రాష్ట్రంలో దాదాపు 2 వేల షాపులకు డీలర్లు లేరు

రాష్ట్రంలో దాదాపు 2 వేల షాపులకు డీలర్లు లేరు
  •     ఉన్నవాటికి డీలర్ల సమస్య
  •     పంచాయతీలుగా మారిన తండాల్లో రేషన్ కు అవస్థలు
  •     నియామకంపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ప్రభుత్వం వాటిల్లో కొత్త రేషన్ ​షాపులను మాత్రం పెడ్తలేదు. నెల నెలా నిత్యవసరాలు తెచ్చుకోవడం తండావాసులు కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వస్తోంది. కొత్త షాపులు పెట్టకపోగా.. ఉన్న రేషన్​ షాపుల్లోనూ పూర్తి స్థాయిలో డీలర్లను నియమించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 2 వేల షాపులకు డీలర్లను పెట్టాల్సి ఉంది. రాష్ట్రంలో దాదాపు 3,700 తండాలు పంచాయతీలుగా మారాయి. ఆ పంచాయతీల్లో కొత్త రేషన్ ​షాపులు ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు ఇచ్చే కమిషన్​ కూడా సరిపోతలేదని డీలర్లు కొంతమంది షాపులు మూసేసుకుంటున్నరు. దీంతో లబ్ధిదారులు వేరే ప్రాంతంలో ఉన్న రేషన్​షాపునకు వెళ్లి బియ్యం తీసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్​లోనే కొత్త రేషన్​ షాపులు, వాటికి డీలర్లతో పాటు ఖాళీలుగా ఉన్నవాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించినా.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 

500 కార్డులకు ఒక షాపు
ప్రభుత్వం జారీ చేసిన గైడ్​లైన్స్ ప్రకారం గ్రామాల్లో 500 కార్డులకు ఒక రేషన్ షాపు పెట్టాల్సి ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 600 నుంచి 800  కార్డులకు, ఇతర కార్పొరేషన్లలో 800 నుంచి 1000 కార్డులకు, జీహెచ్ఎంసీ ఏరియాలో 1000 నుంచి 1200 కార్డులకు ఒక రేషన్​ షాపును ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కొన్ని ప్రాంతాల్లో అందుకు అనుగుణంగా దుకాణాలు లేవు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇప్పుడు 90.50 లక్షల రేషన్​ కార్డులున్నాయి. రేషన్ షాపులు మాత్రం17,012 ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కమిషన్​ సరిపోతలేదన్న కారణంతో దాదాపు 5 వేల షాపులు రెగ్యులర్​గా నడపడం లేదని ఆఫీసర్లు చెప్తున్నరు. కొన్ని కార్డులను వేరే షాపులకు లింక్​ చేశారు. 

కమిషన్ ​సరిపోతలే..
డీలర్లు డీడీలు చెల్లించే సమయంలోనే కిలోకు70 పైసల చొప్పున కమిషన్‌‌‌‌ కట్‌‌‌‌ చేసుకొని మిగతా డబ్బులను డీడీల రూపంలో చెల్లిస్తారు. డీలర్లు ప్రతినెలా100 నుంచి-200 క్వింటాళ్లు పంపిణీ చేస్తారనుకుంటే రూ.7 వేల నుంచి రూ.14 వేల వరకు కమిషన్‌‌‌‌ వస్తుంది. రేషన్‌‌‌‌ దుకాణం నిర్వహణ, విద్యుత్‌‌‌‌ బిల్లులు, తూకం వేసే వ్యక్తికి జీతం, షాపు కిరాయి తదితర ఖర్చులు ఉంటాయి. వాటికి వచ్చే కమిషన్​సరిపోతలేదని డీలర్లు అంటున్నరు. అందుకే కొందరు షాపులు రెగ్యులర్ గా నడపడం లేదని తెలుస్తోంది. రూల్స్​ ప్రకారం కేంద్రప్రభుత్వం 35 శాతం కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం కమిషన్, మెయింటెనెన్స్ చార్జీల కింద 17 శాతం, మొత్తం 87 శాతం కమిషన్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నా ప్రభుత్వం 70 శాతం కమిషన్ మాత్రమే ఇస్తోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.