హెల్మెట్ లేక 46 వేల మంది మృతి.. సీటు బెల్ట్ లేక 16వేలు

హెల్మెట్ లేక 46 వేల మంది మృతి.. సీటు బెల్ట్ లేక 16వేలు

2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కేవలం సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లనే 16,397 మంది మరణించినట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నివేదిక తెలిపింది. వీరిలో 8,438 మంది డ్రైవర్లు కాగా.. మిగిలిన 7,959 మంది ప్రయాణికులని ప్రకటించింది.

దేశంలో రోడ్డు ప్రమాదాలు 2021' పేరుతో రూపొందించిన నివేదికను కేంద్రం వెల్లడించింది. 2021లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 46,593 మంది మరణించారని , అందులో 32,877 మంది డ్రైవర్లు, 13,716 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంది. 2021లో మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 1,53,972 మంది ప్రాణాలు కోల్పోగా, 3,84,448 మంది గాయపడ్డారని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2021లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 93,763 మందికి, సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల 39,231 మందికి గాయాలైనట్టు పేర్కొంది. 

కొన్ని మినహాయింపులు మినహా ద్విచక్ర వాహనాలపై వెళ్లే వాహనదారులందరికీ హెల్మెట్ తప్పనిసరి. అదే తరహాలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు డివైడర్‌ను ఢీకొనడంతో సెప్టెంబర్ 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన స్నేహితుడు జహంగీర్ పండోల్‌తో పాటు వెనుక కూర్చున్న మిస్త్రీ సీటు బెల్ట్ ధరించలేదు. దీంతో వేగంగా వెళ్తున్న కారు, డివైడర్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మిస్త్రీ, పండోల్ ఇద్దరూ చనిపోవడం తెలిసిందే. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR)లోని రూల్ 138 (3) ప్రకారం వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలి. కానీ చాలా మందికి ఈ నియమం గురించి అంతగా తెలియక విస్మరిస్తారు. కానీ.. ఈ తరహా ఘటనలు కూడా దేశంలో ఈ మధ్య ఎక్కువగానే జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం.