సిటిజన్​షిప్​ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల బంద్

సిటిజన్​షిప్​ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల బంద్

గౌహతి: సిటిజన్​షిప్​ (సవరణ) బిల్లును  వ్యతిరేకిస్తూ నార్త్​ఈస్ట్​(ఈశాన్య) రాష్ట్రాల్లో (మణిపూర్​ మినహా)  మంగళవారం బంద్​ జరిగింది. ఉదయం ‌‌‌‌‌‌‌‌5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 గంటలపాటు బంద్​ కొనసాగింది.  ఏడాదికి ఒకసారి  జరిగే కార్నివాల్​ ముగింపు సందర్భంగా నాగాలాండ్‌‌‌‌ను మాత్రం బంద్​ నుంచి మినహాయించారు.  బంద్​ కారణంగా టూరిస్టులు  ఇబ్బంది పడ్డారు. అస్సాంలో ఆల్​ అస్సాం స్టూడెంట్స్​ యూనియన్​, నార్త్​ఈస్ట్​ స్టూడెంట్స్​ ఆర్గనైజేషన్​ ఆధ్వర్యంలో బంద్​ జరిగింది.  లెఫ్ట్​పార్టీలకు చెందిన యూనియన్లు కూడా దీనిలో పాల్గొన్నాయి.  బెంగాళీలు ఎక్కువమంది ఉన్న బారాక్​ వ్యాలీ మినహా మిగిలిన చోట్ల బంద్​ ప్రభావం కనిపించింది. గౌహతిలో బస్సులపై  ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. షాపులు, మార్కెట్లు మూతపడ్డాయి. బిల్లును వ్యతిరేకిస్తూ సిటీలో నినాదాలు చేశారు. రైళ్లు తిరగలేదు. అస్సాం ఫిల్మ్​ ఇండస్ట్రీకి చెందిన కళాకారులు  కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

మేఘాలయ బంద్

మేఘాలయలో షాపులు, మార్కెట్లు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.  గవర్నమెంట్​ ఆఫీసులకు కేవలం 10 శాతం మంది మాత్రమే హాజరైనట్టు అధికారులు చెప్పారు.  సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్​ బలగాలను దింపారు.   రాజధాని షిల్లాంగ్ లో ఆందోళనకారులు పోలీసుల వెహికిల్​ను ధ్వంసం చేశారు.

త్రిపురలో మార్కెట్​కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

అగర్తలా: త్రిపుర ధాలై జిల్లాలోని మనుఘాట్ లో నాన్​ ట్రైబల్స్​ కు చెందిన మార్కెట్​కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.  ట్రైబల్​ ప్రాంతాల్లో బంద్​ ప్రభావం బాగా కనిపించింది.   ధాలై, వెస్ట్​ త్రిపుర, ఖోవై జిల్లాల్లో జనం బయటకు రాలేదు. గవర్నమెంట్​ ఆఫీసులకు కూడా తక్కువ మంది హాజరయ్యారు. ట్రైన్​ సర్వీసులు ఆగిపోయాయి. రోడ్ల మీద ఎలాంటి వెహికిల్స్​ తిరగలేదు.

రాజ్​భవన్​ ఎదుట స్టూడెంట్స్​ ఆందోళన

కోహిమా:  సిటిజన్​షిప్​ బిల్లును వ్యతిరేకిస్తూ  కోహిమాలోని రాజ్​భవన్​ ఎదుట నాగా స్టూడెంట్స్​ ఫెడరేషన్​(ఎన్​ఎస్​ఎఫ్​) మంగళవారం ధర్నా చేసింది.  హార్నిబిల్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని నాగాలాండ్​కు  బంద్​ నుంచి మినహాయింపు నిచ్చారు.  అయినప్పటికీ  ఎన్​ఎస్​ఎఫ్​ కార్యకర్తలు గవర్నర్​ ఇంటి దగ్గర ఆందోళన చేశారు.  బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బిల్లును వ్యతిరేకించిన సైంటిస్టులు, స్కాలర్లు

న్యూఢిల్లీ: దేశవిదేశాలకు చెందిన వెయ్యి మంది ఈ  బిల్లును వ్యతిరేకించారు. బిల్లును విత్‌‌‌‌డ్రా చేసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ సైంటిస్టులు, స్కాలర్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఒక స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ను రిలీజ్‌‌‌‌ చేశారు. “సవరణ బిల్లులో పౌరసత్వానికి ప్రామాణికంగా మతాన్ని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధం” అని ఆ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చెప్పారు. హార్వార్డ్‌‌‌‌, మసాచూస్సేట్స్‌‌‌‌, ఐఐటీ, ఢిల్లీ యూనివర్సిటీ, చెన్నై మ్యాథ్స్‌‌‌‌ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు చెందిన స్కాలర్లు సంతకం చేసిన వారిలో ఉన్నారు.

శ్రీలంక తమిళులకూ పౌరసత్వం ఇవ్వాలి: శ్రీశ్రీ

చెన్నై: సిటిజన్​షిప్​ బిల్లుపై ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్​ రియాక్ట్​ అయ్యారు. శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడిన తమిళ శరణార్థులకు కూడా పౌరసత్వం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్​ వేదికగా కోరారు.  దాదాపు లక్ష మందికి పైగా శ్రీలంక తమిళులు  30 ఏళ్లుగా దేశంలో నివసిస్తున్నారని,  వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రముఖ తమిళ కవి వీరముత్తు కూడా ఇదే విన్నపం చేశారు.  అధికారిక లెక్కల  ప్రకారం ప్రభుత్వ రిహేబిలిటేషన్​ సెంటర్లు  సహా తమిళనాడు రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో శ్రీలంక తమిళులు నివసిస్తున్నారు.

జోధ్పూర్లో సంబురాలు

జోధ్‌​పూర్: సిటిజన్​షిప్​ బిల్లు ఆమోదం పొందడంతో పాకిస్తాన్​ నుంచి వచ్చిన హిందూ వలస వాదులు సంబురాలు చేసుకున్నారు.  దీనివల్ల తమకు ఇండియా  పౌరసత్వం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాలని కోరుకుంటున్నారు.  ‘ప్రభుత్వం మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇండియాలో గౌరవ ప్రదంగా జీవించడానికి అవకాశం కల్పించిన బీజేపీ ప్రభుత్వానికి, హోం మంత్రి అమిత్​షాకు థ్యాంక్స్​’ అని 2005లో పాక్​ నుంచి రాజస్థాన్​లోని  జోధ్‌​పూర్​కు వచ్చి తర్వాత  సిటిజన్​షిప్​ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రేమ్​చంద్​ అనే వ్యక్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ బిల్లు వల్ల ఎందరో వలసదారులు పౌరసత్వానికి అర్హత పొందుతారని సీమంత్​లోక్​ సంఘటన్​  ప్రెసిడెంట్​ హిందూ సింగ్​ శోధ అన్నారు.