గ్రాఫిక్స్ కాదు.. సైన్స్: వైట్ కలర్ డ్రస్ పింక్ కలర్లోకి మారింది

 గ్రాఫిక్స్ కాదు.. సైన్స్: వైట్ కలర్ డ్రస్ పింక్ కలర్లోకి మారింది

అప్పుడప్పుడూ సోషల్​ మీడియాలో కొన్ని వింతలు, విచిత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని కళ్లను మాయ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్​లు చేయాలంటే గ్రాఫిక్స్ వల్లే అవుతుంది.  రియల్​ లైఫ్​లో అలాంటివి జరగవు అనుకుంటాం. కానీ, కొన్ని చూసినప్పుడు నిజమని నమ్మక తప్పదు. ఎందుకంటే వాటిలో మాయ కాదు, సైన్స్ ఉంటుంది కాబట్టి. అలాంటిదే ఈ వీడియో.

మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనడానికి నిదర్శనం ఇది. అంతఃపురం సినిమాలో ‘అసలేం గుర్తుకు రాదు..’ అనే పాటలో నటి సౌందర్య చీర రంగు మారినట్లు, ఈ వీడియోలో ఒక అమ్మాయి డ్రెస్​ రంగు కూడా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​​ అయిన ఇజ్జి పూపి అనే అమ్మాయి లేటెస్ట్​గా తన ఇన్​స్టాగ్రామ్​లో ఒక వీడియో పోస్ట్ చేసింది.

అందులో ఆమె తెలుపు రంగు గౌన్​ వేసుకుని ఉంది. ఆమె ఇంట్లో నుంచి బయటకొచ్చి ఎండలో నిలబడింది. అంతే... వైట్​ కలర్​ కాస్తా పింక్​ కలర్​లోకి మారిపోయింది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాకయ్యారు. కొద్దిసేపట్లోనే ఆ వీడియో వైరల్​ అయింది. మిలియన్ల కొద్దీ లైకులు, కామెంట్లతో ట్రెండింగ్​గా మారింది. అయితే, వీడియో కింద రాసిన దాన్ని బట్టి దానికి కారణం.. అది పీహెచ్​5 బ్రాండ్​ డ్రెస్‌. ​ఆ కంపెనీ డిజైన్ చేసిన వాటిలో ఇదొక కొత్త రకం వెరైటీ. ఆ డ్రెస్​లు యూవీ కిరణాలు పడగానే రియాక్ట్​ అయి ఇలా రంగు మారతాయట.