అవినీతి తేల్చారు.. రికవరీ మరిచారు

అవినీతి తేల్చారు.. రికవరీ మరిచారు
  • అవినీతి తేల్చారు.. రికవరీ మరిచారు
  •  రేకుర్తి పంచాయతీ అక్రమాలపై చర్యలు తీసుకోని అధికారులు
  • ఎంబీలు చేయకుండనే బిల్లులు అక్రమాలు జరిగినా చర్యలు శూన్యం


కరీంనగర్, వెలుగు:  కార్పొరేషన్ లో విలీనం అయిన రేకుర్తి గ్రామపంచాయతీలో మూడేండ్ల కాలంలోనే కోటి కి పైగా నిధుల గందరగోళంపై చర్యలు కనబడటం లేదు. నిధుల గోల్ మాల్​పై 2017 లోనే ఎంక్వైరీ రిపోర్టు వచ్చినా సొమ్ము రికవరీ చేయడం  లేదు. అప్పటి పాలకవర్గంలో పనులు చేయకుండానే జీపీ నిధులను కాజేశారు. జనరల్ ఫండ్, ఆర్థిక సంఘం నిధుల నుంచి అప్పటి అధికారులు, పాలకవర్గ పెద్దలు కలిసి ఎంబీలు రికార్డు చేయకుండానే పేమెంట్లు , పనులు చేయకుండానే అడ్వాన్స్ గా బిల్లులు, ఫర్మ్ పేర్ల  మీద కాకుండా వ్యక్తుల మీద చెల్లించారు. 

అన్ని కాగితాల మీదనే

రేకుర్తి గ్రామపంచాయతీలో ఆగస్టు 2013 నుంచి మార్చి 2016 వరకు గ్రామంలో ఎక్కడా సరిగా పనులు చేయకుండానే కోటి వరకు బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో కరెంటు స్థంభాలు, వీధి లైట్లు, దాని సామగ్రీ, మోటార్లు, పైపు లైన్లు, వైర్లు రిపేర్లు, పారిశుధ్య పనులు చేయకుండానే రికార్డులు లేకుండానే నిధులు డ్రా చేసుకున్నారు. నిధులు పక్కదారి పై 2017 లో విచారణ జరిగి, అన్నీ తప్పుడు లెక్కలే అని నివేదికలో తేలింది. 

పత్తాలేని పనులు.. 

ఆర్ సీసీ పైపులు వేశామని, ఇంటర్నల్ రోడ్లపై మొరం పోసినమని, గ్రేవ్ యార్డులలో జంగిల్ కటింగ్ చేసినట్లు బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో గ్రావెలింగ్ చేసిన పనులకు రూ. 7 లక్షలు అయినట్లు చూపారు. దీని పేమెంట్లు 2013 సెప్టెంబర్ లోనే తీసుకున్నారు. కానీ జనవరి 2014 లో చెక్ మెజర్ మెంట్ జరిగింది. అంటే పనులు చేయకముందే బిల్లులు కాజేసి తరవాత పనులు పూర్తి అయినట్టు రికార్డులు రాశారు.  ఎలక్ర్టికల్ సామగ్రి, వీధి దీపాలకు బిల్లులు లేకుండానే సుమారు రూ. 22 లక్షలే చెల్లించినట్టు రికార్డు చేశారు.  గ్రామంలో కుక్కులకు ఇంజక్షన్లు వేశామని రూ. 84వేలు చెల్లించారు. కానీ స్పందన ప్రజా ఆరోగ్య సంక్షేమ సంఘం వారికి ఇవ్వాలని చెప్పినా.. వారికి ముట్టినట్లుగా సంతకాలు లేకపోవడం పలు అనుమానాలుకు తావిస్తోంది.  గ్రామంలో బోర్ వెల్ సామగ్రి కోసం విచ్చలవిడిగా డబ్బులు చెల్లింపులు చేశారు. కానీ వాటికి సంబంధించిన ఎంబీలు రికార్డు కాలేదు. ఇలా ప్రతి దాంట్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి.  చాలా చోట్ల ఈ పనులపై విచారణకు వెళ్లిన క్వాలిటీ కంట్రోల్ అధికారులకు రోడ్లు ఎక్కడ వేశారు? మొరం ఎక్కడ పోశారనే వివరాలే దొరకడం లేదు. 

చర్యలేవి..? 

రేకుర్తి గ్రామ పంచాయతీలో ఎక్కువగా పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ ఫండ్స్​ గోల్​మాల్​ అయ్యాయి. అవినీతి జరిగిందని విచారణ నివేదికలు స్పష్టం చేశాయి. నిధుల గోల్ మాల్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంతో ఈ విభాగాలపై స్థానికుడు దుర్గం శ్రీనివాస్​ ఇటీవల లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో పీఆర్ అధికారులపై జడ్జీ ఫైర్ అయినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిధులు గోల్ మాల్ చేసిన వారి నుంచి ప్రజా ధనాన్ని రికవరీ చేయాలనే డిమాండ్​ కొనసాగుతుంది.