పాతదాన్నే పూర్తి చేయలే .. కొత్త ప్లాంట్​కు ప్రపోజల్స్​!

పాతదాన్నే పూర్తి చేయలే .. కొత్త ప్లాంట్​కు ప్రపోజల్స్​!
  • తడి చెత్తను ప్రాసెస్​ చేసి ఎలక్ట్రిసిటీ జనరేషన్​ కు ప్లాన్
  • గ్రేటర్​ వరంగల్​ కార్పొరేషన్​లో ఆఫీసర్ల నిర్వాకం
  • గతంలో బాలసముద్రంలో బయో గ్యాస్​-విద్యుదుత్పత్తి యూనిట్ ఏర్పాటు
  • ఆఫీసర్ల నిర్లక్ష్యంతో మూలకుపడిన ప్లాంట్
  • మడికొండలో కొత్త ప్లాంట్​ ఏర్పాటుకు కసరత్తు

హనుమకొండ, వెలుగు: నగరంలో వెలువడుతున్న చెత్తలో కొంత భాగాన్ని ట్రీట్​మెంట్ చేసేందుకు గతంలోనే స్వచ్ఛ భారత్​ మిషన్​ లో భాగంగా  బాలసముద్రంలో బయో మిథనేషన్​ కం పవర్​ జనరేషన్​ ప్లాంట్​ ను ఏర్పాటు చేశారు. పనులన్నీ దాదాపు పూర్తి చేసినా అది వినియోగంలోకి రాలేదు. ఓ వైపు ఈ ప్లాంట్​ ను  వినియోగంలోకి తేకముందే..   అధికారులు మడికొండ డంప్​ యార్డులో కొత్తగా మరో విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్​ కు ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

సమస్యగా మారుతున్న చెత్త

గ్రేటర్​ వరంగల్ లో నిత్యం వెలువడుతున్న చెత్త నగరానికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే మడికొండ శివారులోని డంప్​ యార్డు పూర్తిగా నిండిపోగా.. అక్కడ చేపట్టిన బయో మైనింగ్​ నత్తనడకన సాగుతున్నది. దీంతో రోజువారీగా పోగవుతున్న చెత్తను ట్రీట్​మెంట్ చేయడం అధికారులకు సవాల్​ గా మారింది. ప్లాంట్​  ఉపయోగంలోకి వస్తే విద్యుత్తు ఉత్పత్తి జరగడంతో పాటు డంప్​ యార్డుకు వెళ్లే చెత్త  ఎంతో కొంత తగ్గే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

డంప్​ యార్డు నిండిపోయి ఇబ్బందులు

వరంగల్ నగరంలో దాదాపు 2.25 లక్షల ఇండ్లు ఉండగా.. 11 లక్షల వరకు జనాభా నివసిస్తోంది. ఆయా ఇండ్ల నుంచి నిత్యం 350 నుంచి 400 మెట్రిక్​ టన్నుల తడి, పొడి చెత్త వెలువడుతోంది. దాన్నంతా మడికొండ-రాంపూర్​ గ్రామాల శివారులో దాదాపు 37 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డంప్​ యార్డుకు తరలిస్తున్నారు. కానీ వస్తున్న చెత్తకు తగ్గట్టుగా వేస్ట్​ మేనేజ్​మెంట్ లేకపోవడంతో దాదాపు ఐదారు లక్షల టన్నుల వ్యర్థాలతో డంప్ యార్డు నిండిపోయింది.

 దీంతోనే యార్డులోని చెత్తను క్లీన్​ చేసి, ఎరువుగా మార్చేందుకు రెండేండ్ల కిందట స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.37 కోట్లతో బయో మైనింగ్ ప్రక్రియ చేపట్టారు. డంప్​ యార్డులో 3 లక్షల టన్నుల వ్యర్థాలను ట్రీట్​మెంట్​ చేసేందుకు చెన్నైకి చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్ట్​ ఇవ్వగా..  వర్షాలు, బిల్లులు, తదితర సమస్యల కారణంగా ఇంతవరకు సగం కూడా పని పూర్తి కాలేదు. దీంతో రోజువారీగా వెలువడుతున్న చెత్త సమస్యగా మారగా.. గత్యంతరం లేక డంప్​ యార్డు సిబ్బంది ప్రతిరోజు సాయంత్రం చెత్తకు నిప్పంటిస్తున్నారు. ఫలితంగా ఆ చుట్టుపక్కల ఉన్న మడికొండ, రాంపూర్​, మిని టెక్స్​ టైల్​ పార్క్​, మోడల్​ కాలనీ, ఎలుకుర్తి గ్రామాల ప్రజలు డంప్​ యార్డు పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మడికొండలో కొత్త పాంట్​

మడికొండ డంప్​ యార్డులో  ఇప్పటికే బయో మైనింగ్ నడుస్తుండగా.. రోజువారీగా వచ్చే చెత్తను శుద్ధి చేయడానికి అది కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతోనే అక్కడే గోబర్​ ధన్​ స్కీం కింద బయో గ్యాస్ ప్లాంట్​ ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు చేశారు. దాంతో పాటు అక్కడే చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే ప్లాంట్​ ను ఏర్పాటు చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల కిందట దక్షిణ కొరియా దేశానికి చెందిన సేజింగ్ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి డంప్​ యార్డును పరిశీలించారు. ల్యాండ్​ ఫిల్​ గ్యాస్​  ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా వివరించి వెళ్లారు. 

కాగా అక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్​ ఏర్పాటు చేస్తే డంప్​ యార్డు సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనల్లో ఉన్న అధికారులు పాత ప్రాజెక్టును పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా మడికొండ ప్లాంట్​ వినియోగంలోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండగా.. అప్పటివరకు బాలసముద్రంలోని యూనిట్​ ను వినియోగించుకుంటే ఓ వైపు చెత్త ప్రాసెస్​ అవడంతో పాటు డంప్​ యార్డుపై ఎంతోకొంత భారం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

ప్లాంట్ పెట్టి వదిలేసిన్రు

నగరంలో వెలువడుతున్న తడి చెత్తను ట్రీట్​మెంట్ చేసి, దానిని నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు స్వచ్ఛ భారత్​ మిషన్​ కింద హనుమకొండ బాలసముద్రంలోని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ క్యాంప్​ ఆఫీస్​ ఎదురుగా ఉన్న స్థలంలో బయో మిథనేషన్ కమ్​ ఎలక్ట్రిసిటీ జనరేషన్​​ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి రోజు రెండు టన్నుల వరకు తడి చెత్తను ప్రాసెస్​ చేసి, బయో గ్యాస్​,  విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ప్లాన్​ చేశారు. అనుకున్నట్టుగానే ప్లాంట్ ఏర్పాటు చేసిన అధికారులు దానిని వినియోగంలోకి తేవడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా గత నాలుగైదేండ్ల నుంచి ఆ ప్రాజెక్టు నిరుపయోగంగానే ఉంటోంది. వాస్తవానికి బాలసముద్రంలోని గ్రేటర్ కమిషనర్​ క్యాంప్​ ఆఫీస్ ఎదుటే ఈ ప్రాజెక్టు ఉన్నా దానిపై ఎవరూ పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం గమనార్హం.