V6 News

మహబూబాబాద్ మార్కెట్ గేటుకు తాళం..భారీగా నిలిచిన మక్క లోడ్ ట్రాక్టర్లు

మహబూబాబాద్ మార్కెట్ గేటుకు తాళం..భారీగా  నిలిచిన మక్క లోడ్ ట్రాక్టర్లు

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ గేటుకు అధికారులు తాళం వేయడంతో మొక్కజొన్న లోడ్‌తో వచ్చిన వందలాది ట్రాక్టర్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. గేటు తాళం తీసి తమను లోపలికి అనుమతించాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా మా మక్కలను ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలో రోడ్డు పక్కన మొక్కజొన్న రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ లోపల కొనుగోళ్లు జరగకపోవడంతో బయట ప్రైవేటు వ్యాపారస్తుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మార్కెట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే.. ప్రైవేటు వ్యాపారస్తులు మాత్రం స్వయంగా రోడ్డుపై ఉన్న ట్రాక్టర్ల వద్దకే వెళ్లి, తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. మద్దతు ధర దక్కక పంటను నిల్వ చేసుకోలేక రైతులు గత్యంతరం లేని స్థితిలో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది.

ఇంత జరుగుతున్నా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు మార్కెట్ లోపల కొనుగోళ్లు ఎందుకు ఆగిపోయాయి? రైతులకు సమాధానం చెప్పే బాధ్యత ఎవరిది? ప్రైవేటు వ్యాపారుల దందాలో అధికారుల హస్తం ఉందా? అని రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, మార్కెట్ గేట్లు తెరిపించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.