
కొల్లాపూర్, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో మత్స్య మాఫియా చేతిలో వెట్టి చాకిరికి గురవుతున్న కార్మికులకు డీఎల్ఎస్ఏ సంస్థ చొరవతో విముక్తి లభించింది. కానీ వారిని సొంత రాష్ర్టానికి పంపే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మత్స్య మాఫియాతో సంబంధం ఉన్న కొందరు మధ్యవర్తులు ఆంధ్ర రాష్ట్రంలోని తణుకులో పని ఉందని నమ్మబలికారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన 14 మంది కార్మికులను తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ డివిజన్ పరిధిలోని అమరగిరి అటవీ ప్రాంతంలో ఉండే కృష్ణానది పరీవాహక ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ రాత్రి వేళలో కార్మికులతో వెట్టిచాకిరి చేయించారు. కార్మికులు వారి కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడితే అసలు విషయం బయట పడుతుందని భావించిన మత్స్య మాఫియా వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు లాక్కున్నారు. ప్రశ్నించిన వారిని చితకబాదారు.
వారి దెబ్బలను తట్టుకోలేక ఒక కార్మికుడు తప్పించుకున్నాడు. దారి తెలియక అటవీ ప్రాంతంలో అతడు తిరుగుతుండగా పశువుల కాపరి గమనించి ఎన్ఏఎస్సీ సంస్థ సభ్యులకు సమాచారం అందించాడు. సంస్థ సభ్యుడు వలిగొండ విజయరాజు వెంటనే కార్మికుడి వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. అనంతరం జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ న్యాయమూర్తికి విజయరాజు ఫిర్యాదు చేశాడు.
న్యాయమూర్తి ఆదేశాలతో శుక్రవారం పోలీసులు, ఎన్ఏఎస్సీ సభ్యులు అమరగిరిలో దాడులు చేసి బందీలుగా ఉన్న ఒడిశా కార్మికులను మత్స్యమాఫియా చెర నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయపై ఎస్ఐ హృషికేష్ ను వివరణ కోరగా, బాధిత కార్మికులను రెవెన్యూ అధికారులకు అప్పగించామని తెలిపారు.