ఈడీ కేసుల్లో ఏదీ పురోగతి.. గొర్రెల స్కీమ్‌‌ మొదలుకొని కాళేశ్వరం దాకా కీలక కేసుల దర్యాప్తు

ఈడీ కేసుల్లో ఏదీ పురోగతి.. గొర్రెల స్కీమ్‌‌ మొదలుకొని కాళేశ్వరం దాకా కీలక కేసుల దర్యాప్తు
  • గత సర్కారు హయాంలో జరిగిన ఆర్థిక నేరాలన్నింటిపైనా ఫోకస్​
  • ఏసీబీ, సీఐడీకి దీటుగా ఎన్‌‌ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ​కేసులు నమోదు 
  • దర్యాప్తులో మాత్రం నెలలకొద్దీ సాగదీత.. సాంకేతిక ఆధారాల సేకరణలో కొన్ని ఆలస్యం
  • బ్యాంకులు, టెలికాం సర్వీస్​ ప్రొవైడర్ల నుంచి డేటా అందక మరికొన్ని పెండింగ్​
  • వివిధ శాఖల నుంచి సహకారం లేదంటున్న ఈడీ ఆఫీసర్లు
  • పలు కేసుల్లో ఆస్తుల అటాచ్‌‌మెంట్, చార్జిషీట్ల దాఖలుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నేరాలకు సంబంధించి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) దర్యాప్తు చేస్తున్న పలు కీలక కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. భూదాన్‌‌ భూముల కేసులో ఈడీ దర్యాప్తుకు బ్రేకులు పడగా.. గొర్రెల పంపిణీ స్కీమ్​ స్కామ్‌‌లో ప్రభుత్వం, బ్యాంకుల నుంచి ఇప్పటికీ రికార్డులు అందనట్లు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఫారిన్ బ్యాంకుల నుంచి ఫారిన్‌‌ ఎక్స్చేంజ్‌‌కు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ అధికారుల మనీలాండరింగ్‌‌, ఆన్‌‌లైన్ బెట్టింగ్‌‌ లాంటి కేసుల్లోనూ రాష్ట్ర పోలీసులతో పోటీపడి ఈడీ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతున్నది.

సాంకేతిక ఆధారాల సేకరణలో ఆలస్యం.. ముఖ్యంగా బ్యాంకులు, టెలికాం సర్వీస్​ ప్రొవైడర్ల నుంచి అందాల్సిన డేటా అందకపోవడం, ఆడిట్ రిపోర్టుల్లో జాప్యం, ఆయా శాఖల నుంచి అందాల్సిన డాక్యుమెంట్లు ఆలస్యం కావడం లాంటి కారణాలతో ఎంక్వైరీ ముందుకు సాగడం లేదని ఈడీ ఆఫీసర్లు అంటున్నారు.  భూదాన్ భూముల వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ సిఫార్సు చేసినా.. నేటికీ పురోగతి కనిపించడం లేదు. ఏసీబీ, సీఐడీ కేసుల ఆధారంగా ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ కేస్ ఇన్‌‌‌‌ఫర్మేషన్ రిపోర్ట్‌‌‌‌(ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌) నమోదు చేసి నోటీసులు, విచారణ పేరుతో హడావిడి చేస్తున్న ఈడీ అధికారులు, ఆ తర్వాత నెలల కొద్దీ సాగదీస్తున్నారు తప్పితే ఇప్పటివరకూ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కీలక కేసులన్నీ ఈడీ చేతిలోనే..
ఆర్థిక నేరాలపై విచారణ జరిపే  ఈడీ చేతిలో కీలక కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌‌‌‌–1 పేపర్ లీకేజీ, గొర్రెల స్కామ్‌‌‌‌, కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో అధికారుల మనీలాండరింగ్‌‌‌‌, భూదాన్‌‌‌‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, ఫార్ములా ఈ రేస్‌‌‌‌లో విదేశాలకు డబ్బు తరలింపు, హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) నిధుల గోల్‌‌‌‌మాల్‌‌‌‌ సహా  ఆన్‌‌‌‌లైన్ బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌ కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఏసీబీ, సీఐడీ కేసుల ఆధారంగా ఈసీఐఆర్‌‌‌‌  రిజిస్టర్ చేసి, విచారణ జరుపుతున్నది. ప్రభుత్వ నిధులను దారిమళ్లించడంతో పాటు షెల్‌‌‌‌ కంపెనీలు, విదేశాలకు డబ్బు తరలింపుకు సంబంధించి ఫారిన్ ఎక్స్చేంజ్​ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ యాక్ట్‌‌‌‌,  మనీలాండరింగ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌(పీఎంఎల్‌‌‌‌ఏ) కింద దర్యాప్తు చేస్తున్నది. ఇందులో ప్రస్తుతం గొర్రెల స్కామ్‌‌‌‌, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం ఈఎన్సీల విచారణ కీలకంగా మారింది. పలు కేసుల్లో వేల కోట్లు మనీలాండరింగ్‌‌‌‌ జరిగినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది. 

