కుటుంబంలో ఎలక్షన్ గ్యాప్ .. బరిలో సీనియర్ లీడర్ల కొడుకులు

కుటుంబంలో ఎలక్షన్ గ్యాప్ .. బరిలో సీనియర్ లీడర్ల కొడుకులు
  • ఒడిశా ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
  • కాంగ్రెస్ నేతల కొడుకులు.. బీజేపీ, బీజేడీ నుంచి పోటీ

భువనేశ్వర్: ఒడిశా లోక్​సభ ఎన్నికలు తండ్రి, కొడుకుల మధ్య గ్యాప్ పెంచుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముగ్గురు సీనియర్ లీడర్ల కొడుకులు ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు. అయితే, వీళ్లు తమ తండ్రి ఉన్న పార్టీల నుంచి కాకుండా ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో దిగారు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య దూరం  పెరుగుతోంది. ఒకే ఇంట్లో రెండు వేర్వేరు పార్టీల లీడర్లు ఉండటంతో ఎవరికి ఓటేస్తే.. ఎవరేం అనుకుంటారో అని ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. 

కాంగ్రెస్ నేత కొడుకు బీజేడీ నుంచి పోటీ..

కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రౌట్రే కొడుకు మన్మత్ రౌట్రే అధికార బీజేడీ పార్టీ నుంచి భువనేశ్వర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 80 ఏండ్ల సురేశ్ రౌట్రే.. ఆరు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఈసారి ఆయన పోటీ చేయట్లేదు. కాంగ్రెస్​లో ఉంటూ.. కొడుకు మన్మత్ (బీజేడీ) తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) సురేశ్​కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై సురేశ్ స్పందిస్తూ.. ‘‘నా కొడుకుకు ఓటేయాలని నేను ఎవరికి చెప్పలేదు. మీ కొడుకుకు ఓటు వేయాలా? అని కొందరు నన్ను అడుగుతున్నారు. దానికి నేను వేయండి అని మాత్రమే చెప్తున్నాను. నేను మన్మత్ తరఫున ప్రచారం చేయలేదు. ఏఐసీసీ పెద్దలు శిక్షించినా సరే.. నేను మాత్రం చనిపోయేదాకా కాంగ్రెస్​లోనే ఉంటాను’’ అని తేల్చి చెప్పారు. 

చింతామణి ద్యాన్ కొడుకులు చెరో పార్టీ నుంచి..

మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత చింతామణి ద్యాన్(84) ఇంట్లో పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉన్నది. ఈయనకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు మనోరంజన్ ద్యాన్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ నుంచి, పెద్ద కొడుకు రవీంద్రనాథ్ ద్యాన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. దీంతో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని పరిస్థితిలో తండ్రి చింతామణి ద్యాన్ ఉన్నారు. ద్యాన్ చికిటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడు సార్లు, ఇండిపెండెంట్​గా (1980 నుంచి 1995) రెండు సార్లు గెలిచారు. మనోరంజన్ ద్యాన్ 2014లో కాంగ్రెస్, 2019లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. రవీంద్రనాథ్ ద్యాన్ ఫస్ట్ టైమ్ ఎన్నికల బరిలో నిలబడ్డారు.

తండ్రి బీజేపీ.. కొడుకేమో బీజేడీ

కేంద్రపారా జిల్లాకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి బిజోయ్ మహాపాత్రది ఇదే పరిస్థితి. బిజోయ్ కొడుకు అర్బింద మహాపాత్ర బీజేడీ తరఫున పట్కుర అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో నిలబడ్డారు. బిజోయ్ ఇప్పుడు బీజేపీలో యాక్టివ్​గా లేరు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పట్కుర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దశాబ్దాలుగా బీజేడీ విధానాలను వ్యతిరేకించి న బిజోయ్.. ఈసారి మాత్రం కొడుకు కోసం బీజేడీ తరఫున ప్రచారం చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ కిశోర్ మండిపడ్తున్నారు.