పైసలకు తక్లీఫ్ పడుతున్న సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్మెంట్

పైసలకు తక్లీఫ్ పడుతున్న సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్మెంట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వానాకాలం వరికోతలు జోరందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కొనుగోలు సెంటర్లకు ధాన్యం వస్తోంది. అయితే  సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ దగ్గర వడ్లు కొనేందుకు అవసరమైన పైసలకు తక్లీఫ్ ఉంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు రూ.19,500 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.  సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ దగ్గర అన్నీ కూడగట్టినా చారాణ మందం లేవు. మిగతా పైసలు ఎట్లని  అధికారులు పరేషాన్‌‌‌‌లో ఉన్నారు.  ఇప్పటికే అప్పులెక్కువై ఆగమవుతున్న ఆ శాఖకు మళ్లీ అప్పులు ఇయ్యాలంటే బ్యాంకర్లు జంకుతున్నరు.  నాబార్డు పావులా వంతు పైసలు ఇస్తామని టెండర్‌‌‌‌ దాఖలు చేసి ముందుకు వచ్చినా ఎక్కువ వడ్డీకి ఇస్తామంటోంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నరు. కొనుగోళ్లకు అవసరమైన పైసలు లోన్లు  తీసుకోకపోతే వడ్లు కొనడం కష్టమేనని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు నామమాత్రంగానే షురూ అయ్యాయి. 6713 కొనుగోలు సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు చేసిన సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పటి వరకు 612 సెంటర్లు తెరిచింది. 3 జిల్లాల్లోని సెంటర్ల నుంచి ఇప్పటికీ  1134 టన్నుల వడ్లు కొన్నారు. రూ.2 కోట్ల విలువైన వడ్లు మాత్రమే కొన్నరు. ఇకపై ముమ్మిరి కొనుగోళ్లు షురూ అయితే పైసలు ఎట్ల సమకూర్చాల్నో అర్థంకాని పరిస్థితి. 

అప్పులు వేలకోట్లకు పెరిగినయ్‌‌‌‌..

సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్​కు అప్పులు పెరిగిపోయినయ్‌‌‌‌. 2021 – 22 నాటికే బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ.33,787.26 కోట్లకు చేరాయి. సర్కారు పైసా సాయం చేయట్లేదు. ఏటా మిత్తీలు వందల కోట్ల నుంచి వేల కోట్లకు పెరిగాయి. వడ్ల కొనుగోళ్ల నిర్వహణ వల్ల డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు వచ్చిన కమిషన్‌‌‌‌ కూడా పాత అప్పులకు మిత్తీలు కట్టడానికే సరిపోతలేవు. 

బ్యాంకులు ముందుకు రావట్లే.. అప్పు పుట్టట్లే..

సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు పాతబాకీలు  పెరిగిపోవడంతో అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావట్లేదు. వడ్లు గింజలేకుండా కొంటున్నమని చెప్పుకునుడు తప్ప రాష్ట్ర సర్కారు పైసా ఇస్తలేదు.  బ్యాంకు గ్యారంటీ ఇచ్చి చేతులు దులుపుకుంటుండడంతో కొనుగోళ్లు చేసి టైమ్‌‌‌‌కు మిల్లర్లు కస్టమ్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ రైస్‌‌‌‌ (సీఎంఆర్‌‌‌‌) చేసి ఎఫ్‌‌‌‌సీఐ కు టైమ్‌‌‌‌కు ఇవ్వకపోవడంతో సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ సంస్థకు రావాల్సిన పైసలు వస్తలేవు. ఏళ్ల తరబడి మిల్లింగ్‌‌‌‌ చేయక మిల్లర్ల దెబ్బకు అప్పులు పెరుగుతున్నయి. దీంతో బ్యాంకులు అప్పులు ఇస్తలేవు. ఏటా వడ్లు సెంటర్లకు వచ్చే ముందే ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీతో సివిల్ సప్లైకు రుణాలిచ్చేవి. కానీ వడ్డీభారం తగ్గించుకోవడానికి ఈయేడు తక్కువ వడ్డీకి ఏ బ్యాంకైనా లోన్ ఇస్తదేమోనని టెండర్లు పిలిచి మరీ అప్పులు ఇవ్వాలని కోరింది. అయినా నాబార్డు మినహా ఇతర బ్యాంకులు ముందుకు రాలేదు.  అదీ నాబార్డు 8 శాతం వడ్డీకి 5వేల కోట్లలోపే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

నిరుడే ఇబ్బంది..ఈసారి ఎట్లనో

నిరుడు వానాకాలం, యాసంగిలో బ్యాంకులు ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అప్పలు ఇచ్చాయి. అప్పుడు 2 సీజన్‌‌‌‌లలో లోన్లు ఇచ్చినా చివరి దశలో ఆ పైసలు చాలక, రైతులకు టైమ్‌‌‌‌కు డబ్బులు అకౌంట్​లో వేయలేని పరిస్థితి ఏర్పడింది. ముందు తీసుకున్న రుణాలు సరిపోక చివరి దశలో మరోసారి బ్యాంకుల నుంచి అధికారులు లోన్లు తీసుకున్నరు. దీంతో రైతులు వడ్లు అమ్ముకుని నెలల తరబడి పైసల కోసం వేచి చూడాల్సి వచ్చింది.