సూర్య కాదు.. అత్యుత్తమ టీ20 బ్యాటర్ సఫారీ ఆటగాడు: కెవిన్ పీటర్సన్

సూర్య కాదు.. అత్యుత్తమ టీ20 బ్యాటర్ సఫారీ ఆటగాడు: కెవిన్ పీటర్సన్

భారత టీ20 సంచలనం సూర్యకుమార్(Suryakumar Yadav) ఆట గురించి అందరికీ విదితమే. దూకుడు తన శైలి అయితే, వినూత్న షాట్లు ఆడటం సూర్య ప్రత్యేకత. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదడం అతని నైజం. వన్డేల్లో విఫలమైనప్పటికీ.. టీ20ల్లో మాత్రం సూర్య దూకుడుకు మరొకరు సాటిరారు. అయితే, ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ మాత్రం అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా సూర్యను కాదని మరొకరికి ఓటేశారు. 

సన్‌రైజర్స్ బ్యాటర్

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ భీకర ఫామ్ లో ఉన్నాడు. సఫారీ గడ్డపై జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు వీరవిహారం చేస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు ఏదైనా.. బౌలర్ ఎవరైనా అతని ముందు చిన్నబోవాల్సిందే. అతను క్రీజులోకి రాకముందు మ్యాచ్ ఫలితం ఒకలా ఉంటే.. వచ్చాక ఫలితం మరోలా ఉంటోంది. ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న క్లాసెన్.. తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. గురువారం(ఫిబ్రవరి 8) జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులోనూ అదే జరిగింది.

ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన క్లాసెన్.. కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఇమ్రాన్ తాహిర్(15వ ఓవర్), సామ్ కుక్(18వ ఓవర్) బౌలింగ్‌లో 29 పరుగుల చొప్పున పిండుకున్నాడు. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. క్లాసెన్ ఎదురుదాడికి సూపర్ కింగ్స్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది. ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. ఈ క్రమంలో అతని బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు.

ALSO READ :- నేను చేసింది తప్పే.. ఇంగ్లాండ్ కోచ్‌కు గంభీర్ క్షమాపణలు

"ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఇంతకంటే గొప్ప బ్యాటర్ మరొకరు లేరు! క్లాసెన్ ఈజ్ ది బాస్..!" అని కామెంట్ చేశారు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ క్లాసె 12 మ్యాచుల్లో 208.87 స్ట్రైక్ రేట్‌తో 447 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.