సగం పనులన్నా సక్కగా చేయలే

సగం పనులన్నా సక్కగా చేయలే
  • పూడికతీతలు, కందకాల తవ్వకాల్లో అక్రమాలు 
  • రూ.14.70 కోట్లు రికవరీ చేయాలని కేంద్రం ఆదేశం 
  • 15 జిల్లాల్లో చేపట్టిన తనిఖీలపై రాష్ట్రానికి రిపోర్టు 
  • అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల్లో గోల్ మాల్ జరిగింది. రాష్ట్ర సర్కార్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా పనులు చేపట్టింది. ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో సగం కూడా సక్కగా చేయలేదు. చెరువులు, కుంటల్లో పూడికతీతలు, కందకాల తవ్వకాలు, వైకుంఠ ధామాల నిర్మాణం తదితర పనుల్లో అక్రమాలు జరిగాయి. తక్కువ పనులు చేపట్టి, ఎక్కువ చేసినట్టుగా చూపెట్టి నిధులు దుర్వినియోగం చేశారు. కొన్ని చోట్ల అవసరం లేని పనులు చేపట్టి రూ.వందల కోట్లు వృథా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని పనులు చేపట్టిన కొన్ని చోట్ల సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు (సీఐబీ) కూడా పెట్టలేదు. పోయిన నెలలో కేంద్ర బృందాలు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. జులైలో 15 జిల్లాల్లోని 108 గ్రామాల్లో కేంద్ర బృందాలు తనిఖీలు చేశాయి. ఉపాధి హామీ కింద ఎలాంటి పనులు చేపట్టారు? అవి ఎలా చేశారు? వాటికి ఖర్చయిన నిధులెన్ని? రికార్డుల మెయింటనెన్స్ వివరాలను ఫీల్డ్​కు వెళ్లి పరిశీలించాయి. ఇందులో జిల్లాల వారీగా గుర్తించి న అక్రమాలపై రిపోర్టును రాష్ట్రానికి కేంద్ర రూరల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ పంపింది. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిధులు రికవరీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర సర్కార్ కూడా ఉపాధి పనులపై ఆడిటింగ్ చేపట్టాలని సూచించింది. జూన్​లోనూ 5 జిల్లాల్లో తనిఖీలు చేపట్టిన కేంద్ర బృందం.. 12 గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఆ నిధులు రికవరీ చేయాలని అప్పట్లోనే రాష్ట్రానికి రిపోర్టు పంపింది. 

కేంద్ర బృందాలు గుర్తించిన అక్రమాలు..  

  •  ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అడగకున్నా చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టారు. చాలా చోట్ల అంచనా వేసిన మొత్తం కంటే తక్కువ ఖర్చు చేశారు. ఈ క్రమంలో అవకతవకలు జరిగాయి. పూడికతీత పనులు కూడా సరిగ్గా చేయలేదు. కూలీలతో కాకుండా కొన్ని చోట్ల మెషిన్ల తో పనులు చేశారు. ఈ పూడికతీత పనులు ఆపేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని.. రూ.10.40 కోట్లు రికవరీ చేయాలని.. ఆడిటింగ్ చేయించాలని కేంద్రం ఆదేశించింది. 
  • కందకాల తవ్వకల్లోనూ నిబంధనలు పాటించలేదు. ఒకే సైట్ లో వేర్వేరు ఐడీలతో కందకాలు తవ్వారు. రూ.వందల కోట్లు వృథా చేశారు. ఇవి తవ్విన భూములు కూడా సరైనవి కావు. ఆర్డినరి కందకాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, ఇలాంటి కందకాలు తవ్వకపోవడమే మంచిదని కేంద్రం పేర్కొంది. ప్లెయిన్ ఏరియాల్లో కందకాల తవ్వకాలకు సంబంధించి రూ.4.30 కోట్లు రికవరీ చేయాలని, మూడేండ్ల నుంచి చేపట్టిన కందకాలపై ఆడిటింగ్ చేయాలని ఆదేశించింది.   
  • రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల్లోనూ అవకతవకలు జరిగాయి. 400 మొక్కలు నాటాల్సి ఉండగా, చాలా చోట్ల అంతకంటే తక్కువే ఉన్నాయి. మొక్కలు ఎదగని చోట, జంతువులు తినేసిన చోట కొత్తవి నాటలేదు. 
  • కొన్ని ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మొక్కలు నాటినట్లు చూపెట్టినా, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి మొక్కలు లేవు. ట్రీ గార్డులు, ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయలేదు. ట్రీ గార్డుల నిధులు రికవరీ చేయాలని కేంద్రం ఆదేశించింది. 
  • ఉపాధి పనులకు సంబంధించి 322 ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. ఇక్కడ 45 శాతం పనులు సరిగ్గా చేయలేదు. ఈ పథకం కింద 523 నిర్మాణాలు చేపట్టగా, అందులో 151 సరిగ్గా లేవు. కొ న్ని చోట్ల చేసిన పనికి, ఖర్చుకు తేడా ఉంది.  
  • ఉపాధి పనులకు ఎలాంటి రికార్డులు మెయింటెయిన్ చేయడం లేదు. ఏడు రిజిస్టర్ల మెయింటెనెన్స్ లో అధికారులు విఫలమయ్యారు. స్టాఫ్ లేకపోవడంతోనే ఈ ఇబ్బంది తలెత్తినట్లు గుర్తించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిధుల రికవరీపై సెప్టెంబర్ 11 కల్లా రిపోర్టు పంపాలని కేంద్రం ఆదేశించింది.