
నందమూరి తారకరామారావు నటించిన బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీ అడవి రాముడు రీ రిలీజ్ కు సిద్దమవుతోంది. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మే 28న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్స్ సీస్ లో కూడా అడవి రాముడు స్పెషల్ ప్రీమియర్ షోస్ వేయనున్నారు. 1977లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లోనే బిగ్గేస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జయ సుధ, జయప్రద హీరోయిన్లుగా నటించారు.
1970 దశకంలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు మూవీగా, థియేటర్లలో ఏడాదికిపైగా ఆడిన సినిమాగా అడవిరాముడు రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి కే వీ మహదేవన్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాలోని "ఆకు చాటు పిందే తడితే" అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటుంది ఈ పాట. దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుండటంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క.. సుపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న "మోసగాళ్లకు మోసగాడు" సినిమా కూడా రీ రిలీజ్ కానుంది. రెండు రోజుల వ్యవదిలో ఇద్దరు సీనియర్ హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కానుండటం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.