వెంచర్​లో ప్లానింగ్​ లోపం.. ఇంగ్లండ్​లో 263 ఇండ్లకు కూల్చివేత ముప్పు

వెంచర్​లో ప్లానింగ్​ లోపం.. ఇంగ్లండ్​లో 263 ఇండ్లకు కూల్చివేత ముప్పు

లండన్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ రియల్​ ఎస్టేట్​ వెంచర్​లో 263 ఇండ్లు కట్టారు, అమ్మారు.. కొన్న వాళ్లంతా ఇండ్లలో దిగిపోయారు. రెండేళ్లు గడిచిపోయాయి. సీన్​ కట్​చేస్తే.. ఆ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని స్థానిక మున్సిపాలిటీ ప్రకటించింది. దీంతో అక్కడ తలా రూ.2 కోట్లు పెట్టి ఇండ్లు కొన్న వాళ్లంతా లబోదిబోమంటున్నరు. కష్టార్జితంతో కొన్న తమ ఇండ్లను.. అక్రమ నిర్మాణాల కింద జమకట్టి  కూలుస్తరేమోనని భయపడుతున్నరు. ఇంగ్లండ్​లోని  చెషైర్ కౌంటీ పరిధిలో  క్రూ పట్టణ శివారులో ఉన్న  ‘కంట్రీ సైడ్​పార్ట్నర్​ షిప్స్’ రియల్​ఎస్టేట్​ వెంచర్​లో ఇండ్లు కొన్న వాళ్ల దీనస్థితి ఇది.

ట్రైన్ ఫ్యాక్టరీ స్థలంలో వెంచర్

గతంలో కంట్రీసైడ్​ పార్ట్నర్​షిప్స్ వెంచర్​ స్థానంలో బాంబార్డియర్​ ట్రైన్​ ఫ్యాక్టరీ ఉండేది. అనంతరం కాలంలో దాన్ని మూసివేశారు. ఆ 17 ఎకరాల స్థలాన్ని ‘కంట్రీసైడ్​ పార్ట్నర్​షిప్స్’ అనే రియల్​ ఎస్టేట్​ కంపెనీ కొనుగోలు చేసింది. 2018 డిసెంబరులో ఈ స్థలంలో ఇండ్ల నిర్మాణానికి మున్సిపాలిటీ(చెషైర్​ఈస్ట్​ కౌన్సిల్​) నుంచి పర్మిషన్స్​ కూడా వచ్చాయి. దీంతో మూడు నుంచి నాలుగు బెడ్​ రూమ్స్ కలిగిన 239 ఇండ్లను, 24 ఫ్లాట్లను కంపెనీ కట్టింది. వెంచర్​ పరిధిలో ఇంకొన్ని రోడ్ల నిర్మాణ పనులు పెండింగ్​లోనే ఉన్నాయి.

మున్సిపల్  అధికారుల నోటీసులు

‘కంట్రీ సైడ్​పార్ట్నర్​షిప్స్’ కంపెనీకి మున్సిపల్​ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇండ్లు కట్టడానికి ముందు, కట్టేటప్పుడు నేలలోని కాలుష్య కారకాలకు సంబంధించిన పరీక్షలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో అక్కడ ఉన్న ట్రైన్​ ఫ్యాక్టరీ వల్ల భూమిలో ఇంకిపోయిన ప్రమాదకర రసాయనాలు, కాలుష్య కారకాల వల్ల  ప్రజల ఆరోగ్యాలకు ముప్పు ఉండదనే నిర్ధారణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. స్థానిక కౌన్సిలర్లు కూడా ‘కంట్రీ సైడ్​పార్ట్నర్​షిప్స్’ కంపెనీపై విరుచుకుపడుతున్నారు. ఆ కంపెనీ ప్రజలకు జవాబుదారీగా ఉండటానికంటే లాభాలకే ప్రాముఖ్యతనిచ్చిందని ఆరోపిస్తున్నారు.

ఇండ్లు కొనుక్కున్నోళ్ల ఆందోళన

మున్సిపల్​ అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, రియల్ ఎస్టేట్​ కంపెనీ నడుమ ఇండ్లు కొన్న 263 కుటుంబాలు నలిగిపోతున్నాయి. మున్సిపల్​ధ్రువీకరణ లేకపోవడంతో.. తమ ఇండ్లను అమ్ముకునే, లీజుకు ఇచ్చుకునే పరిస్థితి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల ధర కూడా బాగా పడిపోయిందని అంటున్నారు. రాజకీయ దురుద్దేశంతో, లంచాన్ని ఆశించి ‘కంట్రీ సైడ్​పార్ట్నర్​షిప్స్’ కంపెనీని వేధిస్తున్నారని ఇంకొందరు  అభిప్రాయపడుతున్నారు.