అటవీ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలపై దృష్టి పెట్టని ఆఫీసర్లు

అటవీ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలపై దృష్టి పెట్టని ఆఫీసర్లు

భద్రాచలం,వెలుగు: గిరిజన సహకార సంస్థ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన బజార్ల ద్వారా నిత్యావసర సరుకులు, అటవీ ఉత్పత్తులు అందించాలన్న విషయాన్ని మరిచారు. జీసీసీ డివిజన్​ కేంద్రానికి కూతవేటు దూరంలోని భద్రాచలంలోని గిరిజన బజారు కొన్ని నెలలుగా సరుకులు లేక వెలవెలబోతోంది. మొక్కుబడిగా గిరిజన బజారు తెరుస్తున్నారే తప్పఉత్పత్తులను అందుబాటులో ఉంచడం లేదు. ఇప్పటికే భద్రాచలం డివిజన్​లోని గిరిజన సూపర్​బజార్లు మూతపడ్డాయి. భద్రాచలంలో ఉన్న ఏకైక గిరిజన బజారును కూడా మూసివేతకు దగ్గరగా ఉన్నట్టు 
కనిపిస్తోంది.

కనిపించని అటవీ ఉత్పత్తులు..

భద్రాచలం వచ్చే పర్యాటకులకు, భక్తులకు అటవీ ఉత్పత్తులే ముందుగా గుర్తుకు వస్తాయి. తేనె, ఉసిరి, కుంకుడుకాయలు, చింతపండు, జీసీసీ మాత్రమే తయారు చేసే అలోవీరా సబ్బులు, పెసలు, కందులు, మినుములు, మారేడు చెక్క రసం, కరక్కాయలు, అరకు కాఫీ పొడి ఇలా గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు దొరికేవి. సూపర్​ బజార్లతో పాటు జీసీసీ సేల్స్ డిపోల్లో కూడా నిత్యావసర సరుకులు గిరిజనులకు తక్కువ ధరకే అమ్ముతారు. అయితే ప్రస్తుతం ఇవేమి కన్పించడం లేదు. ప్రధానంగా తేనె దొరకడం లేదు. భద్రాచలం ప్రాంతంలో గిరిజనుల నుంచి సేకరించిన తేనెను ఏపీకి అమ్ముతున్న జీసీసీ ఆఫీసర్లు మన మార్కెట్​లో అందుబాటులో ఉంచడం లేదు. రెండు నెలలుగా భద్రాచలం డివిజన్​లో తేనె దొరకడం లేదు. రాష్ట్రంలోని అన్ని జీసీసీలకు నిర్మల్​ నుంచి తేనె వస్తుంది. ఇందుకు ఆయా డివిజన్​ ఆఫీసుల నుంచి ఇండెంట్​ పంపించాలి.

సేల్స్ తగ్గినయని చెబుతున్రు..

భద్రాచలంతో పాటు పాల్వంచ, మణుగూరు, ఇల్లందు బ్రాంచ్​లలో గిరిజన సూపర్​ బజార్లు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మార్పీ రేటు కంటే తక్కువకే నిత్యావసర సరుకులు లభిస్తాయి. అటవీ ఉత్పత్తులు కూడా దొరుకుతాయి. కానీ ఈ సూపర్​ బజార్లలో సేల్స్ తక్కువగా ఉన్నాయనే కారణంతో వాటిని మూసేస్తున్నారు. ఇప్పటికే పాల్వంచ, మణుగూరు, ఇల్లందు బజార్లను మూసేశారు. సకాలంలో సరుకులు, అటవీ ఉత్పత్తులను అందుబాటులో ఉంచకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే జీసీసీ సూపర్​ బజార్ల పరిస్థితి ఇలా మారిందని జిల్లా ప్రజలు అంటున్నారు. 

అటవీ ఉత్పత్తులు కొంటలేరు..

జీసీసీ ఆఫీసర్లు అటవీ ఉత్పత్తులు కొనడమే మానేశారు. ఇతర వ్యాపారాలపై పడ్డారు. మారుమూల ప్రాంతాల్లో డిపోల ద్వారా అటవీ ఉత్పత్తులు కొని, వాటిని ఆయా సూపర్​బజార్ల ద్వారా అమ్మాలి. అప్పుడే గిరిజనులకు కూడా ఆదాయం వస్తుంది. భద్రాచలం ప్రాంతంలో దొరికే తేనె సూపర్​బజార్లలో దొరక్కపోవడం దారుణం మూసేసిన సూపర్​బజార్లను తెరవాలి.  - సోందివీరయ్య, గోండ్వాన సంక్షేమ పరిషత్​ వ్యవస్థాపక​ అధ్యక్షుడు

బలోపేతం చేస్తాం

జీసీసీ సూపర్​బజార్లను బలోపేతం చేస్తాం. అటవీ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు తెచ్చి వాటిని అందుబాటులో ఉంచుతాం. సూపర్​ బజార్​ల ఏర్పాటు, మూసేసిన వాటిని తెరిపించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. - విజయ్​కుమార్, డీఎం, జీసీసీ, భద్రాచలం