డాక్టర్ కావాలనుకొని డెలివరీ గర్ల్‌గా మారిన యువతి

V6 Velugu Posted on Jun 10, 2021

కరోనాతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జాబులు పోయి, తినడానికి తిండిలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎంతోమంది ఏ పని చేయడానికైనా సిద్దమవుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతి తన కుటుంబం కోసం డెలివరీ గర్ల్‌గా మారింది. దాంతో జిల్లాలోనే మొట్టమొదటి డెలివరీ గర్ల్‌గా పేరొందింది.

కటక్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల బిష్ణుప్రియ శైలబాల ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి డ్రైవర్‌గా పనిచేసేవాడు. లాక్‌డౌన్ కారణంగా ఆయన జాబ్ పోయింది. దాంతో వారి కుటుంబం గడవడం చాలా కష్టమైంది. చివరికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దాంతో డాక్టర్ కావాలనుకున్న బిష్ణుప్రియ ఒక కఠోర నిర్ణయం తీసుకుంది. తన తండ్రి నిస్సహాయతను చూసి, కుటుంబం కోసం చదువును కొంతకాలం పక్కకు పెట్టి కుటుంబాన్ని పోషించడంలో తండ్రికి సహాయం చేయాలని నిర్ణయానికొచ్చింది. అందుకోసం జోమాటోలో డెలివరీ గర్ల్‌గా చేరాలనుకుంది. దానికోసం తన తండ్రి బైక్ నడపడం కూడా నేర్చుకుంది. జోమాటోలో ఇంటర్వ్యూకి వెళ్లి డెలివరీ ఏజెంట్‌గా సెలక్టయింది.

విధులలో భాగంగా బిష్ణుప్రియ రాత్రి పూట కూడా డెలివరీ చేయాల్సి వచ్చేది. రాత్రి సమయం, చీకట్లో చిన్న చిన్న వీధులలో వెళ్తూ.. అర్ధరాత్రి కూడా డ్రైవ్ చేయాల్సి వచ్చేదని.. అయినా ఇప్పటివరకు ఎవరి నుంచి ఎటువంటి అసభ్య ప్రవర్తనలు ఎదుర్కోలేదని బిష్ణుప్రియ చెబుతోంది. కుటుంబం కోసం ఆమె పడుతున్న కష్టం మరియు పనిపట్ల ఆమెకున్న అంకితభావం అందరితో ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి. డెలివరీ ఏజెంట్‌గా తన విధులు ప్రారంభించడానికి ముందు బిష్ణుప్రియ ఉదయం 6 గంటల నుంచి స్థానిక పిల్లలకు ట్యూషన్ కూడా చెబుతుంది. ఆ విధంగా వచ్చే డబ్బుతో తన కళాశాల ఫీజు చెల్లించి.. తన చదువును కొనసాగించొచ్చని ఆమె ఆశ. 

ఈ విషయంపై బిష్ణుప్రియ మాట్లాడుతూ.. ‘నేను సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి చదువుతున్నాను. నేను డాక్టర్ కావాలని, పేదలకు సేవ చేయాలనుకున్నాను. కానీ లాక్‌డౌన్ కారణంగా నా తండ్రి ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి నా జీవితం మలుపులు తిరిగింది. నా తండ్రికి మేం ముగ్గురు కూతుళ్లం. అందులో నేనే పెద్దదాన్ని. కాబట్టి నేను నా తండ్రికి సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ఏ పని అయినా చిన్నది కాదు. పైగా నేను ఉద్యోగం చేయడం వల్ల నా చెల్లెళ్ళ చదువు కంటిన్యూ చేయవచ్చు’ అని బిష్ణుప్రియ చెప్పింది.

బిష్ణుప్రియ తల్లి మాట్లాడుతూ.. ‘మాకు కొడుకు లేనందున.. బిష్ణుప్రియే మాకు కొడుకుగా మారింది. నా భర్త ఉద్యోగం పోవడంతో.. మా కుటుంబం కోసం బిష్ణుప్రియ ముందుకు వచ్చింది. ఆమె ఇప్పటికీ ఇంటి దగ్గర నుంచే తన చదువును కొనసాగిస్తోంది. జోమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ.. పిల్లలకు ట్యూషన్లు చెప్తూ కష్టపడుతుంది’ అని ఆమె అన్నారు. 

Tagged lockdown, Odisha, coronavirus, zomato, lockdown effect, delivery girl, Bishnupriya, inter girl turns into delivery girl, Cuttack.

Latest Videos

Subscribe Now

More News