అంతా మా ఇష్టం ..! కలెక్టర్లు ప్రోటోకాల్ పట్టించుకోవట్లే ..లీడర్లంటే గిట్టదు...ప్రజాప్రతినిధుల ఫోన్లకు నో రెస్పాన్స్‌‌

అంతా మా ఇష్టం ..!  కలెక్టర్లు ప్రోటోకాల్ పట్టించుకోవట్లే ..లీడర్లంటే గిట్టదు...ప్రజాప్రతినిధుల ఫోన్లకు నో రెస్పాన్స్‌‌
  • వివాదాస్పదంగా ఉత్తర తెలంగాణలోని ఇద్దరు కలెక్టర్ల తీరు
  • లీడర్లు, కలెక్టర్ల మధ్య బలవుతున్న ఉద్యోగులు
  • ఓ కలెక్టర్‌‌ సీసీలను మధ్యవర్తిగా పెట్టి కమీషన్ల దందా నడుపుతున్నారని ప్రచారం
  • ఫిర్యాదులు పెరగడంతో చర్యలకు రెడీ అవుతున్న సర్కార్‌‌

కరీంనగర్, వెలుగు : ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు కలెక్టర్ల తీరు కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను సైతం లెక్క చేయకుండా ఒంటెద్దు పోకడలు పోతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సర్కార్‌‌ అంటేనే తాము.. తామంటేనే సర్కార్‌‌ అనే పద్ధతిలో వ్యవహరిస్తూ జిల్లానంతా తామే నడిపిస్తున్నట్లు బిల్డప్‌‌ ఇచ్చుకుంటున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సదరు కలెక్టర్ల ప్రచార యావకు తోడు అహంకార ధోరణికి కిందిస్థాయి ఉద్యోగులు బలైపోతున్నారు. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, సదరు కలెక్టర్ల మధ్య కొందరు ఉద్యోగులు నలిగిపోతున్నారు. 

ఈ క్రమంలో ఇప్పటికే కొందరు ఉద్యోగులు సస్పెన్షన్‌‌కు గురికాగా.. మరికొందరు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యారు. ఆ ఇద్దరు కలెక్టర్లపై కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయి. వీరి వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలకు వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో చర్యలకు రెడీ అవుతున్నట్లు సమాచారం. 

సీసీని ముందు పెట్టి కమీషన్లు..

ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం కొలువైన జిల్లాకు కలెక్టర్‌‌గా ఉన్న ఓ ఆఫీసర్.. కొన్నాళ్లు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడంతో జనం జేజేలు పలికారు. అలా ఓ ఇమేజ్‌‌ను సొంతం చేసుకున్న ఆయనే.. ఇప్పుడు తనంటే ఎదుటివాళ్లలో ఉన్న భయాన్ని క్యాష్‌‌ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తన ద్వారా పాస్ అయ్యే ప్రతి బిల్లులో సీసీని ముందు పెట్టి ఆరు శాతం కమీషన్‌‌ వసూలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రెండు నెలలుగా సాగుతున్న ఈ కమీషన్ల దందా ఆ నోటా ఈ నోటా జిల్లా ముఖ్యనాయకుడి వరకు వెళ్లినట్లు సమాచారం. కుటుంబ అవసరాల కోసమే కాకుండా... కలెక్టరేట్‌‌ క్యాంటీన్‌‌లో అమ్ముకునేందుకు రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే రూ.లక్ష విలువైన ముర్రా జాతి గేదెను జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి నుంచి సదరు కలెక్టర్‌‌ ఉచితంగా తెప్పించుకున్నట్లు తెలిసింది. 

ముందు డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ.. ఇప్పటి వరకు చెల్లించలేదని సమాచారం. సదరు కలెక్టర్‌‌పై ఇటీవల ఆరోపణలు ముసురుకోవడంతో ‘కలెక్టర్‌‌ మంచోడు’ అంటూ అదే జిల్లాకు చెందిన ఓ అధికారి, జాతీయ పార్టీకి చెందిన కార్యకర్త కలిసి ఓ వీడియోను రూపొందించి సోషల్‌‌ మీడియా గ్రూపుల్లోకి వదిలారు. 

ఆ వీడియోను కలెక్టరేట్‌‌ ఆఫీసర్లు, సిబ్బంది అంతా వాట్సప్‌‌ స్టేటస్‌‌గా పెట్టుకోవాలని హుకుం జారీ చేయడం మరో వివాదానికి దారితీసింది. ఈ కలెక్టర్ దెబ్బకు ఇప్పటికే ఓ జిల్లా అధికారి బలికాగా, అదేబాటలో మరికొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

భూభారతి దరఖాస్తులనూ వదలని మరో కలెక్టర్‌‌

మరో జిల్లా కలెక్టర్‌‌ సైతం భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూభారతిలో వచ్చిన దరఖాస్తుల్లో ప్రొహిబిటెడ్‌‌ జాబితా నుంచి సర్వే నంబర్లు తొలగించడం, పీఓటీ కేసుల్లో లక్షలాది రూపాయలు డిమాండ్‌‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

గత వేసవిలో చెరువుల్లో నుంచి మట్టి రవాణాకు అనుమతులు ఇవ్వడంలో సదరు కలెక్టర్ చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు కలెక్టర్‌‌ తమను అవమానిస్తున్న తీరుపై మూడు రోజుల క్రితమే ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, లీడర్లు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.