యూత్ ​ఓట్లే కీలకం .. గెలుపోటములను డిసైడ్​ చేసేది వీళ్లే

యూత్ ​ఓట్లే కీలకం .. గెలుపోటములను డిసైడ్​ చేసేది వీళ్లే
  • 48.70 శాతం మంది ఓటర్లు 39 ఏండ్ల లోపు వారే
  • యువత, నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీల ఎత్తుగడలు

కామారెడ్డి, వెలుగు:  ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహిస్తుండడంతో యూత్​ఓట్ల సంఖ్య మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూత్​ఓట్లు కీలకం కానున్నాయి. యువత ఎటువైపు నిలుస్తారనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే యూత్​ఓట్లపై పార్టీలు స్పెషల్ ​ఫోకస్ ​పెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, ఏండ్ల నిరీక్షణ తర్వాత నోటిఫికేషన్లు వేసినా పేపర్ల లీకేజీలతో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి. 

టీచర్​ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ధర్నాలు చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీలు సపోర్ట్​ చేస్తున్నాయి. మరోవైపు అధికార బీఆర్ఎస్ గతంలో ఏ ప్రభుత్వం భర్తీ చేయని విధంగా ఒకేసారి అధికమొత్తంలో పోస్టులు భర్తీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. దీనికి తోడు ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్​మేళాలు నిర్వహిస్తూ యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​పార్టీలు గ్రామాల్లోని యువజన ​సంఘాలపై ఫోకస్​ చేస్తున్నాయి. క్రికెట్​కిట్లు, ఇతర క్రీడ సామగ్రి అందజేస్తూ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఎన్నికల హామీలపై..

గత ఎన్నికలకు ముందు అధికార పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల అంశంపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ​ప్రశ్నిస్తున్నాయి. పేపర్​లీకేజీ వ్యవహారాలపై సైతం ఆయా పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. 

ఓటరు నమోదుకు ప్రత్యేక కార్యక్రమాలు

ఎన్నికల సంఘం ఇటీవల నియోజకవర్గాల వారీగా ఓటర్ల లిస్ట్ ​రిలీజ్ ​చేసింది. మరోసారి కొత్తగా నమోదుతో పాటు,  మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అక్టోబర్​లో ఫైనల్ ​లిస్ట్ ​రిలీజ్ ​కానుంది. 2023, అక్టోబర్ 1 నాటికి18 ఏండ్లు నిండే వాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతుంది. ఇందుకోసం ఈ నెల 26,27 తేదీల్లో స్పెషల్ డ్రైవ్నిర్వహించారు. ప్రతీ పోలింగ్ సెంటర్​వద్ద బూత్​లెవల్ ఆఫీసర్​ను అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటరు ఎంట్రీతో పాటు, మార్పులు, చేర్పుల అప్లికేషన్లు స్వీకరించారు. మరోసారి సెప్టెంబర్​2,3 తేదీల్లోనూ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ నెల 26,27 తేదీల్లో నిర్వహించిన డ్రైవ్​లో కామారెడ్డి జిల్లాలో 2,730, నిజామాబాద్​జిల్లాలో 5,932 మంది కొత్తగా అప్లయ్​చేసుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 1,460, జుక్కల్​లో 846, ఎల్లారెడ్డిలో 424, బాన్సువాడలో 1,118, ఆర్మూర్​లో 914, బోధన్​లో 853,  నిజామాబాద్​అర్బన్​లో 750, నిజామాబాద్​ రూరల్​లో 1,328, బాల్కొండలో 969 అప్లికేషన్లు వచ్చాయి.

ఉమ్మడి జిల్లాలో ఇలా...

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొత్తం 19,61,733 ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 10,24,428 మంది కాగా, 9,37,246 మంది పురుష ఓటర్లు ఉన్నారు. వీరిలో 39 ఏండ్ల లోపు వారే 9 లక్షల 60 వేల మంది (48.70%) ఉన్నారు. ప్రస్తుతం మళ్లీ 18 నిండిన వారి నుంచి ఓటరు నమోదుకు తాజాగా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్​2,3 తేదీల్లో స్పెషల్ డ్రైవ్​కార్యక్రమాలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 18-19 ఏండ్ల వారు 29,600, 29 ఏండ్ల లోపు 3,76,844, 39  ఏండ్ల లోపు 5,43,561 మంది ఉన్నారు.