సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. 2022–23 అకడమిక్ ఇయర్​లో కేవలం రూ.299.33 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు సర్కారు ఇటీవల ప్రకటించింది. అయితే, వాటితో ఏ కార్యక్రమాలు చేపట్టిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

పలుచోట్ల ఆగిన పనులు  

మన ఊరు – మన బడి కార్యక్రమానికి సమగ్ర శిక్ష, అసెంబ్లీ నియోజకవర్గ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్, జిల్లా, మండల పరిషత్, ఉపాధి హామీ స్కీమ్, టీఎస్​పీ అండ్ ఎస్​సీఎస్​పీ ఫండ్స్​తో పాటు నాబార్డ్ నుంచి నిధులు సమీకరిస్తామని సర్కారు చెప్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. తొలిదశలో 9,123 బడులను ఎంపిక చేస్తే.. దాంట్లోనూ ఈ ఏడాది మండలానికి రెండు స్కూళ్లను మాత్రమే ఎంపిక చేసి 1,200 బడులనే డెవలప్ చేశారు. అందులో కొన్నింటిని మాత్రమే ఇటీవల ప్రారంభించారు. మిగిలిన స్కూళ్లలో నిధులు లేక పనులన్నీ ఆపేశారని హెడ్మాస్టర్లు చెప్తున్నారు. కొన్ని బడుల్లో గదులను కూల్చేయడంతో క్లాస్​రూములు లేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతన్నారు. ఒకే రూములో రెండు, మూడు క్లాసులు నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇప్పటికీ 30 లక్షలకు పైగా పనులకు టెండర్లు కూడా పూర్తికాలేదు. సర్కారు గతంలో టెండర్లు పిలిచినా.. సంస్థలు పెద్దగా ముందుకు రాలేదని తెలుస్తోంది. 

పనుల వివరాలు సీక్రెట్..

సర్కారు ఎంతో ఆర్భాటంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం పనులను సీక్రెట్​గా ఉంచుతోంది. ఏ స్కూల్​లో ఎంత ఖర్చు చేస్తామనే వివరాలను బయటకు చెప్పడం లేదు. దీనికోసం ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వెబ్ సైట్​పెట్టినా.. దాంట్లో ఏ వివరాలూ లేవు. కనీసం జిల్లాల వారికి ఏ ఫేజ్​లో ఎన్ని స్కూళ్లు, ఏ బడుల్లో ఏ పనులు చేస్తారనే అంశాలనూ బహిర్గతం చేయడం లేదు. అలాగే, ఎక్కడి నుంచి ఎన్ని నిధులు వచ్చాయి.. ఎన్ని ఖర్చు చేశారు అనే అంశాలనూ బయటకు చెప్పడం లేదు. స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అధికారులను వివరాలు అడిగితే, విద్యాశాఖ సెక్రటరీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు చెప్తున్నారు.  వారిని అడిగితే.. స్కూల్ ఎడ్యుకేషన్ వారి వద్దే ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో సర్కారు చేసే మంచి పనుల వివరాలనూ బయటకు చెప్పకుండా సీక్రెట్​గా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కేంద్రం నిధులు, లోన్లు, విరాళాలపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడినట్టు తెలుస్తోంది. అలాగే, ఫస్ట్ ఫేజ్​ పనులే నత్తనడకన సాగుతుండటంతో, మొత్తం పనులు పూర్తికావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్న వాదనలు వినిపిస్తున్నాయి.