వన్డే వార్: నాలుగో నంబర్‌‌‌‌ లో ఎవరు..?

వన్డే వార్: నాలుగో నంబర్‌‌‌‌ లో ఎవరు..?

ఐపీఎల్‌‌ ముగిసింది. వరల్డ్‌‌కప్‌‌ సమీపిస్తోంది. ఐపీఎల్‌‌ అనంతరం కాస్త విరామం తీసుకున్న టీమిండియా ఆటగాళ్లు బుధవారమే ఇంగ్లండ్‌‌కు బయల్దేరనున్నారు. బ్యాట్స్‌‌మెన్‌‌, పేసర్లు, స్పిన్నర్లు, ఆల్‌‌రౌండర్లు, అద్భుతమైన కెప్టెన్‌‌, అసాధారణ కీపర్‌‌, మెరికల్లాంటి ఫీల్డర్లతో ఇండియా అత్యంత బలంగా కనిపిస్తోంది. కానీ, టోర్నీ దగ్గరయ్యే కొద్ది ఓ విషయంలో మాత్రం ఆందోళన పెరుగుతోంది.

జట్టులో అత్యంత కీలకమైన నాలుగో నంబర్‌‌లో ఎవరిని ఆడించాలన్న ప్రశ్నకు కెప్టెన్‌‌, కోచ్‌‌, టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్ నుంచి సూటిగా సమాధానం రావడం లేదు. మూడో ఓపెనర్‌‌గా సెలెక్ట్‌‌ చేసిన లోకేశ్‌‌ రాహుల్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ విజయ్‌‌ శంకర్‌‌ ఈ ప్లేస్‌‌ రేసులో ముందున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలో తెలియక టీమ్‌‌ కాస్త అయోమయంలో పడింది.

టాపార్డర్‌‌‌‌ విఫలమైనప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన నాలుగో నంబర్‌‌‌‌ వన్డేల్లో చాలా కీలకం. టాపార్డర్‌‌‌‌కు లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌కు మధ్య వారధిలాంటి ఈ ప్లేస్‌‌‌‌లో నమ్మదగిన ఆటగాడిని ఆడించకుంటే మొదటికే మోసం వస్తుంది. గతంలో యువరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌ ఈ స్థానంలో మెప్పించాడు. 2011 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో అద్భుతంగా ఆడి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, మూడో కప్పుకోసం ముందుకెళ్తున్న టీమిండియాకు ఈ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలో స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే.

మొగ్గు రాహుల్‌‌‌‌కే కానీ..

దాదాపు రెండేళ్ల కిందటే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌, కాంబినేషన్‌‌‌‌పై ఇండియా దృష్టిపెట్టింది. ఈ సమయంలో అన్ని ప్లేస్‌‌‌‌లకు ఒకటికి మించి ఆప్షన్లు లభించాయి. ప్రతి స్థానానికి ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు పోటీలో నిలిచారు. కానీ, బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో కీలకమైన నాలుగో నంబర్‌‌‌‌పై మాత్రం స్పష్టత కరువైంది. ధోనీ నుంచి దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ దాకా ఈ రెండేళ్ల కాలంలో దాదాపు పది మంది ప్లేయర్లను పరీక్షించినా ఫలితం లేకపోయింది. ఒక దశలో అంబటి రాయుడు ఈ ప్లేస్‌‌‌‌కు పర్ఫెక్ట్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ అని అందరూ ఫిక్సయ్యారు. కోచ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ సైతం నాలుగులో రాయుడే సరైనోడు అన్నారు.

కానీ, స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌‌‌‌లో ఫెయిలవడం, తర్వాత ఐపీఎల్‌‌‌‌లోనూ చెత్త పెర్ఫామెన్స్‌‌‌‌ చేయడంతో అతని ఆశలు అడియాశలయ్యాయి. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లోనే తెలుగు క్రికెటర్‌‌‌‌కు చోటు దక్కలేదు. ఇదే ప్లేస్‌‌‌‌ కోసం లోకేశ్‌‌‌‌ రాహుల్‌‌‌‌, విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌తో చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కానీ, సెలెక్టర్లు అనూహ్యంగా ఈ ఇద్దరినీ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు ఎంపిక చేశారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ ఐపీఎల్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. పంజాబ్‌‌‌‌ టీమ్‌‌‌‌ విఫలమైనా లోకేశ్‌‌‌‌ మాత్రం బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా సక్సెస్‌‌‌‌ అయ్యాడు.

