పొంగులేటి దెబ్బతో నూకల సురేష్ రెడ్డికి గిరాకీ

పొంగులేటి దెబ్బతో నూకల సురేష్ రెడ్డికి గిరాకీ

ఎక్కడో జరిగిన చిన్న సంఘటన.. ఇంకెక్కడో వాతావరణాన్ని మార్చేస్తుంది. దీన్నే బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటారు. రాజకీయాల్లోనూ ఇట్లాంటివి జరుగుతుంటాయని ఓ సీనియర్ లీడర్ కు ఈ మధ్యే అర్థమైంది. ఎప్పుడూ పట్టించుకోని పెద్ద లీడర్లు ఇంటికొస్తున్నారట. మొన్నటిదాకా అడిగినా వినిపించుకోనివాళ్లు.. ఇప్పుడు అతి ప్రేమలు చూపిస్తూ మర్యాదలు ఒలకబోస్తున్నారట. 

మహబూబాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత నూకల సురేష్ రెడ్డికి అధికార పార్టీలో సడెన్ గా ప్రాధాన్యం పెరగడం పార్టీలో లోకల్ గా చర్చకు దారితీసింది. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నా పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. పేరుకి పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఖమ్మం జిల్లా ఇన్ చార్జి పోస్టులున్నా రాజకీయంగా పెద్ద యాక్టివ్ గా లేరు. సడెన్ గా ఎందుకో పార్టీ నాయకత్వానికి నూకల సురేష్ రెడ్డి గుర్తుకొచ్చారు. ఈమధ్య మహబూబాబాద్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్... నూకల ఇంటికి పోయి మాట్లాడారు. తర్వాత రోజే ఆయనకు ప్రగతిభవన్ నుంచి పిలుపొచ్చింది. మాట్లాడి పంపించారు. 

నిన్న, మొన్నటి దాకా లేని గుర్తింపు సడెన్ గా ఎందుకొచ్చిందా..? అన్న చర్చ జిల్లా పార్టీ వర్గాల్లో మొదలైంది. ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడమే దీనికి కారణమని చెబుతున్నారు. పక్క జిల్లాలో ఏదో జరిగితే మహబూబాబాద్ జిల్లా నేతకు ఏం సంబంధం అన్నది బయటివాళ్లకు అర్థం కాలేదు. అయితే.. దీనికి వెనుక చాలా పెద్ద కథే ఉందంటున్నారు స్థానిక నేతలు. 

ఖమ్మం జిల్లాను అనుకునే డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్లు ఉంటాయి. పొంగులేటికి సన్నిహితులు, బంధువులు ఈ ప్రాంతాల్లో ఎక్కువగానే ఉన్నారు. ఈ ప్రాంతంలో మంచి పేరున్న పాతతరం నేతల్లో నూకల రాంచంద్రారెడ్డి ఒకరు. ఆయన వారసుడు, డోర్నకల్ కు చెందిన రామసహాయం సురేందర్ రెడ్డితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధుత్వం ఉంది. కాంగ్రెస్ లో పొంగులేటి చేరాక ఈ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నేతలను కదలిస్తున్నారని పార్టీ ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే అలర్ట్ అయ్యి.. నూకల సురేష్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్లు లోకల్ నేతలు అంటున్నారు.

ALSO READ :ఎమ్మెల్యే పైళ్లకు ప్రజా సమస్యలు పట్టవు : గూడూరు నారాయణ రెడ్డి

కొంతకాలం కింద మహబూబాబాద్ టూర్ లో నూకల రామచంద్రారెడ్డి పేరును కేసీఆర్ ప్రస్తావించారు. ఇప్పటి తరంవారికి పెద్దగా తెలియని పేరును కేసీఆర్ సడెన్ గా తీయడంతో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు పరిణామాలను చూశాక ఆయన ఉద్దేశం ఏంటో క్లారిటీ వచ్చిందంటున్నారు. 

1981లో కాంగ్రెస్ తో రాజకీయం జీవితం మొదలుపెట్టిన నూకల సురేశ్ రెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. 2010లో బీఆర్ఎస్ లోకి వచ్చి కొనసాగుతున్నారు. పేరుకి పార్టీ పదవి ఉన్నా ఏ గౌరవం లేదన్న ఫీలింగ్ ఆయన వర్గంలో ఉంది. రిజర్వుడు సీట్లు కావడం వల్ల పోటీ చేయలేకున్నా రెడ్డి నాయకుడిగా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. గతంలో ఎమ్మెల్సీ పదవి ఆశించినా పార్టీ ఇవ్వలేదు. పొంగులేటి వెళ్లిపోవడంతో రెడ్డి నాయకుడిగా ఉన్న నూకల సడెన్ గా పెద్ద నాయకులకు గుర్తొచ్చారని లోకల్ పార్టీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నూకల కూడా దూరమైతే పార్టీకి ఇబ్బందేననీ, అందుకే దగ్గర చేసుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.