గొర్రెల స్కామ్‌‌‌‌లో సాంకేతిక ఆధారాల కోసం ఎదురు చూపులు
గొర్రెల పంపిణీ స్కామ్‌‌‌‌లో వేల కోట్ల గోల్‌‌‌‌మాల్‌‌‌‌పై ఈడీ దృష్టి పెట్టింది. ‌‌‌‌ రూ.2.10 కోట్లతో బయటపడిన ఈ స్కామ్‌‌‌‌ రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఇప్పటికే గుర్తించింది. ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌ ఓస్డీ కల్యాణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను పలుమార్లు విచారించింది. దర్యాప్తులో భాగంగా జులై 30,31 తేదీల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి.. 200కు పైగా మ్యూల్‌‌‌‌/డమ్మీ బ్యాంక్‌‌‌‌ అకౌంట్లను గుర్తించింది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్ యాప్స్‌‌‌‌ కోసం వినియోగించిన 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను సీజ్‌‌‌‌ చేసింది. 

2021 మార్చిలో ఇచ్చిన నివేదిక ప్రకారం 7 జిల్లాల్లోనే రూ.253.93 కోట్లు నష్టం వాటిల్లగా.. 2017 నుంచి మొత్తం స్కీమ్‌‌‌‌కు మంజూరు అయిన నిధులు ఎక్కడికెళ్లాయనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నది. గొర్రెల స్కీమ్‌‌‌‌లో కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయలను దారిమళ్లించేందుకు ఉపయోగించిన షెల్‌‌‌‌ కంపెనీల వివరాలను రాబడుతున్నట్టు ఈడీ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, టెలీకాం సర్వీసెస్‌‌‌‌ నుంచి రావాల్సిన సమాచారంతోపాటు బ్యాంకుల నుంచి మ్యూల్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు రాకపోవడం వల్లే కేసు ముందుకు కదలడం లేదని  తెలిసింది.

కొలిక్కిరాని భూదాన్ భూముల కేసు
రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌‌‌‌ మల్కాజిగిరి జిల్లాలోని భూదాన్‌‌‌‌ భూముల కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తుకు బ్రేకులు పడ్డాయి. ఈ కేసులో ఆయా జిల్లాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన ఐఏఎస్ అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌ సహా మహేశ్వరం రెవెన్యూ అధికారులు, సీసీఎల్‌‌‌‌ఏ, రియల్టర్లను ఈడీ ఇప్పటికే విచారించింది. నిరుడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 23, 24, 25 తేదీల్లో అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను దాదాపు 28 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చేతులు మారిన భూదాన్ భూముల వివరాలను సేకరించారు.  ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారంలోని 181 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లోని 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రైవేట్​వ్యక్తులకు రిజిస్ట్రేషన్​ చేసిన వ్యవహారంలో అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌ సహా  ఓ మాజీ మంత్రి, పలువురు ఇతర అధికారులకు ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రూ.8 కోట్లకు పైగా చేతులు మారినట్లు ఆధారాలు సేకరించారు. 

