క్షిపణి ప్రయోగాల్లో వేగం పెంచిన కిమ్

క్షిపణి ప్రయోగాల్లో వేగం పెంచిన కిమ్

ఉత్తరకొరియా కవ్వింపులు తీవ్రం చేసింది. ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగా క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతోంది. తాజాగా మరోసారి మిసైల్ పరీక్షలు నిర్వహించింది. గత 2017 సంవత్సరం నుంచి ప్రయోగించిన క్షిపణులలో ఇదే అత్యంత శక్తివంతమైన క్షిపణి అని భావిస్తున్నారు. ఉత్తరకొరియా ప్రయోగించిన ఈ క్షిపణి సముద్రంలో పడిపోయిందని జపాన్ ప్రకటించింది. క్షిపణి 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరి.. 800 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఉంటుందని తెలిపారు. 30 నిమిషాలపాటు ప్రయాణించి తమ దేశ సముద్రజలాల్లోపడిపోయిందని జపాన్ ప్రకటించింది. ఈ ప్రయోగం జనవరి నెలలో చేపట్టిన ఏడో ప్రయోగమని తెలుస్తోంది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన కారణంగా అగ్రరాజ్యంపై ఒత్తిడిపెంచేందుకు కిమ్ క్షిపణి ప్రయోగాలు ఉధృతం చేసినట్లు తెలుస్తోంది.