పరీక్షల్లో తప్పితే క్షణికావేశం సరికాదు

పరీక్షల్లో తప్పితే క్షణికావేశం సరికాదు

మన దగ్గర స్టూడెంట్ల ప్రతిభను కొలిచేందుకు ఉన్న పద్ధతి వార్షిక పరీక్షలు.. అందులో వచ్చిన మార్కులే. వాటినే ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రామాణికంగా భావిస్తున్నారు. నూటికి 85 నుంచి-90 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే ప్రతిభ ఉన్నవారు కాదు. నూటికి 35 నుంచి-40 శాతం అత్తెసరు మార్కులతో పాసైన వారిలోనూ ప్రతిభ ఉంటుంది. ఇటీవల గుజరాత్​కు చెందిన ఐఏఎస్​ అధికారి తుషార్​ సుమేరా టెన్త్​మార్క్స్ ఫొటో సోషల్​ మీడియాలో బాగా వైరల్​అయింది. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ గా ఉన్న తుషార్​సుమేరాకు టెన్త్​ ఇంగ్లిష్​లో కేవలం పాస్​మార్కులు 35 వచ్చాయి. మ్యాథ్స్​లో 36, సైన్స్​లో 38 మార్కులు సాధించిన ఆయన.. అత్తెసరు మార్కులతో టెన్త్​ పూర్తిచేశారు. జీవితంలో గొప్పవారు కావడానికి మార్కులు మాత్రమే ప్రామాణికం కాదు అనేందుకు ఈ ఐఏఎస్​అధికారే నిదర్శనం. మంచి మార్కులు సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, ఇన్ని మార్కులు తెచ్చుకోవాల్సిందేనంటూ విద్యార్థులపై ఒత్తిడి పెట్టే తల్లిదండ్రులు, టీచర్లకు తుషార్ సుమేరా ఉదంతం ఓ కనువిప్పులాంటిది. 

ఫలితాలను ప్రెస్టీజ్ గా తీసుకుంటూ..

తెలంగాణలో నిన్న ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, రేపు పది ఫలితాలు రానున్నాయి. ఫలితాలను తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రెస్టీజ్ గా తీసుకుంటూ ఉండటం అనర్థాలకు దారి తీస్తోంది. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోతే.. ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ పిల్లవాడు పరీక్షలో తప్పినా, తక్కువ మార్కులు తెచ్చుకున్నా.. తల్లిదండ్రులు కూడా సమాజంలో ఎక్కడా తలదించుకోవాల్సి వస్తుందోనని పిల్లల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండూ తప్పే. మార్కులే జీవితం కాదు. ఈ విషయాన్ని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

ఇతరులతో పోలిక వద్దు

విద్యార్థి దశలో పరీక్షలు సాధారణమే అయినప్పటికీ జీవన ప్రయాణంలో విద్యార్థి ఒక గమ్యాన్ని ఎంచుకోవడంలో ఈ ఫలితాలు కొంత మేర దోహదం చేస్తాయని గుర్తించాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా లక్ష్య నిర్ధారణ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరిలో ఉన్న నైపుణ్యాలు, ప్రతిభా.. మరో విద్యార్థిలో ఉండకపోవచ్చు. దీన్ని ఎడ్యుకేషనల్​సైకాలజీలో వైయక్తిక భేదాలు అంటారు. వీటి ప్రకారం ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తోటి విద్యార్థులతోనో, తక్కువ క్లాస్​వారితోనో పోల్చుకోవడం సరికాదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్​అయ్యామనో బాధ పడాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి ఏదో ఓ లక్ష్యం సాధించడం కోసం జీవించాలి. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి ఎప్పుడూ అపాయకారి కాదు. గెలిచేందుకు అది పరీక్షలోనైనా, జీవితంలోనైనా మనో ధైర్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల కావాలి. 

మార్కులను ప్రతిష్టగా తీసుకోవద్దు

విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా నూటికి నూరు మార్కులు సాధించిన వారేమీ కాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుంటారు. పిల్లలకొచ్చిన మార్కులను బంధువులతో చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు ఆశించిన మార్కులు పిల్లలు తెచ్చుకోకపోతే.. వంశ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుందోనని, బంధువుల ముందు ఎక్కడ తాము తలదించుకోవాల్సి వస్తుందేమోనని మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మరోవైపు ర్యాంకులను, మార్కులను చూపి ఎక్కువ అడ్మిషన్లు పొందాలనే యావలో కార్పొరేట్​విద్యాసంస్థలు విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతుంటారు. ఇన్ని ఒత్తిడిల మధ్య విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టలేరు. మార్కులు ఎలా వచ్చినా.. అధైర్యపడకూడదని, నిరుత్సాహానికి గురికావొద్దని, తాము అండగా ఉన్నామని పిల్లలకు తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉపాధ్యాయులు భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై వారి సామర్థ్యానికి మించి అంచనాలను ఊహించకూడదు. వారి వాస్తవిక స్థాయిని గుర్తించి భరోసా ఇయ్యాలి. 

ముందుకు వెళ్లేలా ప్రోత్సహించాలి

పిల్లల ఉజ్వల భవిష్యత్తును కోరుకునేది తల్లిదండ్రులే. అందుకే వారు పిల్లల పట్ల స్నేహ భావంతో ఉండాలి. పిల్లల స్నేహాలు, విద్యాలయాల్లో వారి ప్రవర్తన, చదువు తీరునూ పరిశీలిస్తూ ఉండాలి. 90 శాతం మార్కులు సాధించిన పిల్లలకు, 40 శాతమే మార్కులు వచ్చిన వారికి తేడా ఏమీ లేదనే విషయాన్ని పిల్లలకు అర్థం చేయించాలి. ఒకసారి పరీక్షలో తప్పినంత మాత్రాన జీవితం నష్టపోదనే భరోసా ఇవ్వాలి. మళ్లీ చదివి పాస్‌ కావచ్చనే ధైర్యం ఇవ్వాలి. ఫెయిలైన విద్యార్థులను తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలి, తిరిగి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి లోనుకాకూడదు. సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే టీచర్లతో చర్చించాలి. ఏ విషయమైనా తల్లిదండ్రులతో చర్చించాలి. జీవితాన్ని నడిపించేది సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం. ఇవి ఉన్న వ్యక్తులే ముందుకు వెళ్తారు.

ఓటమి శాశ్వతం కాదు

ఓటమి శాశ్వతం కాదు. మరో అవకాశం ఉంటుంది. టెన్త్, ఇంటర్, బీటెక్.. ఇలా ఏ పరీక్షకైనా ఫెయిల్యూరే అంతిమం కాదు. పొరపాట్లను సరిదిద్దుకొని, మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్లాలే గానీ ఓటమితో నిరాశ, నిస్పృహలకు లోనుకాకూడదు. చులకనగా చూసిన సమాజం ముందే తలెత్తుకొనేలా విజయం సాధించి చూపాలి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అబ్బాయి ఇంగ్లిష్​లో సబ్జెక్టులో ​అర్థంగాక ఇంజినీరింగ్​ మూడేండ్లు ఫెయిల్​అయ్యాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసి.. వాటిల్లోనూ నష్టపోయాడు. చివరకు ఎల్ఐసీ ఏజెంట్​గా చేరి, గడిచిన ఏడాది 2 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ పొందారు. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ మ్యాగజీన్‌లో స్థానం సంపాదించారు. ఇలా పరీక్షల్లో ఫెయిలై విజయాలు సాధించిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి విద్యార్థులు పరీక్షల్లో తప్పామని క్షణికావేశంలో ఎలాంటి  నిర్ణయాలు తీసుకోకూడదు.

- అట్ల శ్రీనివాస్ రెడ్డి,రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్