
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తగ్గడంతో ట్రాఫిక్ ఎఫెక్ట్
- నడిరోడ్డుపై నరకం చూస్తున్న వాహనదారులు
- వాహనాలకు తగ్గట్టు రోడ్లు లేకపోవడమే కారణం
హైదరాబాద్, వెలుగు: రోజురోజుకూ పెరుగుతున్న వెహికల్స్ గ్రేటర్‌ను మరింత ట్రాఫిక్ సమస్యలోకి నెట్టేస్తున్నాయి. సిటిజన్లు రద్దీ రోడ్లపై బస్సుల్లో జర్నీ కంటే కార్లు, బైకులనే నమ్ముకుంటున్నారు. మెట్రోరైల్ వచ్చినా కనెక్టివిటీ సరిగా లేక సొంత వాహనాల్లోనే ట్రావెల్ చేస్తున్నారు. దీంతో సిటీ రోడ్లన్నీ వెహికల్స్ తో నిండిపోతున్నాయి. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టు రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్జామ్అయ్యి ప్రజలు నడిరోడ్డుపై నరకం చూస్తున్నారు.
రెండేండ్లలో 18 లక్షలు పెరిగిన వెహికల్స్
కరోనా తరువాత సిటీలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తగ్గింది. దీంతో సొంతవాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ఇంటికి 3 నుంచి 5 వెహికల్స్ అయ్యాయి. ఇలా రెండేండ్ల క్రితం 67 లక్షలు ఉన్న వాహనాల సంఖ్య ఈ ఏడాది అక్టోబర్ వరకు 85 లక్షలకు పైగా చేరింది. ఇందులో ప్రతి రోజు 65 లక్షల వాహనాలు సిటీ రోడ్లపై తిరుగుతున్నాయి.35 లక్షలకు పైగా బైకులు, 25 లక్షలకు పైగా కార్లు ట్రావెల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మిగితావి ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. మరో15 శాతం ఇతర జిల్లాలకు చెందినవి ఉంటున్నాయి.
రోడ్ల విస్తరణ లేకనే ట్రాఫిక్ తిప్పలు
సిటీ ట్రాఫిక్ అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టు రోడ్ల విస్తరణ లేకపోవడంతో ఎక్కడిక్కడే ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆర్టీసీ బస్సుల్లో జర్నీ ఆలస్యమవుతుడడంతో గ్రేటర్ చుట్టు ప్రక్కనల ప్రాంతాల నుంచి సొంత వాహనాలపైనే చాలా మంది వస్తున్నారు. దీంతో బేగంపేట్, సికింద్రాబాద్, సీటీసీ, రసూల్‌పుర, నల్గొండ క్రాస్ రోడ్స్, రవీంద్రభారతి, మెహీదీపట్నం, పంజాగుట్ట, హైటెక్ సిటీలోని ఐటీ కారిడార్ తీవ్ర ట్రాఫిక్సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా ఈ పరిస్థితి ఆఫీస్ హవర్స్‌లోనే ఎక్కువగా ఉంటోంది.
కిలోమీటర్ దూరానికి పది నిమిషాలు..
నేను హైటెక్ సిటీలో జాబ్ చేస్తా. ఎల్బీనగర్ నుంచి రావాలి. మా ఆఫీస్ నుంచి ఇంటికి సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ లేదు. దీంతో బైక్ పైనే వెళ్తా. మలక్‌పేట్, లక్డీకపూల్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటున్న. కిలో మీటర్ ట్రావెల్ చేయాలంటే 10 నిమిషాలు పడుతోంది.
- రాకేష్ , ఐటీ ఎంప్లాయి, ఎల్బీనగర్
ప్రతి ఏరియాలో జామ్
బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నా. రోజూ బడంగ్‌పేట్ నుంచి ట్రావెల్ చేస్తా. సైదాబాద్ నుంచి ప్రతి ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంటోంది. ఆఫీస్‌కి టైమ్‌కి చేరుకోవాలంటే సొంత వెహికిల్‌తోనే రోడ్డెక్కుతాం. అయినా సమయానికి చేరుకోకపోతున్నం.
- భరత్ కుమార్, బడంగ్‌పేట్