- ఆర్టీఏ యాక్ట్ కింద అడిగిన వివరాలు ఇవ్వకపోవడంపై కమిషన్ నోటీసులు
ఊట్కూర్, వెలుగు: సమాచారం ఇవ్వనందుకు నారాయణపేట ఆర్డీఓ ఊట్కూర్ తహసీల్దార్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ ఐక్య వేదిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు కొనింటి, నర్సిములు బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023– 2025 నారాయణపేట జిల్లాలో దేవదాయ ధర్మాదాయ శాఖ, హంపి పీఠంకు సంబంధించిన భూములు, వక్ఫ్ బోర్డు, బంజారా ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయని జిల్లాలోని ప్రతి మండల వారీగా ఇప్పటివరకు మండలాల్లో ఎంతమంది రైతులకు పట్టాలు చేశారని, ఊట్కూర్ మండలంలో ప్రభుత్వ భూములు గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలు పట్టాలు చేశారనే వివరాలు అడిగినట్లు తెలిపారు.
ఊట్కూర్ మండలంలో గ్రామాల వారీగా కల్యాణ లక్ష్మీ రిపోర్టులు, వాటి వివరాలు తదితర ప్రశ్నలకు నారాయణపేట జిల్లా ఆర్డీఓ, ఊట్కూర్ తహసీల్దార్ లకు వేరువేరుగా దరఖాస్తులు చేశామన్నారు. కానీ వారు సమాచారం ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. స్పందించిన రాష్ట్ర సమాచార కమిషన్ ఈ నెల14న మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని నారాయణపేట ఆర్డీఓ, ఊట్కూర్ తహసీల్దార్ వేర్వేరుగా హాజరుకావాలని రాష్ట్ర సమాచార కమిషనర్ నోటీసులు వారికి జారీ చేసినట్లు తెలిపారు.