ఓ సెంచరీ, ఆరు హాఫ్​ సెంచరీలతో 593 రన్స్‌‌‌‌తో లీగ్‌‌‌‌లో సెకండ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. దాంతో, వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో అతడిని కచ్చితంగా ఆడించాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, లోకేశ్‌‌‌‌ను ఎంచుకున్నది మూడో ఓపెనర్‌‌‌‌గా అన్నది గుర్తించాల్సిన విషయం. సెటిల్డ్‌‌‌‌ ఓపెనర్లు శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌, రోహిత్‌‌‌‌ శర్మలో ఒకరికి గాయం అయితేనో.. మరీ దారుణంగా విఫలమైతేనో తప్ప ఇన్నింగ్స్‌‌‌‌ ఆరంభించే అవకాశం అతడికి రాదు. అయితే, రాహుల్‌‌‌‌ ఏ స్థానంలో అయినా ఆడగలడు. పైగా, ఐపీఎల్‌‌‌‌తో భీకరమైన ఫామ్‌‌‌‌లోకి వచ్చాడు.

బ్యాటింగ్‌‌‌‌ స్టయిల్‌‌‌‌, టెక్నిక్‌‌‌‌, టైమింగ్‌‌‌‌ విషయంలో అతడి సామర్థ్యం అందరికీ తెలుసు. అందువల్ల రాహుల్‌‌‌‌ను తుది జట్టులో కచ్చితంగా ఉంచి, నాలుగో నంబర్‌‌‌‌లో ఆడిస్తే జట్టుకు ప్లస్‌‌‌‌ అవుతుందని పలువురు మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, టీ20 ఫామ్‌‌‌‌ను లెక్కలోకి తీసుకొని వన్డే టీమ్‌‌‌‌ను సెలెక్ట్‌‌‌‌ చేయకూడదన్నది మరికొందరి వాదన. పైగా, నాన్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌గా రాహుల్‌‌‌‌కు చెప్పుకోదగ్గ రికార్డు కూడా లేకపోవడం మైనస్‌‌‌‌ పాయింట్‌‌‌‌.

‘విజయం’సాధిస్తాడా?…

ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కావడం, ఫీల్డింగ్‌‌‌‌లో చురుగ్గా ఉండడం వల్లే విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌కు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చోటు దక్కింది. ‘త్రీ డైమెన్షనల్‌‌‌‌’ప్లేయర్‌‌‌‌ అంటూ.. స్పెషలిస్ట్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ అంబటి రాయుడును కాదని శంకర్‌‌‌‌కు సెలెక్షన్‌‌‌‌ కమిటీ జైకొట్టింది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ప్రకటించే సమయంలో చీఫ్‌‌‌‌ సెలక్టర్‌‌‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌‌‌ ఇచ్చిన వివరణ ప్రకారం… నాలుగో నంబర్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌ ప్లేయర్ శంకరే. కానీ, ఐపీఎల్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ తరఫున విజయ్‌‌‌‌ ఆట చూశాక ఎమ్మెస్కేతో పాటు టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత దారుణంగా విఫలమయ్యాడు శంకర్‌‌‌‌.

ఒకవైపు లోకేశ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ చెలరేగి ఆడుతుంటే విజయ్‌‌‌‌ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 14 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 240 పరుగులే చేయగలిగాడు. ఐదు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి ఎనిమిది ఓవర్లు బౌలింగ్‌‌‌‌ చేస్తే తీసింది ఒక్క వికెట్టే. ఒక దశలో పూర్తిస్థాయి బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా అవకాశాలు ఇచ్చినా శంకర్‌‌‌‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒకటి రెండు సార్లు మినహా వచ్చీరావడంతోనే గుడ్డిగా షాట్లు ఆడి వికెట్‌‌‌‌ పారేసుకున్నాడు. దాంతో, చాలా ఓపిగ్గా.. సమన్వయంతో ఆడాల్సిన నాలుగో నంబర్‌‌‌‌లో శంకర్‌‌‌‌ పనికొస్తాడా లేదా అన్న చర్చ మొదలైంది.

పైగా ఇంగ్లండ్‌‌‌‌లో ఆడిన అనుభవం అతనికి లేదు. అయితే, ఐపీఎల్‌‌‌‌కు ముందు న్యూజిలాండ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో విజయ్‌‌‌‌ రాణించాడు. టాపార్డర్‌‌‌‌ విఫలమైన ఐదో వన్డేలో అంబటి రాయుడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌‌‌‌ను గాడిలో పెట్టాడు. పొదుపుగా బౌలింగ్‌‌‌‌ చేసి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు. ఇప్పుడు గతాన్ని మర్చిపోయి పూర్తిగా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌పైనే దృష్టి పెట్టానని విజయ్‌‌‌‌ చెబుతున్నాడు. ఇంగ్లండ్‌‌‌‌లో తనను ఏ స్థానంలో ఆడించినా.. ఏ సవాల్‌‌‌‌ అప్పజెప్పినా టీమ్‌‌‌‌కు ఉపయోగపడతానని అంటున్నాడు. మరి, కోచ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌, టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అతడికి చాన్స్​ ఇస్తుందో లేదో చూడాలి.