చేర్యాలలో మార్కెట్​ నిర్మాణానికి చిక్కుముళ్లు

చేర్యాలలో మార్కెట్​ నిర్మాణానికి చిక్కుముళ్లు

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగడం లేదు. ఏడాది క్రితం ఫండ్స రిలీజ్​చేస్తున్నట్లు జీవో వచ్చినా మార్కెట్ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పట్టణ ప్రజలకు మార్కెట్ లేకపోవడంతో వారాంతపు సంతపైనే ఆధారపడుతున్నారు. ఈ సంత మెయిన్​రోడ్డుపై సాగుతుండటంతో ట్రాఫిక్​ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది మేలో చేర్యాల పట్టణ ప్రజల సౌలభ్యం కోసం రూ.3కోట్ల అంచనాతో  వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ శివారులోని మార్కెట్​యార్డు సమీపంలో రెండు ఎకరాలు కేటాయించారు. ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు మున్సిపాల్టీ నిధులు నుంచి మరో రూ.కోటి మార్కెట్ నిర్మాణానికి ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే నిర్మాణానికి సన్నాహాలు చేస్తుండగా  లీడర్ల జోక్యంతో  కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. 

టౌన్​కు 2కి.మీ దూరం

వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని ఏర్పాటు చేస్తున్న మార్కెట్ టౌన్​2కి.మీ దూరంలో ఉంది. దీనిపై పట్టణవాసుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తవుతుండగా పట్టణానికి మార్కెట్ దూరం అవుతుందన్న వాదన ముందుకు రావడంతో అధికారులు ప్రత్యామ్నాయ స్థలాన్ని అన్వేషించారు. ఇదే సమయంలో పట్టణంలోని వార సంత నిర్వహించే అంబేద్కర్ సెంటర్ లో  వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మించాలనే సూచన రావడంతో అధికారులు సర్వే చేసి 35 గుంటల స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. ఆరు నెలల కింద మార్కెట్ కు మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. ఇందుకు అక్కడున్న మున్సిపల్ ఆఫీసుతోపాటు మరో 48 దుకాణాలను కూల్చారు. ఇదే స్థలంలో ఉన్న వాటర్ ట్కాంక్​ను తొలగించాలని భావించినా ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. మొత్తం 48 దుకాణాలతో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి  ప్లాన్ ను సిద్ధం చేసినా  వివిధ కారణాలతో  కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టలేదు. ఇదే సందర్భంలో మెయిన్​రోడ్డు నుంచి ఆకునూరు వైపు వెళ్లే రోడ్డును మూసివేసే అవకాశముందనే ప్రచారంతో రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డును అదేవిధంగా కొనసాగించాలనే డిమాండ్​ ఉంది. ఇటీవల కాంట్రాక్టరు పనుల ప్రారంభానికి ప్రయత్నించడం తో ఆకునూరు రోడ్డు విషయంలో స్పష్టత 
వచ్చే వరకు పనులు నిర్వహించవద్దని అడ్డుకోవడంతో పాటు దళిత సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. దీంతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు మరోసారి ఆటంకం ఏర్పడింది.

త్వరలోనే మార్కెట్ పనులు ప్రారంభం

చేర్యాల వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరలోనే మొదలుపెడతాం. అన్ని డిమాండ్లను పరిశీలించాకే పనులు ప్రారంభిస్తాం. ఏడాది కింద మార్కెట్ మంజూరైనా పట్టణానికి దూరంగా ఉందనే కారణంతో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేశాం. కొన్ని కారణాల వల్ల పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా అన్నింటిని అధిగమించి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. 

- రాజేంద్ర కుమార్, కమిషనర్ , చేర్యాల మున్సిపాలిటీ