నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట

నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద కామెంట్లు చేసి సస్పెన్షన్​కు గురైన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణ పూర్తయ్యేంత వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది. తనపై దేశవ్యాప్తంగా నమోదైన 9 కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపూర్ గతంలో వేసిన పిటిషన్​ను సుప్రీం తిరస్కరించింది. కేసులను బదిలీ చేయాలని, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ తాజాగా మరో పిటిషన్ వేయగా.. దానిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ అన్ని కోర్టుల చుట్టూ తిరగాలని తాము కోరుకోవడం లేదని కామెంట్ చేసింది. నుపూర్ శర్మ విజ్ఞప్తిపై తమ స్పందన తెలియజేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అస్సాంకు నోటీసులు ఇచ్చింది. విచారణను ఆగస్టు 10కి వాయిదా వేస్తూ, అప్పటిలోగా సమాధానమివ్వాలంది. కాగా, ఈ నెల 1న ఇదే బెంచ్ నుపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోరు జారడం వల్లే దేశంలో అగ్గిరాజుకుందని, ఆందోళనలు చెలరేగాయని మండిపడింది. ఆ తర్వాత నుంచి నుపూర్ కు బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె తరఫు లాయర్ మనీందర్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కోర్టు.. ఆమె జీవితాన్ని, స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని కామెంట్​ చేసింది. 

నుపూర్ వీడియో చూసిండని కత్తితో పొడిచిన్రు.. 

బీహార్ లో దారుణం జరిగింది. నుపూర్ శర్మ వీడియో చూశాడని యువకుణ్ని కత్తితో పొడిచారు. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. సీతామర్హి జిల్లాలో అంకిత్ (23) అనే వ్యక్తి పాన్ షాప్ దగ్గర కూర్చొని తన ఫోన్ లో నుపూర్ వీడియో చూస్తుండగా, అక్కడున్న ముగ్గురు దాడి చేశారు. కత్తితో ఆరుసార్లు పొడిచారు. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.

నుపూర్​ను చంపాలని బార్డర్​ దాటొచ్చిన పాకిస్తాన్​ వ్యక్తి

నుపూర్ ను చంపేందుకని బార్డర్ దాటొచ్చిన పాకిస్తాన్ వ్యక్తిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అరెస్టు చేసింది. ఈ నెల 16న అతడు రాజస్థాన్​లోని అజ్మీర్​కు వెళ్తుండగా శ్రీగంగానగర్ జిల్లాలో అదుపులోకి తీసుకుంది. అతని దగ్గర పెద్ద కత్తులు, మత గ్రంథాలు స్వాధీనం చేసుకుంది. అతని పేరు రిజ్వాన్ అష్రాఫ్ అని, నుపూర్ ను చంపేందుకే తనను పంపించారని విచారణలో ఒప్పుకున్నాడని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.