కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ‘నోటా’ ఉండదు

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ‘నోటా’ ఉండదు

కంటోన్మెంట్, వెలుగు : సికింద్రాబాద్‌‌‌‌ కంటోన్మెంట్‌‌‌‌ బోర్డు ఎన్నికల్లో ‘నోటా’ ఉండదని అధికారులు వెల్లడించారు. 8 వార్డుల ఓటర్ల కోసం వాడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో నోటా ఆప్షన్ ఉండదని చెప్పారు. 2015లో కంటోన్మెంట్​బోర్డు పాలక మండలి సభ్యులకు జరిగిన ఎన్నికల్లో మొదటి సారి ఈవీఎంలను ఉపయోగించారు. ఏప్రిల్ 30న జరగబోయే పోలింగ్‌‌‌‌కు రెండోసారి వీటిని ఉపయోగిస్తున్నారు. కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్​ 2007 ప్రకారం ఎన్నికల్లో ఓటింగ్​కోసం ఉపయోగించే ఈవీఎంలలో నోటా ఆప్షన్ ఉండాలనే నిబంధనలు లేవని, ఆ రూల్స్‌‌‌‌కు లోబడి ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నోటా ఆప్షన్ లేకుండా ఈవీఎంలను తయారు చేయించి అందజేయాలని తెలంగాణ ఎన్నికల కమిషన్​ను కోరనున్నట్లు బోర్డు సీఈవో మధుకర్ నాయక్ వెల్లడించారు. కంటోన్మెంట్‌‌‌‌లోని 8 వార్డుల్లో 1,32,722 మంది ఓటర్లు ఉన్నారు. బుధవారం నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఓటరు నమోదులో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. కొత్త ఓటర్లుగా ఎంతమంది నమోదవుతారనే దాన్ని బట్టి తమకు ఎన్ని ఈవీఎంలు కావాలనేది ఈసీకి చెప్పనున్నారు.

ఇయ్యాల వార్డుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడి

ఓటరు జాబితాలో నమోదు చేసుకోని వారు, పేర్లు మిస్సయిన వారు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 6న ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే దాఖలు చేయవచ్చు. దీనిపై 10న విచారణ చేపట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. బుధవారం బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డుల రిజర్వేషన్ల వివరాలతో కూడిన జాబితాను ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు.

28 వేల ఓట్లు తొలగింపు

కంటోన్మెంట్‌‌‌‌లోని రక్షణ శాఖ, ఎయిర్​పోర్టు అథారిటీ స్థలాల్లో ఉన్న బస్తీల ఓట్లను నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోర్డు అధికారులు తొలగించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 28,123 ఓట్లను 2018 జులై 2న తొలగించారు. అత్యధికంగా రెండో వార్డులో 17,687 పేర్లు, అతి తక్కువగా నాలుగో వార్డులో 519 పేర్లు తీసేశారు. అధికారులు గతేడాది ఒకసారి ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. తాజాగా మరోసారి ఓటరు నమోదు చేపడుతున్నారు.

అభ్యర్థులకు 70 గుర్తులు

కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యుల ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగనున్నాయి. అభ్యర్థులంతా రాజకీయ పార్టీల నుంచి పరోక్షంగా మద్దతు పొందడమే తప్ప.. నేరుగా పార్టీల సింబల్స్ కేటాయించే పద్ధతి దేశవ్యాప్తంగా జరుగుతున్న 57 కంటోన్మెంట్​బోర్డుల్లో ఎక్కడా లేదు. దీంతో అభ్యర్థులు కంటోన్మెంట్ ఎన్నికల విభాగం కేటాయించే ప్రైవేటు సింబల్స్​తోనే పోటీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 70 రకాల గుర్తులను కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 10న గుర్తులను అభ్యర్థుల ఎంపికల ప్రాధాన్యతను బట్టి కేటాయిస్తారు.