
- సర్వీస్ చార్జీలు కట్టలేదని స్టార్టర్ డబ్బాలు ఎత్తుకెళ్లిన్రు
- విద్యుత్ ఆఫీసర్ల తీరుపై రైతుల ఆగ్రహం
సంగారెడ్డి/హత్నూర, వెలుగు: వ్యవసాయ బోరుబావులకు సంబంధించిన సర్వీస్ చార్జీలు కట్టలేదని కరెంటోళ్లు స్టార్టర్ డబ్బాలను ఎత్తుకెళ్లారు. ఆరు గ్రామాల్లోని 85 మంది రైతుల పొలాలకు కరెంటు సప్లై ఆపేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం హత్నూర, సికింద్లాపూర్, బోర్పట్ల, కాసాల, నాగులదేవులపల్లి, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో మంగళ, బుధవారాల్లో విద్యుత్ అధికారులు దాడులు చేశారు. పలువురు రైతుల బోరుబావుల స్టార్టర్లను తీసుకెళ్లారు. హత్నూర మండలంలో రూ.1.45 కోట్ల సర్వీస్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కో రైతు బాకీ దాదాపు రూ.2 నుంచి రూ.8 వేల వరకు ఉంది. వీటికి సంబంధించి విద్యుత్ అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా మూడు రోజుల క్రితం గ్రామాల్లో చాటింపు వేయించారు. ఇదిలా ఉంటే విద్యుత్ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని టీఆర్ఎస్ లీడర్లు చెబుతుంటే ఫీల్డ్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సర్వీస్ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు విద్యుత్ ఫోర్ మెన్ లక్ష్మయ్య చెప్పారు. ఒక్కో రైతు ఏడెనిమిదేండ్ల బిల్లులు కట్టాల్సి ఉందన్నారు. స్టార్టర్ డబ్బాలు తీసుకురావడంతో ఇప్పటికే కొందరు బిల్లులు కట్టారని చెప్పారు.