
హెచ్1బీ వీసాలపై పరిమితులు విధించే ఆలోచనేదీ లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘డేటా లోకలైజేషన్’పై ఇండియాతో జరుపుతున్న చర్చలకు, ట్రంప్ సమీక్షించాలనుకుంటున్న వీసా విధానానికి సంబంధమే లేదని స్పష్టం చేసింది. వీసాల్లో పది నుంచి 15 శాతం మేర కోత పెడతామంటూ ఇండియాకు అమెరికా చెప్పిందన్న కథనాలు వచ్చిన తెల్లారే అమెరికా విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘‘హెచ్1బీ సహా వర్కింగ్ వీసాలపై భారీ సమీక్షలు, సవరణలు చేసేలా బై అమెరికన్.. హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకొచ్చాం. అయితే, ఈ రివ్యూ డేటా లోకలైజేషన్‌కు ఒత్తిడి తెస్తున్న దేశాలతో సంబంధం లేదు. ఇండియాతో జరుపుతున్న చర్చలూ అందుకు పూర్తి భిన్నం. దేశాల మధ్య సమాచార మార్పిడి (డేటా ఫ్లో) ఉండాలన్నదానిపైనే మేం చర్చలు జరుపుతున్నాం” అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే, హెచ్1బీ వీసాలపై పరిమితులు విధిస్తే అమెరికాకే నష్టమన్న నిపుణుల మాటతోనే ట్రంప్ ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అందుకే ఎలాంటి పరిమితులు విధించట్లేదని ప్రకటించారన్న కథనాలు వస్తున్నయి. ‘‘హెచ్1బీపై అమెరికా పరిమితులు విధిస్తే దేశానికే నష్టం. ఇండియన్లకు వీసాలు తగ్గించడమంటే స్వతహాగా హాని చేసుకోవడమే. ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకుందున్న అపవాదూ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఐటీ టాలెంట్‌లో అమెరికాకు భారతే చాలా చాలా కీలకం. ఇండియానే అమెరికాకు ప్రధాన వనరు. హెచ్1బీ వీసాలపై వచ్చే ఇండియన్లే రెండు దేశాల మధ్య వారధుల్లా పనిచేస్తారు” అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ మేధో వర్గ సంస్థకు చెందిన రిక్ రోసో చెప్పారు. ఇండియాకు వీసాలు తగ్గించాలంటే ఇంతకుముందు చేసిన చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని, ఇప్పటి చట్టం ప్రకారం ఏదో ఒక దేశంపై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి అసాధ్యమని ఇమిగ్రేషన్ అటార్నీ సైరస్ మెహతా తెలిపారు. అయితే, ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ అథారిటీని ఉపయోగించుకుని ఏ దేశానికైనా వీసాలపై పరిమితులు విధించే అవకాశం ఉంటుందని క్లాస్కో ఇమిగ్రేషన్ లా పార్ట్నర్స్ అనే సంస్థ యజమాని విలియం స్టాక్ చెప్పారు. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని సెక్షన్ 212(ఎఫ్) ప్రకారం, ఏదైనా దేశానికి చెందిన వ్యక్తుల అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించడం, వీసాలు తగ్గించే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుందని తెలిపారు.