మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 144 సెక్షన్

మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 144 సెక్షన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు. బ్యారేజీని కేంద్ర జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. బ్యారేజీ 20వ పిల్లర్ సింక్ కావడంతో గేట్ విరిగిపోయింది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ కి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో 57 గేట్లు ఎత్తి,  45 వేల 260 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. బ్యారేజ్ కి ఇన్ ఫ్లోన్ 12,240 క్యూసెక్కులు కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంపై విచారణ చేస్తున్నామన్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ప్రస్తుతం బ్యారేజీ ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉండడంతో పునరుద్ధరణ బాధ్యత కూడా ఆ కంపెనీదేనని స్పష్టం చేశారు.

మేడిగడ్డ బ్యారేజీ 6 వ బ్లాక్ పరిధిలోని 20 వ పిల్లర్ ఫీట్ వరకు కుంగిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ENC నల్లా వెంకటేశ్వర్లు. బ్యారేజీ దగ్గర శనివారం సాయంత్రం పెద్ద శబ్దం రావడంతో వెంటనే అధికారులు అప్రమత్తమై పరిశీలించారని చెప్పారు. బ్యారేజీలో నీరు ఉన్నందున ఇప్పుడేం చెప్పలేనన్నారు వెంకటేశ్వర్లు. నీళ్లు తగ్గిన తర్వాత ప్రమాదం విచారణ జరిపి, పూర్తి వివరాలు చెప్తామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు 20 వ పిల్లర్ సమీప గేట్లను మూసి మిగతా గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశామన్నారు ENC వెంకటేశ్వర్లు. 

 కాళేశ్వరం ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఐదేండ్లల్లో ఎన్ని TMC లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల సంపదను దోచుకునేందుకే ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై...కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు.