రిలేషన్స్ రిప్లై : నొప్పించకుండా ‘నో’ చెప్పాలి!

రిలేషన్స్ రిప్లై : నొప్పించకుండా ‘నో’ చెప్పాలి!

స్కూల్‌‌‌‌ ఏజ్‌‌లో పిల్లల నోటి నుంచి ఏదైనా కావాలంటే‘ ప్లీజ్‌‌’, తప్పు చేస్తే ‘సారీ’, అడిగింది ఇస్తే ‘థాంక్యూ’ అని రాగాలు తీస్తుంటారు. ఆ మాటలకు పెద్దవాళ్లు కూడా సంతోషంగా ఫీల్‌‌ అవుతారు. కా‘లేజ్‌‌’లో మర్యాద మాయమవుతుంది. రియాక్షన్ చేంజ్ అవుతుంది. అడిగింది ‘లేదు’ అంటే డోర్‌‌‌‌ బద్ధలవుతుంది. ఫ్రెండ్స్‌‌కి ఏదైనా విషయంలో ‘నో’ చెప్తే’ అంటే అలిగి మొహం మాడ్చుకుంటారు. మాట్లాడటం ఆపేస్తారు. అందుకే పిల్లలు, ఫ్రెండ్స్‌‌, పార్ట్‌‌నర్‌‌‌‌కి సంబంధించిన ఏ విషయాల్లోనైనా ‘నో’ చెప్పడానికి మనసు ఇష్టపడదు. ఒకవేళ ‘నో’ చెప్పాలనుకున్నప్పుడు ‘నేను సెల్ఫిష్‌‌గా ఆలోచిస్తున్నానా? నా గుండె రాయా?’ అని బాధపడుతూ కూర్చుంటారు. మరి ఆత్మీయుల మనసు నొప్పించకుండా ‘నో’ చెప్పలేమా?

ఇలా చెప్పొచ్చు..

ఇంట్లో ఫంక్షన్‌‌ ఉందని ఇన్వైట్ చేస్తారు. పైసలు కావాలని సాయం అడుగుతారు. పిల్లలు గిఫ్ట్‌‌లు కావాలని గోల చేస్తారు. వాటన్నింటికీ ‘ఎస్‌‌’ చెప్పడానికి ముందు స్థోమతని, టైమ్‌‌ని గుర్తు తెచ్చుకోవాలి. ‘నో’ చెప్పాలనిపించినా మొహమాటంతో ‘ఎస్‌‌’ చెప్పడం వల్ల చాలాసార్లు తమకు తామే హాని చేసుకుంటారు. ఆ పని చేసే కెపాసిటీ లేదు కాబట్టే.. జెన్యూన్‌‌గా ‘నో’ చెప్పాలి. కానీ, ‘సెల్ఫిష్​’ అంటారేమో అన్న అపరాధ భావం మనసులో మెదులుతుంది కదా! అంటే దాని వెనుక నిజాయితీగా ఒక కారణం ఉంది. కాబట్టి, కచ్చితంగా ‘నో’ చెప్పాలి. అయితే ‘నో’ చెప్పడం ఈజీనే.

కానీ, నొప్పించకుండా చెప్పడమే బంధాలు నిలిచేలా చేయగలదు. ‘నో’ చెప్పడానికి తడబడుతుంటే.. ‘మీరు కచ్చితంగా ఆ పని చేయాలా?’ అని ఆలోచించుకోవాలి. అది అంత ముఖ్యం కాదనిపించినప్పుడు వెంటనే ‘నో’ చెప్పాలి. దాన్ని ‘సెల్ఫిష్​గా ఆలోచిస్తున్నాం’ అనుకోకుండా ‘సెల్ఫ్‌‌కేర్‌‌’‌‌గా భావించాలి.

‘నో’ చెప్పడానికి ముందు

‘ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాళ్లకోసం నిలబడ్డాను లేదా సాయం చేశాను?’ అని ముందు తనను తాను ప్రశ్నించుకోవాలి. ‘నో’ చెప్తున్నాం అంటే కొన్ని ఆరోగ్యవంతమైన హద్దులు పెట్టుకుంటున్నాం అని అర్థం చేసుకోవాలి. మనమంతా మనుషులం. మనకూ కాలపరిమితి ఉంది. అందుకే వేరే వాళ్లకు సాయం చేయడంలోనూ, కమిట్‌‌మెంట్స్‌‌ ఇవ్వడంలోనూ కూడా కొన్ని పరిమితులు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ‘సెల్ఫిష్‌‌’ భావన చుట్టూ అల్లుకున్న ఆలోచలన్నింటినీ పక్కన పెట్టేయాలి. ‘అది అంత ముఖ్యం కాదు’ అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ‘నో’ చెప్పేయాలి.

అమర్యాద వద్దు..

ఫ్రెండ్స్‌‌కైనా, ఫ్యామిలీ మెంబర్స్‌‌కైనా ‘నో’ చెప్తున్నప్పుడు క్రూరంగా ఉండకూడదు. ‘నో’ చెప్పడానికి ముందు కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఇదే. ‘నేను రాను, నాకు కుదరదు, నా వల్ల కాదు’ అని కోపంగా చెప్పే మాటలు వినేవాళ్ల మనసు నొప్పిస్తాయి. ‘నో’ చెప్పడానికి ముందు ‘ఎందుకు’ ఆ మాట చెప్పాల్సి వస్తుందో వాళ్లకు వివరించే ప్రయత్నం చేయాలి. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంత జాగ్రత్తగా ఫ్రేమ్‌‌ చేయాలనే స్పృహలో ఉంచుకొని మాట్లాడాలి. ‘సండే ఫంక్షన్‌‌ ఉంది. తప్పక రావాలి’ అని ఒక ఫ్రెండ్‌‌ ఆహ్వానిస్తే.. ‘నా వల్ల కాదు. అదే రోజు నాకు వేరే పని ఉంది’ అని కోపంగా రిప్లై ఇస్తే.. అక్కడ కూడా కోపమే పుడుతుంది. అది అనుబంధాలను కూల్చేస్తుంది!

హ్యాపీ రిప్లై!

‘నువ్వు ఇన్వైట్‌‌ చేయడం నాకు సంతోషంగా ఉంది. మేం ఆల్రెడీ ఒక ప్రోగ్రాం ప్లాన్‌‌ చేశాం.. దాన్ని క్యాన్సిల్‌‌ చేయలేం’ అని చెప్తే ఎదుటి వాళ్లు కూడా అర్థం చేసుకుంటారు. మొహం మీదే ‘రాను’ ‘కుదరదు ’ ‘నో’ అని చెప్తే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. గౌరవంగా చెప్పినప్పటికీ ఎదుటివాళ్లు అపార్థం చేసుకుంటే.. ‘ మనుషులు కొన్ని విషయాలకు ఎలా రియాక్ట్‌‌ అవుతారో అన్నదానికి మన బాధ్యులం కాదు’ అనే విషయం గుర్తు చేసుకోవాలి. మీరు చెప్తున్నదానికే మీరు బాధ్యులు. వాళ్లు చెప్పినదానికి, అన్నదానికి సున్నితంగా ‘నో’ చెప్పినా.. వాళ్లు వినిపించుకోకపోతే.. మీ మనసుకి సమాధానం చెప్పుకుని వాళ్ల గురించి ఆలోచించడం మానెయ్యాలి.

ప్రశంసించాలి..

