మంచిర్యాల జిల్లాలో మిల్లుల్లో వడ్లు లేక తిప్పలు

మంచిర్యాల జిల్లాలో మిల్లుల్లో వడ్లు లేక తిప్పలు
  • పలుమార్లు గడువు పొడిగించినా స్పందించని మిల్లర్లు  
  • నిరుడు వానాకాలం 39,528, యాసంగి 41,486 మెట్రిక్​ టన్నులు పెండింగ్​ 
  • తాజాగా ఈ నెలాఖరు వరకు గడువు.. మిల్లుల్లో వడ్లు లేక తిప్పలు  

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని రైస్​ మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎమ్మార్​) ఇవ్వడానికి మొండికేస్తున్నారు. గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి వేల క్వింటాళ్ల బియ్యం బకాయిపడ్డారు. ఇప్పటికీ పలుమార్లు గడువు పొడిగించినా చాలామంది టార్గెట్​ రీచ్​ కాలేదు. దీంతో మరోసారి ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. మరోవైపు ఈ వానాకాలం సీజన్​ వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మిల్లులకు వచ్చిన వడ్లను యాసంగి సీజన్​లోగా మిల్లింగ్​ చేసి ప్రభుత్వానికి సీఎమ్మార్​ అప్పగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇటు మిల్లర్లు, అటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.  

మిల్లింగ్​ చేసి అమ్ముకున్నరు... 

గత వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. జిల్లాలోని రైస్​ మిల్లుల కెపాసిటీని బట్టి సీఎమ్మార్​ కోసం కేటాయించింది. మిల్లర్లు ఈ వడ్లను మిల్లింగ్​ చేసి క్వింటాల్​కు 67 కిలోల చొప్పున ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ), సివిల్​ సప్లైయ్స్​ కార్పొరేషన్​కు అప్పగించాలి. మిల్లింగ్​ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ చాలామంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లింగ్​ చేసి ఓపెన్​ మార్కెట్​కు తరలించారు. కిలో రూ.30 నుంచి రూ.35 చొప్పున అమ్ముకున్నారు. మరికొందరు మిల్లర్లు ఏకంగా వడ్లనే పక్కదారి పట్టించారు. తడిసిన వడ్లను బేవరేజెస్​ కంపెనీలకు తరలించారు. దీంతో చాలా మిల్లుల్లో ఉండాల్సిన వడ్ల కన్నా తక్కువగా ఉన్నాయి. ఎఫ్​సీఐ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు కొందరు మిల్లులను మూసివేయగా, మరికొందరు 'మేనేజ్​' చేశారనే విమర్శలు వచ్చాయి.  

ఎఫ్​సీఐకే ఎక్కువ పెండింగ్​...  

నిరుడు వానాకాలం సీజన్​లో జిల్లాలోని రైస్​మిల్లులు 91,910 మెట్రిక్​ టన్నుల సీఎమ్మార్​కు గాను ఇప్పటివరకు 52,381 మెట్రిక్​ టన్నులు మాత్రమే ఇచ్చారు. ఇంకా 39,538 మెట్రిక్​ టన్నులు పెండింగ్​ ఉండగా, ఇందులో సివిల్​ సప్లైయ్స్​ కార్పొరేషన్​కు 2,224, ఎఫ్​సీఐకి 37,304 మెట్రిక్​ టన్నుల బియ్యం బకాయి పడ్డారు. అలాగే యాసంగి సీజన్​లో 52,529 మెట్రిక్​ టన్నులకు గాను కేవలం 10,887 మెట్రిక్​ టన్నుల సీఎమ్మార్​ అప్పగించారు. ఇంకా 41,486 మెట్రిక్​ టన్నుల్లో సివిల్​ సప్లైయ్స్​ కార్పొరేషన్​కు 8,288, ఎఫ్​సీఐకి 33,342.99 మెట్రిక్​ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. యాసంగిలో రా రైస్​ మాత్రమే తీసుకుంటామని ఎఫ్​సీఐ స్పష్టం చేయడంతో మిల్లర్లు కంగుతిన్నారు. ఆ తర్వాత బాయిల్డ్​ రైస్ సేకరణకు ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు మిల్లుల్లో సరిపడా వడ్లు లేకపోవడంతో పరేషాన్​ అవుతున్నారు. 

రేషన్​ బియ్యం రీసైక్లింగ్​...  

ప్రభుత్వం ఇచ్చిన వడ్లను పక్కదారి పట్టించిన మిల్లర్లు రేషన్​ బియ్యం రీసైక్లింగ్​ ద్వారా మరో అక్రమానికి తెరలేపారు. జిల్లాలోని రేషన్​ లబ్దిదారులకు ఇచ్చిన బియ్యాన్ని డీలర్లు, దళారుల దగ్గర కిలో రూ.20 నుంచి రూ.22కు కొని సివిల్​ సప్లైయ్స్​ కార్పొరేషన్​కు సీఎమ్మార్​ పెడుతున్నారు. మంచిర్యాల, మందమర్రి, జైపూర్​, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోని మిల్లుల్లో రీసైక్లింగ్​ దందా జోరుగా నడుస్తోంది. ఈ బియ్యం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో ఎఫ్​సీఐ తీసుకోవడం లేదు. మరో వారం రోజులే గడువు ఉండడంతో ఈ లోటును భర్తీ చేయడానికి మిల్లర్లు అపసోపాలు పడుతున్నారు.