ఈ డబ్బును రియల్ ఎస్టేట్‌‌‌‌ కంపెనీల పేరుతో షెల్‌‌‌‌ కంపెనీలకు మళ్లించినట్లు  గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితురాలు ఖాదర్​ ఉన్నీసా నుంచి రూ.4.8 కోట్లు విలువజేసే ఆస్తులను ఈ నెల ఒకటిన ఈడీ అటాచ్ ​చేసింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్​ భూముల ఆక్రమణకు సంబంధించి అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌సహా పలువురు అధికారులపై ఈడీకి ఏకంగా12 ఫిర్యాదులు అందాయి. బాధ్యులపై  స్థానిక పోలీస్‌‌‌‌ స్టేషన్లలో ఎఫ్​ఐఆర్​లు నమోదు చేయాలని రాష్ట్ర డీజీపీకి ఈడీ  లేఖ రాసింది. కానీ సివిల్​ వివాదాలకు సంబంధించిన వివాదాలు కావడంతో ఇప్పటివరకూ స్థానిక పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. దీంతో ఈడీ అధికారులు నాగారం కేసుకే పరిమితం కావాల్సి వచ్చింది.

అవినీతి ఇంజినీర్ల ఆస్తులు అటాచ్ ​చేయడంలో జాప్యం 
కాళేశ్వరం  సహా గత  ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ ప్రాజెక్టుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అక్రమాలపైనా ఈడీ గురి పెట్టింది. ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే ఏసీబీ అరెస్ట్‌‌‌‌ చేసిన రిటైర్డ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ ఇన్‌‌‌‌ చీఫ్‌‌‌‌ (ఈఎన్సీ) మురళీధర్‌‌‌‌రావు, మరో ఈఎన్సీ భూక్యా హరిరాం, చొప్పదండి ఎస్సారెస్పీ డివిజన్‌‌‌‌-8 ఈఈ నూనె శ్రీధర్‌‌‌‌కు సంబంధించిన కేసు రికార్డులు ఇటీవలే ఏసీబీ నుంచి ఈడీకి అందాయి. 

కానీ ఈసీఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్నట్టు తెలిసింది. మరోవైపు  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌‌‌‌ అయిన ఈ ముగ్గురికి సంబంధించిన  విల్లాలు, ఫ్లాట్లు, అత్యంత ప్రైమ్‌‌‌‌ లొకేషన్లలో ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు సహా మొత్తం రూ.800 కోట్లుకు పైగా ఆస్తులను గుర్తించి అటాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయడంలో అనేక న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనిదే  ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముందుసాగే అవకాశం లేదని అంటున్నారు. 

నత్తనడకన హెచ్‌‌‌‌సీఏ, బెట్టింగ్ యాప్స్ ​కేసులు..
బీసీసీఐ గ్రాంట్స్ కొల్లగొట్టిన హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్(హెచ్‌‌‌‌సీఏ) కేసులోనూ ఈడీ ఎంటర్​అయింది. ఎఫ్‌‌‌‌ఐఆర్ సహా నిందితుల రిమాండ్ రిపోర్ట్‌‌‌‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. నిందితులు ఏసీబీ కస్టడీలో ఉండడంతో కొంత జాప్యం జరిగింది. ఈ మేరకు హెచ్‌‌‌‌సీఏ నిధుల వ్యవహారంలో గతంలో నమోదైన పలు ఈసీఐఆర్‌‌‌‌‌‌‌‌లతో కలిపి విచారణ జరుపుతున్నది. ఈ కేసులో హెచ్‌‌‌‌సీఏ అధ్యక్షుడు  జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రావు, సెక్రటరీ దేవరాజ్‌‌‌‌ రాంచందర్‌‌‌‌‌‌‌‌, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ జేఎస్‌‌‌‌ శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌‌‌‌ కాంటే, శ్రీచక్ర క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ రాజేందర్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌ అధ్యక్షురాలు  కవితను  సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అందరినీ కస్టడీలోకి తీసుకొని విచారించారు.

