లిక్కర్ వ్యాట్ లెక్కలు తేలుస్తున్నరు

 లిక్కర్ వ్యాట్ లెక్కలు తేలుస్తున్నరు
  •     ఈ‑వే బిల్లులు చూపించాల్సిందే అంటూ ఆదేశాలు
  •     సర్క్యులర్​ జారీ చేసిన కమిషనర్ 
  •     మినహాయింపు ఉందంటున్న ఎక్సైజ్ శాఖ
  •     రెండు శాఖల మధ్య కోల్డ్ వార్
  •     రెండు కంపెనీలకు ఎక్సైజ్ డ్యూటీ మినహాయించిన గత సర్కార్!!


ప్రభుత్వానికి చెల్లించే లిక్కర్ వ్యాట్ విషయంలో అవినీతి జరుగుతున్నట్టు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి వల్ల రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల గండిపడ్తున్నదని చెప్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి చెల్లించే లిక్కర్ వ్యాట్ విషయంలో అవినీతి జరుగుతున్నట్టు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయల గండిపడ్తున్నదని చెప్తున్నారు. వ్యాట్ సంగతి తేల్చేందుకు మద్యం డిపోల నుంచి బయలుదేరిన వెహికల్స్​ను అడ్డుకుని ఈ–వే బిల్లులు చూపించాల్సిందిగా కోరుతున్నారు. 

బిల్లులు లేకపోవడంతో వెహికల్స్​ను సీజ్ చేస్తున్నారు. వ్యాట్ ఎగ్గొట్టడం లేదని అటు ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ వాదిస్తున్నది. దీంతో అటు ఎక్సైజ్, ఇటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ మధ్య గత 15 రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్నది. దీనికితోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడీబీ, ఫెర్నాడ్ సప్లయర్స్​కు ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిసింది. ఈ రెండు సప్లయర్స్​కే తాజాగా పెండింగ్ బకాయిల కింద వంద కోట్లు చెల్లించడంపై కూడా మిగిలిన సప్లయర్స్ మండిపడుతున్నారు.

ఈ–వే బిల్లులు చూపించాల్సిందే..

కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టి.శ్రీదేవి ఇటీవల జారీ చేసిన సర్క్యులర్​పై ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ అధికారులు మండిపడుతున్నారు. వ్యాట్ పరిధిలోకి వచ్చే అన్నింటికి ఈ-–వే బిల్లు చూపించాలంటూ ఆదేశించారు. ఈ–వే బిల్లులు చూపించాలనే రూల్ తమకు లేదని ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ అధికారులు అంటున్నారు. ఇలా వెహికల్స్ ఆపడంతో మద్యం సరఫరా నిలిచిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్​కు మద్యం సరఫరా చేయలేకపోతున్నామని, సప్లై చైన్ దెబ్బతింటున్నదని, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ వైఖరిపై మండిపడుతున్నారు. మద్యం అమ్మకాలు పడిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చేరడం లేదని అంటున్నారు. 

వ్యాట్ ఎగ్గొట్టినట్టు తేలితే చర్యలు తప్పవు

ఇటీవల కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ అధికారులు టానిక్ ఎలైట్ వైన్​షాప్​లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యాట్ ఎగ్గొట్టే విధంగా వ్యవహారం నడుపుతున్నట్టు గుర్తించారు. లిక్కర్ జీఎస్టీ పరిధిలోకి రాకున్నా.. జీఎస్టీ నంబర్​తో బిల్లులు ఇస్తున్నట్టు గుర్తించారు. అవినీతి జరుగుతున్నట్టు నిర్ధారించారు. లిక్కర్ వ్యాట్ ఎంత కడుతున్నారనే దానిపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యాట్ ఎగ్గొడ్తున్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ మండిపడ్తున్నది. దీంతో రెండు డిపార్ట్​మెంట్​ల మధ్య ఈ–వే బిల్లుల విషయమై వార్ నడుస్తున్నది.

2 కంపెనీలకు వంద కోట్లు రిలీజ్

మద్యం సప్లయర్స్​కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దాదాపు రూ.3వేల కోట్లు సప్లయర్స్​కు ఇవ్వాల్సి ఉంది. కేవలం రెండు కంపెనీలకు మాత్రమే బకాయిలు రిలీజ్ అయ్యాయి. ఏడీబీ, ఫెర్నాడ్ కు దాదాపు వంద కోట్ల మేర డబ్బులు చెల్లించారు. దీనిపై మిగిలిన సప్లయర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెంటనే తమకూ పెండింగ్ అమౌంట్ సెటిల్ చేయాలని సర్కార్​పై ఒత్తిడి పెంచుతున్నారు. దీనికితోడు ఈ రెండు కంపెనీలకు గత బీఆర్ఎస్ సర్కార్ ఎక్సైజ్ డ్యూటీని కూడా మినహాయించిందని తెలిసింది. దీంతో ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా పోతున్నది. దీనిపై కూడా మిగిలిన సప్లయర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అందరికీ యూనిఫాంగా ఒకటే పద్ధతి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.