వనపర్తి జిల్లాలో ఆఫీసర్ల ఇష్టారాజ్యం..

వనపర్తి జిల్లాలో ఆఫీసర్ల ఇష్టారాజ్యం..

వనపర్తి, వెలుగు:  జిల్లాల్లో అధికారులు అవినీతిలో ముందుంటూ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ  ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కీలక శాఖల్లోని పెద్దాఫీసర్లతో ఉన్న పరిచయంతో పలుశాఖల అధికారులు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.  జిల్లాలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయని, హత్యలు, చోరీలు జరుగుతున్నా.. పోలీసులు నిందితులను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.  తమ సమస్యలు పరిష్కరిస్తలేరని క్షేత్రస్థాయి అధికారులపై కలెక్టర్, ఎస్పీ లకు  కంప్లైంట్​ చేసినా.. ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 జిల్లాలో 11 ‘మీసేవా’ కేంద్రాల శాంక్షన్​లో అవినీతి జరిగిందని బాధితులు జిల్లా అధికారులకు కంప్లైంట్​ చేసినా.. వారు పట్టించుకోలేదు. దీంతో  బాధితులు ప్రిన్సిపల్ సెక్రటరీ కి, ఈఎస్ డీ మీ సేవా కమిషనర్​ఆఫీస్​కు  నేరుగా ఫిర్యాదు చేయడంతో  సదరు ‘మీసేవా’ కేంద్రాలు రద్దయ్యాయి. బాధ్యుడైన ఈడీఎం వినోద్ కుమార్ ను  జాబ్​నుంచి తొలగించారు. ఇంత జరిగినా జిల్లా అధికారులు తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్​పంపారు. దీంతో జిల్లా ముఖ్య అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించి  రెవెన్యూ ఆఫీసర్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. పట్టాదారులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోకుండానే వారి భూమిని రద్దు చేసి మరొకరికి కట్టబెడుతున్నారని బాధితులు వాపోతున్నారు.  తాజాగా పాన్ గల్ మండలం మల్లాయిపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన పట్టా భూమిని అధికారులు ఇతరుల పేర్లపై మార్చారు.  ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కోర్టు కు వెళ్లాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని  పలువురు బాధితులు వాపోతున్నారు.  మరో పక్క జిల్లా ఎక్సైజ్ ఆఫీస్​సిబ్బంది మధ్య గొడవలు రచ్చకెక్కాయి.  ఎక్సైజ్ ఈఎస్  తమను వేధిస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది ఆందోళన చేపట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ తనపై ఎవరికైనా కంప్లైంట్​చేసుకోవచ్చని నిర్లక్ష్యంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. వడ్ల కొనుగోళ్ల వ్యవహారం, రేషన్ బియ్యం పంపిణీ లాంటి కీలక అంశాలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. 

మంత్రి సీరియస్​..

వడ్ల కొనుగోళ్లలో జిల్లా అధికారులు ప్రత్యక్ష పాత్ర పోషిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనకుండానే మిల్లర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ బియ్యం నేరుగా స్టాక్ పాయింట్ నుంచే రైస్  మిల్లులకు తరలిస్తున్నారని  ఫిర్యాదులు వచ్చినా.. దీని వెనక పెద్దలున్నారంటూ కొందరు అధికారులు పరోక్షంగా ఓ మంత్రిని అప్రతిష్టపాలు చేస్తున్నారని చెప్తున్నారు. జిల్లాలోని ఓ కీలక అధికారి భూదందా చేస్తూ  మంత్రి పేరు వాడుకుంటున్నట్లు తెలియడంతో ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి సదరు ఆఫీసర్​కు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.  కలెక్టర్  ఆఫీస్​ధరణి సెక్షన్ లో పనిచేసే ఓ అధికారి తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ కు కూడా తప్పుడు సమాచారం ఇస్తూ లాండ్ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేదలకు పోడు భూములు ఇచ్చే అంశంలోనూ కలెక్టరేట్​లో డబ్బులు చేతులు మారుతున్నాయని విమర్శలు ఉన్నాయి. 

 హత్య, చోరీలు జరిగినా.. పట్టించుకుంటలే..

జిల్లా కేంద్రం కుమ్మరి వీధి లో ఓ వృద్ద మహిళను పట్టపగలే దుండగలు దారుణంగా హత్య చేశారు.  ఇది జరిగి 10 రోజులు కావస్తున్నా నిందితులను  పోలీసులు నేటి వరకూ పట్టుకోలేదు. అంతకు ముందు ఓ ఏటీఎం లో చోరీ జరిగి..రూ. 5 లక్షల  నగదు ను దొంగలు ఎత్తుకెళ్లినా సదరు కేసును పోలీసులు ఛేదించలేదు. మరోపక్క  ఇసుక, ఎర్రమట్టి, రేషన్  బియ్యాన్ని దర్జాగా తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కొత్తకోట ఎస్సై నాగశేఖర్ రెడ్డి రైతులు వడ్లను పక్క రాష్ట్రంలో అమ్మేందుకు తీసుకెళ్తుండగా పట్టుకొని లారీని 2 రోజులు పీఎస్​లో పెట్టడం వివాదాస్పదమైంది. రైతులు పండించిన  వడ్లను ఎక్కడైనా అమ్ముకునే రూల్ ఉండడంతో రైతులు సివిల్ సప్లై ఆఫీసర్లను కలిసి లెటర్ ఇవ్వడంతో ఎస్సై అప్పుడు లారీ వదిలేశారు. ఎస్సై పై ఎస్పీ కి కంప్లైంట్​చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. 

పట్టా మార్చేందుకు యత్నం

 పానగల్ మండలం మల్లాయిపల్లిలో మాకు పట్టా భూమి ఉంది.  మా పక్క భూమి వారితో  భూ తగాదా నడుస్తోంది. ఈ విషయంలో మాకు నోటీస్​ఇవ్వకుండానే కలెక్టరేట్ లోని ఓ ముఖ్య అధికారి పట్టా మార్చేందుకు యత్నించారు. మేము కలెక్టర్​కు కంప్లైంట్​చేశాం. అప్పటికే వారి వైపు ఫైల్​సిద్ధం చేయడంతో  మేము రెవెన్యూ ట్రిబ్యునల్​లో అప్పీల్​ చేసుకోవాల్సి వచ్చింది.  

– సీతారామరావు, మల్లాయిపల్లి, పానగల్

 వడ్ల లారీని రెండు రోజులు స్టేషన్ల పెట్టిన్రు..

ఈ నెల 17న  మార్కెట్​కు వడ్లు తీసుకెళ్తుండగా మమ్మల్ని కొత్తకోట పోలీసులు అడ్డుకున్నారు. 2 రోజులు లారీని పీఎస్​లో ఉంచారు. సివిల్​సప్లై ఆఫీసర్ల నుంచి లెటర్​తెచ్చినంక వదిలిపెట్టారు. ఇసుక, మట్టి, రేషన్ బియ్యం తరలించే అక్రమార్కులను పట్టుకోని పోలీసులు రైతులను పట్టుకోవడం దుర్మార్గం.

– సత్యన్న, రైతు, కొన్నూరు