మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలంగాణ భారత్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్(బీపీడీఏ) రాష్ట్ర కార్యదర్శి సురభి శరత్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని కోరారు. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సరఫరాలో స్వల్ప అంతరాయం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కంపెనీలు క్రెడిట్ నిలిపివేయడం, వాహనదారులు అవసరం లేకున్నా ఎక్కువగా పెట్రోల్, డీజిల్ పోయించుకోవడం వల్లే బంకుల్లో నిల్వలు తగ్గుతున్నాయని వివరించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
