
- ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ప్రయివేట్పాఠశాలలకే పరిమితమైన ప్రీ ప్రైమరీ క్లాసెస్‌ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ప్రీ ప్రైమరీ క్లాసెస్ లో భాగంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖాధికారులు ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు. మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60 గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రీ ప్రైమరీ క్లాసెస్ రన్ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను విద్యాశాఖాధికారులు రూపొందిస్తున్నారు.
రెండు జిల్లాల్లో 30 చొప్పున...
ఖమ్మం జిల్లాలో మొత్తం 1148 ప్రభుత్వ పాఠశాలల్లో 84 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 752 ప్రాథమిక పాఠశాలల్లో 31 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 1840 అంగన్వాడీ కేంద్రాల్లో 55,287 మంది ఆరేళ్ల లోపు చిన్నారులున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 796 గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఆయా స్కూళ్లలో 22,259 మంది స్టూడెంట్స్చదువుతున్నారు. 160 అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 8,631 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 2,060 అంగన్వాడీ సెంటర్లలో 31,268 చిన్నారులు చదువుకుంటున్నారు.
ప్రవేశాల సంఖ్య పెంచేలా ప్లాన్
గవర్నమెంట్ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే మాత్రమే అడ్మిషన్లున్నాయి. ప్రయివేట్ పాఠశాలల్లో నర్సరీ నుంచే అడ్మిషన్లు ఉండడంతో ఎక్కువ మంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్‌కు పంపేందుకు మొగ్గుతున్నారు. దీంతో గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరగని పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రీ ప్రైమరీ తరగతులతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతాయని గవర్నమెంట్భావిస్తోంది. అందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ క్లాసెస్‌ను ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు..
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి దశలో ఉమ్మడి జిల్లాలో 60 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసెస్‌ను స్టార్ట్ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లాల నుంచి ఆయా స్కూళ్ల ప్రపోజల్స్‌ను అడిగింది. ఇప్పటికే 30 ప్రాథమిక పాఠశాలల వివరాలతో కూడిన నివేదికలను మండలాల వారీగా ఎంఈఓలు జిల్లా విద్యాశాఖకు అందించారు. ప్రీ ప్రైమరీ క్లాసులతో గ్రామీణ ప్రాంతాల్లోని గవర్నమెంట్ స్కూళ్లలో ఎక్కువగా అడ్మిషన్స్ జరిగే అవకాశాలున్నాయని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు. కాగా, కొత్తగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ క్లాసులను డీఈడీతో పాటు టెట్ ఉత్తీర్ణులైన వారిని విద్యా వాలంటీర్లుగా నియమించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది.
స్కూళ్లలో ప్రవేశాలు పెరుగుతయ్..
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసుల నిర్వహణ మంచి పరిణామం. దీంతో స్కూళ్లలో ప్రవేశాలు పెరుగుతాయి. ఏఏ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ నిర్వహించాలో వివరాలను ప్రభుత్వం అడిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన స్కూళ్లలో మొదటి దశలో
ప్రీ ప్రైమరీ క్లాసుల నిర్వహణ ఉంటుంది.
ఎం. వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రికొత్తగూడెం.