‘నో’ చెప్పడానికి ముందు వాళ్లు మీ గురించి ఆలోచిస్తున్నందుకు కచ్చితంగా వాళ్లకు ‘థ్యాంక్స్‌‌’ చెప్పాలి. కారణం ఏదైనా కానీ, రావాలని ఉన్నా రాలేకపోతున్నామనే ఫీల్‌‌ మాటల్లో కనపడాలి. దానికన్నా ముందు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అని యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవాలి. ‘మన కోసం పార్టీని వాయిదా వేసుకో’ అని చెప్పడం కుదరదు. కానీ, ఆ పార్టీకి కావాల్సిన ఏర్పాట్ల గురించి అడగటం, సలహాలు, సూచనలు చేసే ప్రయత్నం చేయాలి. దానివల్ల వీళ్లు తమని దూరం పెడుతున్నారని అనుకోరు. వీలుంటే వాళ్లను ప్రశంసించాలి. పిల్లలు కూడా ‘అక్కడికి తీసుకెళ్లు, ఇక్కడికి తీసుకెళ్లు’ అని అడుగుతారు. స్కూల్‌‌ ఈవెంట్స్‌‌కి పేరెంట్స్‌‌ రావాలని కోరుకుంటారు. ఒకవేళ వాటికి మీరు వెళ్లలేకపోతే ‘నో’ చెప్పడానికి ముందు ‘ కూర్చోబెట్టి ప్రేమగా కారణం ఏంటో చెప్పాలి’. ఇదే పార్ట్‌‌నర్‌‌‌‌కీ వర్తిస్తుంది.

ఎలా చెప్పాలి?

‘ఐయామ్‌‌ సారీ.. నేను అక్కడ ఉండలేను. నాకూ రావాలని ఉంది. కానీ..’ అని మాటలు మొదలు పెట్టాలి. ముందు సారీ చెప్పడం వల్ల ఎదుటివాళ్లకు మీ పొజిషన్ క్లియర్‌‌‌‌గా అర్థం అవుతుంది. అపార్థం చేసుకోవడానికి వీలు ఉండదు.

ఇప్పటి వరకు ఎవరికీ ‘నో’ చెప్పని వాళ్లయితే.. ‘నేను ఆలోచించుకొని చెప్తా.. ఆ రోజు వేరే పని ఉంది’ అని చెప్పాలి. తర్వాత కొంచెం టైం తీసుకొని చివరికి ‘నో’ చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఓవర్‌‌‌‌ యాంగ్జైటీ నుంచి బయటపడతారు.

‘ రా! మా పెళ్లి రోజు.. పెద్ద పార్టీ చేస్తున్నాం. మీరూ, మీ పార్ట్‌‌నర్‌‌‌‌తో కలిసి తప్పకుండా రావాలి’

‘ హే! విష్ యూ అండ్‌‌ యువర్‌‌‌‌ వైఫ్‌‌ ఏ హ్యాపీ యానివర్సరీ. మాకూ రావాలని ఉంది. కానీ, ఆ రోజు ఊళ్లో ఉండటం లేదు. నా ఫ్రెండ్‌‌ ఇంటికి వస్తాం అని మాటిచ్చాం. ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్‌‌

‘ మా పుట్టింటి వాళ్లు ఫంక్షన్ చేస్తున్నారు. సోమవారం కచ్చితంగా నువ్వు నాతో రావాలి’ అని పార్ట్‌‌నర్‌‌‌‌ అడిగితే.. ‘ ఓ సారీ డియర్‌‌‌‌! అదే రోజూ నాకు ఆఫీస్‌‌లో ఇంపార్టెంట్‌‌ మీటింగ్‌‌ ఉంది. నాకూ రావాలనే ఉంది. కానీ ఏం చెయ్యను? ప్లీజ్‌‌ ఈ సారికి నువ్వు ఒక్కదానివే వెళ్లు’ అని మాటలు మొదలు పెట్టాలి. ‘ఎక్కడవుతుంది? అటు ఆఫీస్‌‌, ఇటు ఫంక్షన్‌‌.. నా వల్ల కాదు’ అని చిరాకు పడితే.. ‘మీకు ఎప్పుడవుతుంది? ఎక్కడికీ రారు’ అనే గొడవకు బీజం పడుతుంది!