ఈ క్రమంలోనే రెండేండ్లుగా బీసీసీఐ నుంచి గ్రాంట్లుగా వచ్చిన రూ.100 కోట్లకు పైగా దారి మళ్లించినట్లు గుర్తించారు. మధ్యవర్తులు, బినామీల పేర్లతో లావాదేవీలు జరిగినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది.ఈ మేరకు బీసీసీఐ గ్రాంట్స్‌‌‌‌ను దారి మళ్లించడంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. త్వరలో నిందితులను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెట్టింగ్‌‌‌‌ యాప్స్‌‌‌‌ కేసులోను ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో నటులు రానా దగ్గుబాటి, విజయ్‌‌‌‌ దేవరకొండ, ప్రకాశ్‌‌‌‌ రాజ్‌‌‌‌, మంచు లక్ష్మిని విచారించింది. బెట్టింగ్‌‌‌‌, గేమింగ్‌‌‌‌ యాప్స్ కంపెనీల ద్వారా జరిగిన చెల్లింపులు సహా సెలబ్రిటీల పెట్టుబడులపై ఆధారాలు సేకరించింది. ఈ కేసుల దర్యాప్తు సైతం నత్తనడకన సాగుతున్నది.

ఫార్ములా ఈ  కేసులో కంపెనీ డాక్యుమెంట్ల కోసం..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్​ కేసులో ఈడీ దర్యాప్తు నత్తనడకన సాగుతున్నది. మొదట్లో ఏసీబీతో పోటాపోటీగా దర్యాప్తు జరిపిన ఈడీ అధికారులు.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్ సహా నిందితులుగా ఉన్న నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌‌‌‌ కుమార్, హెచ్‌‌‌‌ఎండీఏ మాజీ చీఫ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. ఈ మేరకు ఏసీబీ నుంచి పలు డాక్యుమెంట్లను సేకరించారు. కానీ లండన్‌‌‌‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ నుంచి కీలక డాక్యుమెంట్లు నేటికీ అందలేదని  తెలిసిం ది.2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3, 11 తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డ్‌‌‌‌ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్‌‌‌‌కు వెళ్లిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీకి చెల్లించిన రూ.8 కోట్లు సహా మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. కానీ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ అకౌంట్ల నుంచి షెల్‌‌‌‌ కంపెనీల అకౌంట్లలో డిపాజిట్లకు సంబంధించిన రికార్డులు ఈడీకి అందలేదని సమాచారం. ఈ మేరకు ఈడీ అధికారులు రిమైండర్లు పంపుతున్నట్టు తెలిసింది.

టీఎస్పీఎస్సీలో అక్రమాల పైనా..
టీఎస్పీఎస్సీ గ్రూప్​–1 పేపర్ లీకేజీ కేసులోనూ ఈడీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో నిందితులైన ప్రవీణ్‌‌‌‌, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని 2023 ఏప్రిల్‌‌‌‌ 18న కస్టడీకి తీసుకొని విచారించింది. వీరితో పాటు కమిషన్‌‌‌‌ ఉద్యోగులు సత్యనారాయణ, శంకరలక్ష్మి ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆధారంగా వారిని ప్రశ్నించింది. న్యూజిలాండ్‌‌‌‌లోని రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి బావ ప్రశాంత్‌‌‌‌రెడ్డికి పేపర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌పంపించిన ఆధారాలతో స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డ్‌‌‌‌ చేసింది. ఈ క్రమంలోనే ఏఈ, డీఏవో పేపర్స్‌‌‌‌ లీకేజీతో రూ.27.5 లక్షలు చేతులు మారినట్లు గుర్తించింది. నిందితులు ప్రవీణ్‌‌‌‌, రేణుక ఆమె భర్త ఢాక్యనాయక్‌‌‌‌, తమ్ముడు రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ చైన్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌లో గ్రూప్‌‌‌‌ –1 పేపర్‌‌‌‌‌‌‌‌ను అమ్ముకుంటున్నట్లు ఆధారాలు సేకరించింది.

రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సొంత జిల్లా అయిన జగిత్యాలలోని మల్యాల మండలంలో మొత్తం 45 మందికి 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో ఆయా వ్యక్తుల ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్లను ఈడీ పరిశీలించింది.  ఈకేసులో నిందితులు, సాక్షులు సహా దర్యాప్తులో సేకరించిన బ్యాంక్‌‌‌‌ లావాదేవీల ఆధారంగా ఈడీ చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేయనున్నది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిసింది.