ఆ ఊరంతా సర్కార్ దేనట.. ఇంటింటికీ లక్షల జరిమానా

 ఆ ఊరంతా సర్కార్ దేనట.. ఇంటింటికీ లక్షల జరిమానా
  • రూ.లక్షలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలట
  • ఒక్కో పెంకుటిల్లుకు రూ.5 లక్షల దాకా రెగ్యులరైజేషన్ ఫీజు
  • లబోదిబోమంటున్న నిరుపేదలు
  • కూలి చేసుకునే తాము అన్ని లక్షలు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన

మెదక్, వెలుగు: మెదక్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న మంబోజిపల్లి గ్రామానికి కొత్త కష్టం వచ్చింది. ఊర్లోని ఇండ్లన్నీ సర్కారు జాగాలోనే ఉన్నాయని, పైసలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. అదీ పదో పాతికో కాదు.. ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.5.5 లక్షల దాకా కట్టాలంటూ అందులో పేర్కొన్నారు. ఈ నోటీసులను చూసి గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. కూలినాలి చేసుకుని బతికే తాము అన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు. తాము దశాబ్దాలుగా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నామని, గత కాంగ్రెస్ ప్రభుత్వం సొంత ఇల్లు లేని కొందరు పేదలకు ఇందిరమ్మ స్కీం కింద ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చిందని చెబుతున్నారు. ఇన్నేండ్లుగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులు చెల్లిస్తున్నామని, ఆఫీసర్లు వచ్చి అక్కడి ఇండ్లన్నీ ప్రభుత్వ భూమిలోనే ఉన్నాయని, జీవో నంబర్​ 58, 59 కింద రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందేనని చెబుతున్నారని అంటున్నారు. సర్కారే ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు.

నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తలే

మెదక్ మండలం మంబోజిపల్లి గతంలో ర్యాలమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో మదిర గ్రామంగా ఉండేది. 30 ఏండ్ల కింద ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటైంది. ప్రస్తుతం ఊరిలో సుమారు 400 ఇండ్లు ఉన్నాయి. గ్రామ సర్వే నంబర్ 368లో 380 ఎకరాలకు పైగా సర్కారు భూమి ఉంది. 1987లో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ఇందులో 150 ఎకరాలు కేటాయించింది. మిగిలిన కొంత భూమిలో కూలినాలి చేసుకునే పేదలు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. మొదట్లో 30, 40 ఇండ్లు మాత్రమే ఉండగా, క్రమంగా 400 ఇండ్ల వరకు విస్తరించింది. మెదక్ నేషనల్ హైవే (765డి)  రావడంతో హోటళ్లు, వివిధ రకాల దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఏపీలో ఉన్నంతకాలం మంబోజీపల్లి గ్రామస్తులకు ఎలాంటి సమస్య రాలేదు. ఆఫీసర్లు ఇండ్ల నంబర్లు, వాటి సాయంతో కరెంట్ ​మీటర్లు కేటాయించారు. దీంతో ఆస్తి పన్ను, కరెంట్ బిల్లులు కట్టారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వీరికి కష్టాలు మొదలయ్యాయి. పాత గుడిసెలు, ఇండ్లు కూల్చుకొని ఆ స్థలంలో కొత్త ఇండ్లు, షాపులు కట్టుకుందామని పోతే ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఊరు ఊరంతా సర్కారు భూమేనని, రెగ్యులరైజేషన్​ చేసుకుంటే తప్ప నిర్మాణాలకు పర్మిషన్​ రాదని చెప్తున్నారు.

కట్టాల్సింది రూ.6 కోట్లకు పైమాటే

2014 జూన్​ 2 నాటికి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం 58, 59 జీవోలు తెచ్చింది. దీంతో మంబోజిపల్లిలో 352 మంది దరఖాస్తు చేసుకున్నారు. జీవో58 కింద 125 గజాల లోపు ఇండ్లు ఉన్నవారు 158 మంది కాగా, మిగిలిన 194 మందికి  మార్కెట్​ రేట్ల ప్రకారం రెగ్యులరైజేషన్ ఫీజులు చెల్లించాలంటూ నోటీసులు పంపుతున్నారు. పెంకుటిండ్లు, రేకుల షెడ్లకు రూ.5 లక్షల దాకా చెల్లించాలని నోటీసులు ఇస్తుండడంతో ఆ మొత్తం ఎలా కట్టాలో తెలియక పేదలు పరేషాన్ అవుతున్నారు. తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడ్తాయనుకుంటే ఇలా తమ ఇంటి స్థలాలను తమకు ఇచ్చేందుకే లక్షలకు లక్షలు సర్కారుకు కట్టాల్సి రావడం దారుణమన్నారు. ఊరంతా లెక్కేస్తే రూ.6 కోట్లకు పైగా కట్టాల్సి వస్తుందని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే తమకు పట్టాలు వద్దు, ఏమీ వద్దు అని తెగేసి చెప్తున్నారు. 368 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్రామకంఠంగా గుర్తించి, పాత ఇండ్ల స్థలాల్లో కట్టే కొత్త ఇండ్లకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏంటీ 58, 59 జీవోలు

ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ, అర్బన్ సీలింగ్ యాక్ట్ పరిధిలోని భూముల్లో 2014 జూన్​2కు ముందు ఇండ్లు కట్టుకొని ఉంటున్న పేదల ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2014లో జీవో 58, 59 ఇచ్చింది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు ఇంటి స్థలాలను ఫ్రీగా, జీవో 59 కింద మార్కెట్ రేటు ప్రకారం పట్టాలివ్వాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరిలో రెండోసారి మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్లు స్వీకరించారు. 1.60 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 70 వేల ఇండ్ల వరకు 59 జీవో పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వీటిని రెగ్యులరైజేషన్ చేయడం ద్వారా రూ.4 వేల కోట్లు రాబట్టాలనేది సర్కారు ప్లాన్​. దీంతో గతంలో అప్లికేషన్లు పెట్టుకున్నవాళ్లకు ఇటీవల గ్రామాలవారీగా ఆఫీసర్లు నోటీసులు పంపిస్తున్నారు. ఒక్కో ఇంటికి లక్షలకు లక్షలు చెల్లించాలని నోటీసుల్లో ఉండడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.

రేకుల షెడ్డుకు 4 లక్షలా?

మా తాతల కాలం నుంచి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నం. చాలా ఏండ్లు గుడిసెలనే ఉన్నం. వానపడితే ఉరుస్తున్నదని కొన్నేండ్ల కింద అప్పుచేసి రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నం. మాకు వేరే ఆస్తిపాస్తులేమీ లేవు.  పొలాలు లేవు. మేము ఉంటున్న జాగ రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేస్తే.. రూ.4 లక్షలు కట్టమని నోటీస్ పంపిన్రు. మా ప్రాణాలు తప్ప పైసలు లేవు. లేనోళ్లకు డబుల్ ఇండ్లు ఇస్తమని ప్రభుత్వం ఇయ్యలేదు. కానీ మా కష్టంతో వేసుకున్న రేకుల షెడ్డుకు పైసలు కట్టుమనుడు ఏం న్యాయం?

-తుర్లపాటి వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి

గింత అన్యాయం ఉంటదా?

తెలంగాణ కోసం నేను కూడా కొట్లాడిన. మన రాష్ట్రం మనకు వస్తే మంచిగైతది అనుకున్న. కానీ గింత అన్యాయమా. పైసలు కూడబెట్టి పెంకుటిల్లు కట్టుకుంటే.. ఇంటి పట్టాకు రూ.4.31 లక్షల కట్టాల్నట. ఇదేమి తరీఖ. అన్ని లక్షలు ఎట్ల కడ్తరు?

- గౌండ్ల మల్లగౌడ్

గ్రామ కంఠం భూమిగా గుర్తించాలి

మా గ్రామం ఉన్న సర్వే నంబర్ 368 అంతా ప్రభుత్వ భూమేనని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌కు చాన్స్ ఇవ్వడంతో గ్రామంలో అందరూ అప్లై చేసుకున్నారు. అధికారులు సర్వే కూడా చేశారు. ఇప్పటి వరకు 112 అప్రూవ్ అయినట్టు తెలిసింది. రెగ్యులరైజేషన్ ఫీజు కట్టాలంటూ ఇప్పటికే 70 మందికి నోటీసులొచ్చాయి. పెంకుటిండ్లు, రేకుల షెడ్లకు లక్షల్లో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంబోజిపల్లి ఊరు ఉన్న భూమిని గ్రామ కంఠంగా గుర్తిస్తే సమస్య ఉండదు.

- గంజి ప్రభాకర్, సర్పంచ్